BJP-TDP Alliance: పోర్ట్బ్లెయిర్లో బీజేపీ మద్దతుతో టీడీపీ గెలుపు
ABN, First Publish Date - 2023-03-14T21:53:23+05:30
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) చేసిన తాజా ట్వీట్ అనేక ఆసక్తికర పరిణామాలకు నాంది కానుందా?
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) చేసిన తాజా ట్వీట్ అనేక ఆసక్తికర పరిణామాలకు నాంది కానుందా? అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పోర్టుబ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో(Port Blair Municipal Council election) బీజేపీ-టీడీపీ పొత్తు(BJP-TDP Alliance)తో సమైక్యంగా విజయం సాధించడం హర్షణీయమంటూ ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ-టీడీపీ కూటమికి అభినందనలు తెలియజేశారు. పోర్ట్బ్లెయిర్ ప్రజల కోసం చేసిన కృషి, అంకితభావం ఫలించాయని, ప్రధానిపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని నడ్డా ట్వీట్‌లో తెలిపారు.
పోర్ట్బ్లెయిర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్గా టీడీపీ అభ్యర్థి ఎస్.సెల్వీ ఎన్నికయ్యారు. మండలి ఛైర్మన్ ఎన్నికల్లో టీడీపీకి 14 ఓట్లు రాగా.. ప్రత్యర్థికి 10 ఓట్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలను దాటి బయట మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా సెల్వీ ఎన్నికతో టీడీపీలో ఆనందం వెల్లివిరుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు అండమాన్ నికోబార్ టీడీపీ అధ్యక్షుడు ఎన్.మాణిక్యారావు యాదవ్ లేఖ రాశారు.
తెలుగుదేశం, బీజేపీ పొత్తులో భాగంగా సెల్వీ ఎన్నికయ్యారు. మొదటి మూడేళ్లు బీజేపీ అభ్యర్ధి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికవగా, పదవీకాలం పూర్తి కావడంతో చివరి రెండేళ్లకు టీడీపీ అభ్యర్ధి సెల్వీని టీడీపీ, బీజేపీ సభ్యులు చైర్మన్గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అండమాన్ నికోబార్ ఐల్యాండ్ టీడీపీ యూనిట్కు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ సెల్వీకి చంద్రబాబు అభినందనలు తెలిపారు.
తెలుగుదేశం, బీజేపీ పొత్తుపై నడ్డా చేసిన తాజా ట్వీట్ ప్రకంపనలు రేపుతోంది. అటు బీజేపీలోనూ, ఇటు టీడీపీలోనూ దీనిపై లోతుగా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నాటికి రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా అనే కోణంలో అప్పుడే చర్చలు మొదలయ్యాయి. పొత్తుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే కోణంలో నేతలు, కార్యకర్తలు చర్చలు జరుపుతున్నారు.
Updated Date - 2023-03-14T21:53:42+05:30 IST