Ayyannapatrudu: ఆ భూమిని కాజేసేందుకు ఏ2 విజయసాయి కుట్ర.. దానిజోలికి వెళ్లొద్దు
ABN, First Publish Date - 2023-08-22T12:54:26+05:30
విశాఖలోని భీమునిపట్నం ప్రాంతం తుర్లవాడ కొండపై 120 ఎకరాలు కాజేసేందుకు ఏ-2 విజయసాయిరెడ్డి
అమరావతి: విశాఖలోని భీమునిపట్నం ప్రాంతం తుర్లవాడ కొండపై 120 ఎకరాలు కాజేసేందుకు ఏ-2 విజయసాయిరెడ్డి (Vijayasaireddy) కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తుర్లవాడ ఆధ్యాత్మిక క్షేత్రం అని దీని జోలికి రావొద్దని అన్నారు. విజయసాయిరెడ్డి తన కూతురు విద్యాసంస్థల నిర్మాణం కోసం 120 ఎకరాలు కేటాయించాలని జగన్ రెడ్డిని (CM Jagan reddy)కోరారని.. రూ.300 కోట్ల విలువైన భూమిని విజయసాయిరెడ్డికి బహుమతిగా ఇవ్వడానికి జగన్ రెడ్డి యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తిని జగన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు దానం చేస్తున్నారని మండిపడ్డారు. కొండపై 120 అడుగుల నరసింహస్వామి విగ్రహం ప్రతిష్టించాలని స్థానికులు టీటీడీని (TTD) కోరుతున్నారని మాజీ మంత్రి తెలిపారు.
ఇప్పటికే టీటీడీ, సింహాచలం ఆస్తులు దోచేశారన్నారు. దేవుడిని టచ్ చేయవద్దని జగన్ రెడ్డిని కోరుతున్నామన్నారు. ఇప్పటికే విశాఖలో జగన్ రెడ్డి అండ్ కో రూ.70 వేల కోట్ల ఆస్తులు దోచుకున్నారని ఆరోపించారు. రుషికొండపై మంత్రి రోజా పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో దోపిడీపై సీనియర్ నేతలు బొత్స, ధర్మాన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విశాఖలో జరుగుతున్న దోపిడీ, అన్యాయంపై మేధావివర్గం మాట్లాడాలని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రుషికొండపై నిర్మాణాలను పడగొడతామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రెడ్డి దోపిడీ మొత్తం బయటకు తీస్తామని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.
Updated Date - 2023-08-22T12:54:26+05:30 IST