ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kanna Lakshminarayana: జనసేనలోకి కన్నా..? పవన్‌కు అండగా నిలబడతానన్న వ్యాఖ్యల వెనక పెద్ద కథే ఉందట..!

ABN, First Publish Date - 2023-01-04T16:17:33+05:30

ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ ముఖ్య నేత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారా..? ఈ మాజీ అధ్యక్షుడికి, ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడికి అస్సలు పొసగడం లేదా..? సోము వీర్రాజు తీరుపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ ముఖ్య నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారా..? ఈ మాజీ అధ్యక్షుడికి, ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడికి అస్సలు పొసగడం లేదా..? సోము వీర్రాజు (Somu Veerraju) తీరుపై కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు గుర్రుగా ఉన్నారు..? వీర్రాజును మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పదేపదే ఎందుకు తప్పుబడుతున్నారు..? తాజాగా కన్నా చేస్తున్న ఆరోపణలేంటి..? పవన్‌కు (Pawan Kalyan) అండగా నిలబడతానని కన్నా చేసిన ప్రకటన జనసేనలో (Janasena) చేరుతున్నట్లుగా సంకేతాలు ఇస్తున్నాయా..? ఏపీ బీజేపీలో (AP BJP) ముదురుతున్న ముసలం, కన్నా లక్ష్మీ నారాయణ తాజా వ్యాఖ్యలపై ప్రత్యేక కథనం.

సోమువీర్రాజు తీరుపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అసహనం వ్యక్తం చేయడం ఏపీ బీజేపీలో వర్గ పోరుకు తాజాగా నిదర్శనంగా నిలిచింది. బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పును కన్నా తప్పుబట్టారు. కోర్ కమిటీలో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారని, అధ్యక్షుల మార్పుపై తనతో చర్చించలేదని సోము వీర్రాజు తీరును కన్నా లక్ష్మీనారాయణ బహిరంగంగానే తప్పుబట్టారు. ఇప్పుడు తొలగించిన వాళ్లంతా తాను నియమించిన వారేనని కన్నా చెప్పారు. కోర్ కమిటీ సమావేశం తప్ప పార్టీలో ఏ సమాచారం తెలియడం లేదని, గతంలో బీజేపీలోకి ఎంతోమందిని తీసుకువచ్చానని, ఇప్పుడు వారంతా ఎందుకు వెళ్తున్నారో వీర్రాజు సమాధానం చెప్పాలని కన్నా డిమాండ్ చేశారు. తన వియ్యంకుడు BRSలో ఎందుకు చేరారో సోమువీర్రాజు చెప్పాలని కన్నా ప్రశ్నలు సంధించారు. ఇక్కడ పవన్‌ను, అక్కడ బండి సంజయ్‌ను బలహీనపరిచేందుకు కుట్ర జరుగుతోందని కన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. పవన్‌కు అండగా నిలబడతానని కన్నా ప్రకటించడం కొసమెరుపు. ఈ ఒక్క వ్యాఖ్యతో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి జనసేనలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. పైగా.. బీజేపీపై గౌరవమున్నా ఊడిగం మాత్రం చేయనని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ ఏపీ బీజేపీలో అడపాదడపా చర్చ నడుస్తూనే ఉంది.

బీజేపీపై, మోదీపై గౌరవం ఉందంటూనే.. ఊడిగం చేయనని.. రోడ్డు మ్యాప్‌ ఇవ్వకపోతే కాలం గడిచిపోతుందని.. రౌడీలు రాజ్యాలు ఏలుతుంటే, గూండాలు గదమాయిస్తుంటే.. ప్రజల్ని రక్షించుకోవడానికి వ్యూహాలు మార్చుకోవాల్సి వస్తోందని అనడం అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. దీనికితోడు టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో పవన్‌ను ఆకస్మికంగా కలిసి గంటకుపైగా చర్చించడం.. జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని నిర్ణయించడంతో.. బీజేపీ జాతీయ నాయకత్వం ఆ సందర్భంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును ఢిల్లీ పిలిపించింది. మాస్‌లో క్రేజున్న పవన్‌తో సరిగా సమన్వయం చేసుకోలేకపోయారని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా క్లాసు తీసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. రాష్ట్రంతో ఏ మాత్రం సంబంధంలేని ఒక ఎంపీ చెప్పుచేతల్లో వీర్రాజు పార్టీని నడిపిస్తున్నారని.. దీనివల్లే జనసేనతో కలిసి జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమించలేదని చీవాట్లు పెట్టినట్లు బీజేపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

