ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP and Jana Sena : కలిసే బరిలోకి

ABN, First Publish Date - 2023-09-15T04:21:35+05:30

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన (TDP, Jana Sena)కలసి వెళ్తాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) ప్రకటించారు. శుక్రవారం నుంచే ఉమ్మడి కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ(PMMODI), కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కూడా తెలియజేస్తామని.. బీజేపీ సైతం తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఉమ్మడిగానే పోటీ: పవన్‌

నేటి నుంచే ఇరుపార్టీల ఐక్య కార్యాచరణ

మోదీ, అమిత్‌షాకూ తెలియజేస్తాం

బీజేపీ కూడా కలిసొస్తుందని భావిస్తున్నా

బాబు అరెస్టు ముమ్మాటికీ రాజకీయ ప్రతీకారమే

సైబరాబాద్‌ రూపశిల్పి జైల్లో ఉండడం బాధాకరం

రాయి వేసేటప్పుడు ఆలోచించుకోండి

వైసీపీ నాయకులందరికీ చెబుతున్నా

మీకు యుద్ధం కావాలంటే అదే ఇస్తాం

పోలీసులు బానిసత్వంతో ఉంటే ఇక ఎవరూ ఏమీ చేయలేరు

ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు

ఇసుక, మైనింగ్‌, బెల్ట్‌షాపులు సహా అన్నీ బయటకు తీసుకొస్తాం

ఆయన్ను లోపల పెట్టినప్పుడు మిమ్మల్ని మేం ఎందుకు పెట్టం?

జగన్‌పై జనసేనాని ఫైర్‌

జైలులో చంద్రబాబుతో ములాఖత్‌

జగన్‌ మద్దతుదారులూ ఆలోచించుకోండి. నన్ను, చంద్రబాబును ఎంత ఆపినా మీకు ఇక ఆరు నెలలే. యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం. సివిల్‌ వార్‌ కావాలంటే అదీ తప్పదు.

చంద్రబాబుకు జైలులో భద్రత చాలా కీలకం. నాకు ఎలాగూ భద్రత లేదు. నేను తెగించాను.. భద్రత అడగను.

రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తి అవినీతి ఆరోపణలు చేస్తుంటే బాధగా ఉంది. తాను బురదలో కూరుకుపోయి, ఆ బురదను అందరి మీదా వేస్తున్నాడు.

- పవన్‌ కల్యాణ్‌

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన (TDP, Jana Sena)కలసి వెళ్తాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) ప్రకటించారు. శుక్రవారం నుంచే ఉమ్మడి కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ(PMMODI), కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కూడా తెలియజేస్తామని.. బీజేపీ సైతం తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తోపాటు ఆయన గురువారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. సైబరాబాద్‌ రూపశిల్పి జైల్లో ఉండాల్సి రావడంపై ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం అదే గేటు ఎదురుగా జనసేనాని మీడియాతో మాట్లాడారు. ఈ ములాఖత్‌ ఏపీకి చాలా కీలకమైందని చెప్పారు. చంద్రబాబు అరెస్టును సంపూర్ణంగా ఖండిస్తున్నానని.. అలా చెప్పి తాను వెళ్లిపోవడం లేదని అన్నారు. ఉభయులం కలిసి వెళ్లాలని ఈ రోజే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘ఇది చంద్రబాబు, నా భవిష్యత్‌కు సంబంధించింది కాదు. రాష్ట్ర భవిష్యత్‌కు సంబంధించిన అంశం. మాతో బీజేపీ(BJP) కలసి వస్తుందని ఆశిస్తున్నాం. సమష్టిగా ఎదుర్కోవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పటివరకూ మా పార్టీ కార్యవర్గానికి, సభ్యులందరికీ ఏమీ చెప్పలేదు. ఏ నిర్ణయమూ తీసుకోలేదు. పొత్తు ఉంటే మంచిదని మాత్రమే చెబుతూ వచ్చాను. కానీ ఇవాళ నిర్ణయం తీసుకున్నాను. టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసే వెళ్తాయి’ అని స్పష్టంచేశారు. సింహం సింగిల్‌గా పోటీచేస్తుందని వైసీపీ అంటోందని ప్రస్తావించగా.. ‘సింహం జంతువు కదా.. కాబట్టి వైసీపీ వాళ్లను సింగిల్‌గానే రమ్మనండి. మేం మనుషులం కాబట్టి కలిసే వెళ్తాం’ అని బదులిచ్చారు. చంద్రబాబు అరెస్టు ముమ్మాటికీ రాజకీయ ప్రతీకారం.. కక్షసాధింపేనన్నారు. ‘ఇంత అనుభవం ఉన్న వ్యక్తి.. బిల్‌ గేట్స్‌, బిల్‌ క్లింటన్‌ వంటివారిని రాష్ట్రానికి తీసుకొచ్చి.. సైబరాబాద్‌ వంటి సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి.. ఇవాళ రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉండాల్సి రావడం నిజంగా బాధాకరం. దౌర్జన్యాలు చేసేవాడికి 151 సీట్లు ఇచ్చాం. చంద్రబాబు నేరస్థుడు కాదు... జగనే ఆర్థిక నేరస్థుడు’ అని విరుచుకుపడ్డారు. ఇంకా ఏమన్నారంటే..

