Lokesh: నాలుగేళ్లు పూర్తవుతున్నా... జగన్‌కు అభివృద్ధిపై ఆలోచన లేదు
ABN, First Publish Date - 2023-03-10T14:29:26+05:30
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది.
తిరుపతి: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Nara lokeshYuvaGalam Padayatra) చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. 39వ రోజు పాదయాత్రలో లోకేష్ (YuvaGalam)ను మదనపల్లి ప్రముఖులు, విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ప్రతినిధులు కలిసి తమ సమస్యలను చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తికావస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan Reddy) కి రాష్ట్రాభివృద్ధిపై ఎటువంటి ఆలోచనా లేదన్నారు. అధికారంలోకి వచ్చాక కూల్చివేతలు, ఉన్నకంపెనీలను బెదిరించి పంపడం తప్ప ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. మున్సిపాలిటీలు, స్థానికసంస్థలను పూర్తిగా దివాలా తీయించి కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టలేని దుస్థితికి తెచ్చారన్నారు. మదనపల్లి టమోటా రైతుల కష్టాలు తీర్చే విషయంలో టీడీపీకి స్పష్టమైన విజన్ ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజిల ఏర్పాటు ద్వారా టమోటా రైతుల కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. మదనపల్లి పట్టణ సమస్యల పరిష్కారానికి ప్రణాళిక బద్ధంగా కృషిచేస్తామన్నారు.
రాష్ట్రంలోని వేల కోట్ల రూపాయల ప్రముఖ ట్రస్టులు, ఎయిడెడ్ భూముల ఆస్తులను కొట్టేయాలన్న దుర్భుద్ధితోనే జగన్ ప్రభుత్వం విలీనం నాటకానికి తెరలేపిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో నాణ్యమైన విద్యనందించిన క్రిస్టియన్, మైనారిటీ ఎయిడెడ్ విద్యాసంస్థలను బలవంతంగా స్వాధీనం చేసుకొని పేదలకు విద్యను దూరం చేస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి దోపిడీ విధానాలకు విద్యాసంస్థలు కూడా బలిపశువులుగా మారాయన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న లక్షలాది విద్యార్థులకు ఉత్తమ విద్యను దూరం చేశారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాసంస్థల్లో రాజకీయ జోక్యాన్ని నివారిస్తామన్నారు. ఆయా కళాశాలల్లో సౌకర్యాలను మెరుగుపర్చి నాణ్యమైన విద్యను అందిస్తాంమని తెలిపారు. రాయలసీమలోనే పేరెన్నికగన్న మదనపల్లి బీటీ కళాశాలకు గత వైభవాన్ని తీసుకువస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
యువగళం పాదయాత్ర 39వరోజు పూలవాండ్లపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. మార్గమధ్యంలో పాలఏకిరి, బోయ సామాజికవర్గాల ప్రతినిధులు వారి సమస్యలను వివరించారు. మదనపల్లి రూరల్ చిన తిప్పసముద్రం వద్ద 500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా.. టమోటా ప్రాసెసింగ్ యూనిట్ - కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు యువనేత హామీ ఇచ్చారు. చేనేతలు, ముస్లింలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. కొత్తవారిపల్లి, ఎనుమువారిపల్లి, తురకపల్లి వద్ద లోకేష్‌కు అపూర్వ స్వాగతం లభించింది.
Updated Date - 2023-03-10T14:29:26+05:30 IST