సోము వీర్రాజు వైఖరిపై గతంలో కూడా ఏపీ బీజేపీలో అంతర్గతంగా విస్తృతంగా చర్చ జరిగింది. సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటి నుంచి గతంలో ఈ పార్టీలో లేని సంస్కృతి ఒకటి వచ్చింది. అప్పటి వరకూ అధ్యక్షుడిగా కొనసాగిన కన్నా లక్ష్మీనారాయణ బృందంలోని నాయకులెవ్వరినీ తన టీమ్‌లోకి తీసుకోనని ఆయన స్పష్టంగా చెప్పడంతో కమలనాథులు అవాక్కయ్యారు. చెప్పిన విధంగానే తనకు నచ్చిన వారికి పార్టీలో కీలక పదవులు అప్పగించి.. పార్టీ కంటే తనకోసమే పనిచేసేలా చూసుకున్నారు. కొందరు జిల్లా అధ్యక్షులను మార్చలేని పరిస్థితుల్లో అక్కడ తన వారిని ప్రధాన కార్యదర్శులుగా నియమించి వ్యవహారం నడిపించారు. వైసీపీకి పూర్తి అనుకూలంగా మారిపోయి అమరావతి రాజధానిపై ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. అమిత్‌ షా దెబ్బకు అమరావతికి మద్దతు పలకాల్సి వచ్చింది. అయినా జనం నమ్మడం లేదు. ఆ పార్టీ.. జనసేనతో స్నేహం.. వైసీపీతో కాపురం చేస్తున్నట్లు భావిస్తున్నారు.

వీర్రాజు అమరావతిలో పర్యటించినప్పుడు.. ‘మీరూ.. జగన్‌ ఒక్కటేగా..’ అని రాజధాని రైతులు ఈసడించిన సంగతి తెలిసిందే. అమరావతికి జై కొట్టిన పవన్‌.. రైతులకు మద్దతుగా ఉద్యమిద్దామనే ప్రతిపాదన తెచ్చినా.. వైసీపీ ఎజెండా ప్రకారం నాన్చుతూ వచ్చింది. ప్రజల ప్రధాన సమస్యలపై జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ రోడ్డెక్కలేదు. అడపాదడపా నిరసనలు తెలిపినా.. మిత్రపక్షమైన జనసేనను కలుపుకొని పోలేదు. భీమ్లా నాయక్‌ సినిమా విషయంలో జగన్‌ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించని బీజేపీ నేతల తీరుపై పవన్‌ అసంతృప్తికి లోనయ్యారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో మద్దతిచ్చినా.. ఆ తర్వాత బద్వేల్‌ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీకి మద్దతివ్వలేదు. దీంతో వీర్రాజు నాయకత్వంలోని బీజేపీ మూడు చోట్లా డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. ఇదిపార్టీ శ్రేణులను నిరుత్సాహానికి గురిచేసింది. అదే సమయంలో తెలంగాణలో బండి సంజయ్‌ నాయకత్వంలో దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది.

పొరుగు రాష్ట్రంలో మాజీ మంత్రులు బీజేపీలో చేరుతుంటే ఏపీలో కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో చేరిన మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు లాంటి వాళ్లు వీర్రాజు తీరుతో పార్టీకి గుడ్‌బై చెప్పారు. పవన్‌ను దూరం చేసుకోవడం కూడా పూర్తిగా రాష్ట్ర నాయకత్వ స్వయంకృతాపరాధమేనన్న మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలతో మెజారీటీ నేతలు ఏకీభవించిన పరిస్థితి. ఇలా జనసేనతో పెరిగిన దూరం, తన వర్గానికి దక్కని ఆదరణతో కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జనసేనలో చేరేందుకు దాదాపుగా సిద్ధమవుతున్నట్లు సమాచారం. పవన్‌కు అండగా నిలుస్తానని తాజాగా కన్నా చేసిన ప్రకటనతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

Updated Date - 2023-01-04T17:05:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising