Ramakrishna : రాష్ట్రంలో తీవ్రమైన కరువు సమస్య
ABN, First Publish Date - 2023-11-20T23:34:57+05:30
ఏపీలో తీవ్రమైన కరువు సమస్య ఉందని సీపీఐ నేత రామకృష్ణ ( Ramakrishna ) అన్నారు. సోమవారం నాడు ధర్నాచౌక్‌లో సీపీఐ ఆధ్వర్యంలో 30 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టారు.
విజయవాడ : ఏపీలో తీవ్రమైన కరువు సమస్య ఉందని సీపీఐ నేత రామకృష్ణ ( Ramakrishna ) అన్నారు. సోమవారం నాడు ధర్నాచౌక్‌లో సీపీఐ ఆధ్వర్యంలో 30 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టారు. రాత్రి దీక్షా శిబిరంలోనే సీపీఐ రామకృష్ణ, ఇతర నేతలు ఉన్నారు. రేపు సాయంత్రం నిరసన దీక్ష ముగియనున్నది. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ...‘‘ కృష్ణా జలాల పునః పంపిణీకై కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. రాష్ట్రంలో దారుణమైన కరవు నెలకొన్నా.. జగన్ నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారు. తాను సీఎంగా ఉంటే కరువే రాదనే భావనలో ఉంది. కరువును నిరాకరిస్తున్నాడు. 444 కరవు మండలాలు ఏపీలో ఉంటే... జగన్ ప్రకటించడం లేదు. కరవు ప్రాంతాల రైతులను ఆదుకునే చర్యలు చేపట్టలేదు. కేంద్రానికి కరవు నివేదికలు కూడా పంపడం లేదు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల నుంచి వలసలు పోతున్నారు. జగన్ చేతకాని దద్దమ్మ కాబట్టే కృష్ణా జలాల విషయంలో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇలాంటి సీఎం ఏపీకి ఉండటం ప్రజల దురదృష్టం. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం’’ అని రామకృష్ణ హెచ్చరించారు.
గన్ కళ్లు లేని కబోధి లాగా జగన్ తయారయ్యాడు:
రాష్ట్రం లో తీవ్ర కరువు ఉన్నా... జగన్ కళ్లు లేని కబోధి లాగా తయారయ్యాడని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘‘ 22ఏళ్ల తర్వాత తీవ్ర దుర్భిక్షం ఉన్నా జగన్ పట్టించుకోలేదు. రైతులు పంటలు ఎండిపోయి కన్నీరు పెడుతున్నారు. వరుణ దేవుడే మా పక్కన ఉన్నాడన్న సీఎం అదే భ్రమలో ఉన్నారు. కానీ వర్షాభావ పరిస్థితులతో రైతులు అల్లాడుతున్నారు. ఇటువంటి సీఎంలో చలనం వచ్చేలా మా పోరాటం సాగుతుంది’’ అని ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు.
Updated Date - 2023-11-20T23:36:02+05:30 IST