సందడిగా.. సంక్రాంతి
ABN , First Publish Date - 2023-01-17T00:18:02+05:30 IST
గత రెండేళ్లు కరోనా కారణంగా సంక్రాంతి పండగని చాలా ప్రాంతాల్లో కోలాహలంగా జరుపుకోలేదు. ఈ ఏడాది కరోనా భయం పూర్తిగా తొలగిపోవడంతో వేల సంఖ్యలో ప్రజలు పండగని స్వస్థలాల్లో జరుపుకొనేందుకు నాలుగు రోజులు ముందుగానే వచ్చేశారు.

భోగిమంటలు.. పిండివంటలు.. బొమ్మల కొలువులు.. ఇంటి ముంగిట రంగవల్లులు.. డూడూ బసవన్నలు.. హరిదాసులు కీర్తనలు.. బంధుమిత్రుల కలయికలు.. ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మూడు రోజులపాటు పల్లె, పట్టణాలు కోలాహలంగా మారాయి. దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉద్యోగ, వృత్తి రీత్యా దూరప్రాంతాల్లో నివసించేవారు తమతమ పల్లెలకు వచ్చి ఉత్సాహంగా పండుగ జరుపుకొని.. ఎన్నో జ్ఞాపకాలను మూటగట్టుకుని తమ ఊర్లకు బయలుదేరారు.
గుంటూరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): గత రెండేళ్లు కరోనా కారణంగా సంక్రాంతి పండగని చాలా ప్రాంతాల్లో కోలాహలంగా జరుపుకోలేదు. ఈ ఏడాది కరోనా భయం పూర్తిగా తొలగిపోవడంతో వేల సంఖ్యలో ప్రజలు పండగని స్వస్థలాల్లో జరుపుకొనేందుకు నాలుగు రోజులు ముందుగానే వచ్చేశారు. భోగి మంటలు, ఇంటిల్లిపాది ఒక చోటికి చేరి పిండివంటలు తయారు చేయడం, గోదాదేవి కల్యాణం, బొమ్మల కొలువు, చిన్నపిల్లలకు భోగిపండ్లు పోయడం, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు వంటి కార్యక్రమాల్లో సంతోషంగా పాలుపంచుకొన్నారు. కనుమ రోజున మాంసాహార వంటకాలతో ఇళ్లు ఘుమఘుమలాడిపోయాయి. పిల్లలకు కొత్త దుస్తులు కొనిపెట్టడం, ఇష్టమైన వంటకాలు చేసి పెట్టి పెద్దవాళ్లు మురిసిపోయారు. ఏటా వచ్చే పండగే అయినా ఏ సంవత్సరం ఆ సంవత్సరం కొత్తే అన్నట్లుగా ధూం ధాంగా ఎవరి స్తోమత మేరకు వాళ్లు ఈ సారి సంక్రాంతి పండగని ఘనంగా జరుపుకొన్నారు. కొంతమంది సమీపంలోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. అలానే ఎగ్జిబిషన్‌లు, సినిమాలకు కుటుంబ సమేతంగా వెళ్లి వీక్షించారు. పండగ సందర్భంగా కొత్త గృహోపకరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరచడంతో జిల్లాలోని ఎలకా్ట్రనిక్స్, హోం ఫర్నీచర్ దుకాణాలు సందడిగా మారాయి. పండగ మూడు రోజులు ఇట్టే ముగియడంతో ఈ ఆనందాల కోసం మళ్లీ వచ్చే ఏడాది వరకు వేచి చూడాలన్న భావోద్వేగాలతో రైల్వేస్టేషన్‌లు, బస్టాండ్లకు పెద్ద వాళ్లు వెళ్లి వీడ్కోలు పలికారు.
అంబరాన్నింటిన సంబరాలు..
గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సంక్రాంతి సంబరాలు ఆదివారంతో ముగిశాయి. ప్రదర్శనలు ఆహూతులను అబ్బురపరిచాయి. బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల్లో పెద్దఎత్తున వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోన రఘుపతి కోన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు, సంగీతవిభావరి, జబర్దస్త్‌టీమ్ చమ్మక్ చంద్ర కామెడీషో ఏర్పాటు చేశారు. తెలుగు దేశంపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పార్టీశ్రేణులు చీకటి జీవో నెంబరు1 నకళ్ళను భోగిమంటలలో దగ్ధం చేశారు. కలెక్టరేట్‌లో, జిల్లా పోలీసు కార్యాలయంలో పెద్దఎత్తున వేడుకలు నిర్వహించారు. భావపురి బ్రాహ్మణసమైక్య ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.
చుట్టాలు తిరుగు ప్రయాణం..
సంక్రాంతి చుట్టాలు తిరుగు ప్రయాణమయ్యారు. భోగి, సంక్రాంతి, కనుమ పండగలను కుటుంబ సభ్యుల మద్యన ఆనందోత్సాహాలతో జరుపుకొని కొత్త అనుభూతులతో ఉద్యోగరీత్యా నివాసం ఉండే ప్రదేశాలకు బయలుదేరారు. పిల్లలకు మరో రెండు రోజులు సెలవులు ఉండటంతో కొంతమంది మంగళ, బుధవారాల్లో వెళ్లేందుకు ప్రణాళిక చేసుకోగా ఆఫీసులు, పనులకు వెళ్లే వారు మాత్రం సోమవారం ప్రయాణమయ్యారు. దీంతో గుంటూరు రైల్వేస్టేషన్ రద్దీగా మారింది. మధ్యాహ్నం వచ్చిన జన్మభూమి, సాయంత్రం వరంగల్, నడికుడి మార్గంలో సికింద్రాబాద్‌కి వెళ్లే రెండు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు, రాత్రి నరసపూర్, చెన్నై, నారాయణాద్రి, విశాఖ, స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వెళ్లిపోయారు. మంగళ, బుధవారం కూడా కొంతమంది ప్రయాణం కానుండటంతో ఆ రోజుల్లో రైళ్లలో టిక్కెట్‌లన్నీ బుకింగ్ అయిపోయాయి.
=================================================================