ఐక్య కార్యాచరణ..

శుక్రవారం నుంచే జనసేన, టీడీపీ ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తాయి. లోకేశ్‌ వారి కమిటీలను ఏర్పాటుచేస్తారు. మేం మా కమిటీలను ఏర్పాటుచేస్తాం. ఐక్యకార్యాచరణ రూపొందిస్తాం. మేం కలిసి పోటీచేసే విషయాన్ని మోదీ, అమిత్‌షాకు కూడా తెలియజేస్తాం. ప్రస్తుతం ఐక్యంగా ఏం చేయాలో ఆలోచిస్తాం. ఏవిధంగా పోటీచేయాలో తర్వాత నిర్ణయిస్తాం. విజన్‌-2020 అని చంద్రబాబు చెప్పినప్పుడు చాలామందికి అర్థం కాలేదు. ఈరోజు మాదాపూర్‌కు మనం వెళ్తే ఎన్ని లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారు..? అన్ని లక్షల కోట్ల టర్నోవర్‌ ఉన్న ఓ కొత్త సిటీని క్రియేట్‌ చేసిన వ్యక్తి చంద్రబాబు. ఆయనతో నాకు విభేదాలు ఉండవచ్చు. అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. పాలసీ పరంగా విభేదించవచ్చు. కానీ ఆయన అనుభవాన్ని, శక్తి సామర్థ్యాలను ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదు. ఆ రోజు కూడా నేను విభేదించింది కేవలం ప్రత్యేక హోదాకు బదులు స్పెషల్‌ ప్యాకేజీ తీసుకోవడాన్నే.

ఈ పరిస్థితి సృష్టించింది జగనే!

మేం రాజకీయపరంగా ఇలా వచ్చి కలిసే అవకాశం, సందర్భం సృష్టించింది జగనే! నేను ఓట్లు చీలనివ్వననే మాట అనడానికి కూడా నీవే కారణం జగన్‌. నీకు ఇంకా ఆరు నెలలే ఉంది. ఏ ఒక్కరినీ వదలం. ఇసుక, మైనింగ్‌, బెల్ట్‌షాపులతో సహా అన్నీ బయటకు తీసుకొస్తాం. మాజీ సీఎంనే మీరు జైలులో పెట్టినప్పుడు మిమ్మల్నీ మేమెందుకు పెట్టం?

అధికారులను బాధ్యులను చేయరేం?

