Bopparaju: ‘ఆయుధం మా చేతుల్లోనే ఉంది’
ABN, First Publish Date - 2023-03-08T14:29:15+05:30
పెండింగ్ బిల్లులను మూడు దశలుగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు తెలిపారు.
అమరావతి: పెండింగ్ బిల్లులను మూడు దశలుగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (AP JAC Amaravati Chairman Bopparaju Venkateshwarlu) తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... నిన్నటి చర్చల సారాంశాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy)ని కోరామని... సాయంత్రంలోపు చర్చల మినిట్స్ ఇస్తామని సీఎస్ స్పష్టం చేశారన్నారు. నేటి సాయంత్రంలోగా మినిట్స్ ఇస్తే.. రేపు ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సాయంత్రంలోగా మినిట్స్ ఇవ్వకుంటే.. ఉద్యమ కార్యాచరణ యధావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు. మినిట్స్ ఇస్తే.. ఉద్యమాన్ని రేపు మధ్యాహ్నాం వరకు వాయిదా వేస్తామని... కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుంటామని అన్నారు. మినిట్స్ ఇచ్చిన తర్వాత కూడా పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే ఉద్యమిస్తామని వెల్లడించారు. ‘‘ఆయుధం మా చేతుల్లోనే ఉంది. మేం ప్రభుత్వం ట్రాపులో పడడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలతో మాకు సంబంధం లేదు. మా అజెండా నుంచి పక్కకు వెళ్లం’’ అని తేల్చిచెప్పారు. పీఆర్సీ బకాయిలు, డీఏలపై ఈ నెల 16న చర్చిస్తామని ప్రభుత్వం చెప్పిందని బొప్పరాజు పేర్కొన్నారు.
కాగా.. పెండింగ్ ఆర్థిక డిమాండ్లు తీర్చాలంటూ ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంగళవారం అమరావతి సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. అయితే ఉద్యోగసంఘాలతో జరిగిన మంత్రుల కమిటీ సమావేశం ఏమీ తేలకుండానే ముగిసింది. ఉద్యోగ సమస్యల పరిష్కారంపై ఉద్యోగ నేతలు లిఖితపూర్వక హామీ కోరగా, నెలాఖరుకు రూ. 3 వేల కోట్లు ఇస్తామంటూ మంత్రుల కమిటీ దాటవేసింది. దీంతో ఉద్యమ కార్యాచరణ ఆగేదేలేదని బొప్పరాజు తేల్చి చెప్పారు. ప్రభుత్వం మాత్రం నెలాఖరుకు చేస్తాం... ఏప్రిల్‌లో చేస్తాం... అంటూ మాటల హామీలతోనే సరిపెట్టింది. దీంతో ఇతిమిత్థంగా ఏమీ తేలకుండానే సమావేశం ముగిసిపోయింది.
Updated Date - 2023-03-08T14:29:15+05:30 IST