Meruga Nagarjuna: అప్పుడు చిరంజీవి నోరు మూగబోయిందా?
ABN, First Publish Date - 2023-08-09T17:22:36+05:30
చిరంజీవి దేశానికి మంత్రిగా చేశారు. రాష్ట్రం విడిపోతున్న సమయంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై అప్పట్లో చిరంజీవి మాట్లాడంలో విఫలమయ్యారు. రాష్ట్రం విడిపోతున్న సమయంలో చిరంజీవి నోరు మూగబోయిందా?
అమరావతి: వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకల్లో ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు, వైసీపీ నాయకుల కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో మంత్రి మేరుగ నాగార్జున కౌంటర్ ఇచ్చారు. ‘‘చిరంజీవి దేశానికి మంత్రిగా చేశారు. రాష్ట్రం విడిపోతున్న సమయంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై అప్పట్లో చిరంజీవి మాట్లాడంలో విఫలమయ్యారు. రాష్ట్రం విడిపోతున్న సమయంలో చిరంజీవి నోరు మూగబోయిందా? అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడితే ఏం ప్రయోజనం?. అవసరం ఉన్నప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు వేదాంతం చెబితే ఎవరు నమ్ముతారు.’’ అంటూ చిరంజీవిని ఉద్దేశించిన మంత్రి వ్యాఖ్యానించారు.
‘‘ఏపీలో సామాజిక విప్లవం, ఎదుగుదల నడుస్తోంది. చంద్రబాబు హయాంలో కళ్యాణమస్తు పథకంలో లబ్దిదారులకు ఎగ్గొట్టారు. చంద్రబాబు హయాంలో 17760 మందికి ఇవ్వాల్సిన రూ.68 కోట్లు ఎగ్గొట్టారు. చంద్రబాబు హయాంలో ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్టీలకు రూ.50 వేలు బీసీలకు రూ.35 వేలు అరకొరగా ఇచ్చేవారు. సీఎం జగన్ వచ్చాక ఎస్టీలకు రూ.1.20 లక్షలు, ఎస్సీలకు రూ.లక్ష, బీసీలకు రూ.50 వేలు ఇస్తున్నాం. వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్ షాదీ తోఫా కింద రూ.141 కోట్లు విడుదల చేశారు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పుకుని.. అఘాయిత్యాలు చేస్తూ మేము బతకడం లేదు. దెయ్యాలు వేదాలు వల్లిస్తాయి. చంద్రబాబు కరడు గట్టిన దెయ్యం. పోలీసు వ్యవస్థను చిన్నాభిన్నం చేసి వారిపై దాడి చేస్తే కేసులు పెట్టక ఏం చేస్తారు. చంద్రబాబును తప్పకుండా అరెస్టు చేయాల్సిందే. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఇలాగేనా వ్యవహరిస్తారు. పోలీసులు, ప్రజలపై చంద్రబాబు దాడులు చేయించారు. పరిపాలనను పక్కదోవపట్టించాలని చంద్రబాబు ప్రయత్నించారు.’’ అని మంత్రి మండిపడ్డారు.
సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమా 200 రోజులు వేడుకల్లో చిరంజీవి మాట్లాడుతూ.. 'యాక్టర్ల రెమ్యూనరేషన్‌పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంగా ఫీల్మ్ ఇండస్ట్రీపై పడతారెందుకు?. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి, పేదవారి కడుపు నింపే ఆలోచనలు చేయాలంటూ' చిరంజీవి హితవు పలికారు.
Updated Date - 2023-08-09T17:22:36+05:30 IST