నిర్ణయాలు తీసుకున్న తర్వాత వాటి అమలులో తప్పొప్పులను చూడాల్సింది అధికారులు. స్కిల్‌ కేసులో అధికారులను ఎందుకు బాధ్యులను చేయలేదు? ఇలా అకారణంగా అరెస్టులు చేస్తే ఏ సీఎం కూడా ఫైళ్లపై సంతకాలు చేయరు. నిజంగా అక్రమాలు జరిగితే ఈడీ కదా విచారించాలి! అలాంటిది రాష్ట్రప్రభుత్వమే ఇలా చేయడం ఎంతవరకూ సమంజసం? ఈ రోజు చంద్రబాబుపై అభియోగాలు మోపిన జగన్‌.. ఏమైనా మహానుభావుడా? లాల్‌బహుదూర్‌ శాస్త్రా.. వాజపేయిగారా..? పెద్దఎత్తున ఆర్థిక నేరాలకు పాల్పడి జైలులో ఉన్న వ్యక్తి. ఈరోజుకూ ఈడీ కేసులు ఉన్నాయి. దేశం దాటి పోవాలంటే కోర్టు అనుమతి తీసుకుని వెళ్లాలి. అన్నిటినీ మించి ఆయన చేసేవన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలు. పీపీఏల నుంచి నిబఽంధనలు వేటినీ ఖాతరు చేయని వ్యక్తి. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చాడా..? పోనీ ఇతడి పాలనేమైనా బాగుందా? రాష్ట్రంలో అఽభివృద్ధి ఏమైనా జరిగిందా? ఉద్యోగ, ఉపాధి కల్పన చేశాడా? సీపీఎస్‌ రద్దు చేస్తానన్నాడు.. చేశాడా? సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు.. నిషేధించాడా? 2.3 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? ఏదీ లేదు. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నాడు. మద్యంలో మూడో వంతు వాటా వాళ్ల పాకెట్‌లోకి వెళ్లిపోతోంది.. డిజిటల్‌ పేమెంట్స్‌ లేవు. అంతా క్యాషే ఇవ్వాలి. వైసీపీ పాలన భరించలేకే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని 2021లో చెప్పాను. 30 ఏళ్లు అధికారంలో ఉంటామని కలగన్న వ్యక్తి.. చాలా బాధ్యతగా వ్యవహరించి ఉంటే అసలీ రోజు నేను ఇలా నిలబడాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. నాలాంటివారు బయటకు రావాలంటే 2వేల మంది పోలీసులను పెట్టి తెలంగాణ బోర్డర్‌లో ఆపేసే దమ్ము, ధైర్యం నీకున్నాయంటే.. ఇక సగటు మనిషిని బతకిస్తావా?


బోనెక్కిస్తాం..

కోనసీమలో నేను వారాహి పర్యటనలో ఉన్నప్పుడు 2 వేల మంది క్రిమినల్స్‌ను జగన్‌ పంపించాడు. మా గుంపులో జొరబడి అరాచకం చేస్తే.. యూదులు హిట్లర్‌ నాజీ ఆర్మీ వెంటపడి ఏవిధంగా చట్టం ముందుకు తీసుకొచ్చి బోనెక్కించారో.. వైసీపీ అరాచకాలకు మద్దతు తెలిపేవారిని కూడా అలాగే లాక్కొస్తాం. రాయి వేసేటప్పుడు మీరు ఆలోచించుకోండి. వైసీపీ నాయకులందరికీ చెబుతున్నా. ఏ ఒక్కరినీ వదలం. ఇవాళ చంద్రబాబుకు వర్తించిందే డీజీపీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఇతర అధికారులకూ వర్తిస్తుంది. ఇది అధికారులందరూ గుర్తుంచుకోవాలి. 20 ఏళ్ల కిందట జరిగిన అక్రమాలను కూడా తిరగదోడొచ్చు. జగన్‌ సొంత తల్లి, చెల్లిని బయటకు పంపాడు. బాబాయిని చంపిన వ్యక్తిని వెనకేసుకొచ్చాడు. ఆయన్ను అధికారులు నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే!

బాబు భద్రత కీలకం

చంద్రబాబుకు జైలులో భద్రత చాలా కీలకం. నాకు ఎలాగూ భద్రత లేదు. నేను తెగించాను.. అడగను. గత ంలో చంద్రబాబు చాలా సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తి. అందుకే ఆయనకు భద్రత కావాలి. దీనిని మోదీ, అమిషా దృష్టికి తీసుకెళ్తా. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ కుట్ర ఉందనే విషయాన్ని నేను నమ్మడం లేదు. ప్రతి అంశంపైనా బీజేపీ పెద్దలు స్పందించాలనడం కరెక్టు కాదు. మోదీ పిలిస్తేనే చాలాసార్లు ఆయన వద్దకు వెళ్లాను. కానీ జగన్‌ గురించి ఒక్క విషయం కూడా చెప్పలేదు. ఎందుకంటే మోదీకి అంతా తెలుసు. ఆయనకున్న యంత్రాంగం ద్వారా అన్నీ తెలుసుకుంటారు. రాష్ట్రంలో జరిగేవన్నీ ఆయనకు తెలుసు.

విడివిడిగా పోటీచేస్తే..

వైసీపీ దౌర్జన్యాలు, అరాచకాలు, అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పనిచేయదు. వైసీపీ అరాచక పాలనను అంతమొందించాలంటే తెలుగుదేశం, జనసేన, ఎన్‌డీఏ కలిసి వెళ్లాలనేది నా కోరిక. అదే విషయం కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర నాయకత్వానికి పదేపదే చెబుతూ వచ్చాను. వారే నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు. చాలా పాజిటివ్‌ నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను.

ఎక్కడెక్కడ పోటీచేయాలో వాళ్లు చెబుతారా?

175 సీట్లలో ఒంటరిగా పోటీచేస్తామని జనసేన చెప్పాలని వైసీపీ డిమాండ్‌ చేస్తోంది. వైసీపీని ఎలా నడపాలో మేం చెబుతున్నామా? పులివెందుల కాదు.. అమలాపురంలోనో, రాజమహేంద్రవరం రూరల్‌లోనో పోటీ చేయమని జగన్‌ను అడుగుతున్నామా? ఎన్ని సీట్లలో పోటీ చేయాలో వాళ్లు మాకు చెబుతారా? చంద్రబాబు, నేను మీడియాతో మాట్లాడుతూనే ఉన్నాం మరి సీఎం జగన్‌ను.. సాక్షి వాళ్లను అడుగుతారా ప్రెస్‌మీట్‌ పెట్టండని!

వైసీపీ అరాచకాలపై కేసులేవీ?

వివేకానందరెడ్డి హత్య జరిగితే అన్ని వేళ్లూ జగన్‌ ఇంటివైపే చూపించాయి. కానీ ఇంతవరకూ ఒక్కరంటే ఒక్క అపరాధిని కూడా అరెస్టు చేయలేదు. వైసీపీ నేతలు అడ్డగోలుగా హత్యలు, అరాచకాలు చేస్తుంటే కేసులు పెట్టడం లేదు. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ దొరికితే దాని మూలాలు విజయవాడలోని కంపెనీలో ఉన్నాయని తేలితే ఒక్కరిని కూడా ఈరోజు వరకూ పట్టుకోలేదు. అందరూ పొలిటికల్‌ గేమ్‌ ఆడితే రాష్ట్రం నాశనమైపోతుంది. ఈ రోజు చంద్రబాబుకు జరిగిందని కాదు.. ఇవాళ ప్రతి ఊరిలో, ప్రతి మూలా గొడవలు ఉన్నాయి. ఉదాహరణకు వైసీపీ వాళ్లు నన్ను బూతులు తిడితే విశాఖలో మావాళ్లు బయటకు వచ్చి నిరసన తెలిపితే.. వాళ్లపైనా హత్యాయత్నం కేసు పెట్టారు.

Updated Date - 2023-09-15T05:26:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising