Kanna: సీఎం జగన్ ఉద్యోగులను నమ్మించి మోసం చేశారు...
ABN, First Publish Date - 2023-04-11T16:52:34+05:30
గుంటూరు జిల్లా: నాలుగేళ్ల వైకాపా పాలన రాష్ట్రానికి శాపమని, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మక ద్రోహం చేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
గుంటూరు జిల్లా: నాలుగేళ్ల వైకాపా (YCP) పాలన రాష్ట్రానికి శాపమని, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) నమ్మక ద్రోహం చేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘‘సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి ఉద్యోగులను నమ్మించి మోసం చేయలేదా?.. మద్యపాన నిషేధం హామీ విస్మరించటం ద్రోహం కాదా?.. 25 మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి చేసింది ద్రోహం కాదా?.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం నమ్మక ద్రోహం కాదా?.. పోలీసులను సొంత కార్యకర్తల మాదిరిగా వాడుతూ, ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టింది నిజం కాదా?’’ అని ప్రశ్నించారు.
కనీసం నాసిరకం విత్తనాలపై రైతులు ఫిర్యాదు చేసే పరిస్థితి లేదని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రంలో యథేచ్ఛగా భూ కబ్జాలు, ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా చేసి సీఎం జగన్ ద్రోహం చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చి.. ఏపీ పరువు తీశారన్నారు. జగన్ రెడ్డి అడుగడుగునా రాష్ట్ర ప్రజలకు నమ్మక ద్రోహం చేశారన్నారు. నాలుగేళ్ళల్లో రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. కేసులకు రాజీపడి ప్రత్యేక హోదా తేలేకపోయారని ఎద్దేవా చేశారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేయలేదా? అని ప్రశ్నించారు. నాలుగేళ్లలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కు పోయిందని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-04-11T16:52:34+05:30 IST