YV Subbareddy: చిరుత దాడిలో గాయపడ్డ బాలుడిని పరామర్శించిన టీటీడీ చైర్మన్
ABN, First Publish Date - 2023-06-23T09:33:35+05:30
తిరుమల నడకమార్గంలో నాలుగేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసిన ఘటనపై టీటీడీ చైర్మన్ స్పందించారు. శుక్రవారం ఉదయం చిరుత దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని టీటీడీ చైర్మన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిరుత దాడిలో గాయపడిన బాలుడు క్షేమంగా ఉన్నాడన్నారు. చిన్నపిల్లల ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. బాలుడి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు.
తిరుపతి: తిరుమల నడకమార్గంలో నాలుగేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసిన ఘటనపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy) స్పందించారు. చిరుత దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని శుక్రవారం ఉదయం టీటీడీ చైర్మన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిరుత దాడిలో గాయపడిన బాలుడు క్షేమంగా ఉన్నాడన్నారు. చిన్నపిల్లల ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. బాలుడి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. ఆదోనికి చేందిన భక్తులు అలిపిరి నడక మార్గం గుండా తిరుమలకు వెళ్తుండగా నిన్న రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఏడో మైలు వద్ద ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. నడక మార్గంలో కొండపైకి వెళ్తున్న సమయంలో బాలుడిపై చిరుత దాడి చేసిందని.. బాలుడి కేకలు వేయడంతో అటవీ ప్రాంతంలో కొద్ది దూరంలో వదిలి పెట్టిందని అన్నారు. బాలుడి ఆచూకీ కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్ళిన విజిలెన్స్ సిబ్బంది బాలుడి ఏడుపు విని బయటకు తీసుకొచ్చారన్నారు. ఘటన జరిగిన క్షణాల్లోని టిటిడి అధికారులు స్పందించారని తెలిపారు. బాలుడిని మెరుగైన వైద్యం కోసం చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించామన్నారు. ఎంత ఖర్చైనా బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. మరో రెండు రోజుల్లో బాలుడు క్షేమంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్ అయ్యే అవకాశం ఉందన్నారు. బాలుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పామని అన్నారు. నడక మార్గంలో మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దేవుడి ఆశీస్సులతోనే బాలుడు క్షేమంగా ఉన్నాడని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-06-23T09:33:35+05:30 IST