Pawan Kalyan Chandrababu: మీకేమైనా అభ్యంతరమా? పవన్ వ్యాఖ్యలపై బాబు ఆశ్చర్యం
ABN , First Publish Date - 2023-09-15T04:43:53+05:30 IST
‘మీ స్థాయి వ్యక్తులకు ఇలాంటి పరిస్థితి తీసుకురావడం దుర్మార్గానికి పరాకాష్ఠ. మిమ్మల్ని ఇలాంటి చోట చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబును కలిశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... టీడీపీ-జనసేన పొత్తుపై పవన్ కల్యాణ్ అప్పటికప్పుడే
పొత్తు ప్రకటనపై ములాఖత్‌లోనే ప్రస్తావన
అలాగే చేద్దామన్న చంద్రబాబు
ఆ తర్వాత పవన్ విస్పష్ట ప్రకటన
జైలులో బాబును చూసి జనసేనాని ఆవేదన
అమరావతి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘మీ స్థాయి వ్యక్తులకు ఇలాంటి పరిస్థితి తీసుకురావడం దుర్మార్గానికి పరాకాష్ఠ. మిమ్మల్ని ఇలాంటి చోట చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబును కలిశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... టీడీపీ-జనసేన పొత్తుపై పవన్ కల్యాణ్ అప్పటికప్పుడే చంద్రబాబుకు సమాచారం ఇవ్వడం, ఆయన కూడా అంగీకరించడం జరిగిపోయింది. పొత్తుపై ఇప్పటికే రెండు పార్టీల మధ్య సానుకూల వాతావరణం నెలకొంది. ఎన్నికలు ఇప్పట్లో లేనందున... అధికారిక ప్రకటనపై మాత్రమే వేచి చూసే ధోరణిలో ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో దీనిపై సత్వరం స్పష్టత ఇచ్చేయాలనే నిర్ణయానికి పవన్ వచ్చినట్లు తెలుస్తోంది.
ములాఖత్‌లో చంద్రబాబును చూడగానే, ఎలా ఉన్నారు... ఆరోగ్యం ఎలా ఉందని పవన్ అడిగారు. బాగానే ఉన్నానని చంద్రబాబు బదులిచ్చారు. తర్వాత వారి మధ్య వైసీపీ ప్రభుత్వ అణచివేత వైఖరి, ప్రజా వ్యతిరేక విధానాలపై కొంత చర్చ జరిగింది. ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పొత్తుపై బహిరంగ ప్రకటన చేద్దామని నిర్ణయించుకునే ఇక్కడికి వచ్చానని పవన్ అన్నారు. ‘‘ఇప్పుడేనా, ఇంత హఠాత్తుగానా’ అని చంద్రబాబు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘నావైపు నుంచి నేను నిర్ణయం తీసుకునే వచ్చాను. మీకేమైనా అభ్యంతరమా’’ అని పవన్ పేర్కొన్నారు. ‘‘అన్నీ ఆలోచించుకుని వస్తే ఓకే! పొత్తుపై ప్రకటన చేసేయవచ్చు’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో... ‘నీ అభిప్రాయం ఏమిటి’ అని లోకేశ్‌ను ప్రశ్నించారు. ‘‘మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే’’ అని లోకేశ్‌తోపాటు బాలకృష్ణ కూడా చెప్పారు. దీంతోపాటు ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలనే అంశంపైనా వారందరిమధ్య స్వల్ప చర్చ జరిగింది.
అంతా ఒక నిర్ణయానికి రావడంతో... ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పొత్తుపై పవన్ విస్పష్టమైన ప్రకటన చేశారు. జగన్ సర్కారు పెడుతున్న కేసులకు సంబంధించి న్యాయపరంగా తాము చేపడుతున్న చర్య లు, లాయర్ల అభిప్రాయాలను పవన్‌కు లోకేశ్ వివరించారు.