TDP MLA: ‘అలా అడగడమే లోకేష్ తప్పా’?.. టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ పయ్యావుల ఆగ్రహం
ABN, First Publish Date - 2023-03-03T11:32:12+05:30
పోలీసులపై టీడీపీ యుద్ధం చేస్తోందని కొందరు ప్రభుత్వపెద్దలు, పోలీస్ అధికారులు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.
అమరావతి: పోలీసులపై టీడీపీ యుద్ధం చేస్తోందని కొందరు ప్రభుత్వ పెద్దలు, పోలీస్ అధికారులు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ (TDP MLA, PAC Chairman Payyavula Keshav) మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలతో చట్టవిరుద్థంగా పనిచేసే అధికారుల్ని మాత్రమే తాము నిలదీస్తున్నామని తెలిపారు. పోలీస్ యూనిఫామ్ గర్వంగా, గౌరవంగా పనిచేసేలా చేసింది చంద్రబాబే (TDP Chief Chandrababu) అని గుర్తుంచుకోవాలన్నారు. పాఠశాలలో గంజాయి దొరికిన ఘటనపై పోలీస్ శాఖను లోకేష్ (Nara Lokesh) నిలదీయడం తప్పా అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా ఎస్పీకి పాఠశాలలో దొరికిన గంజాయి ప్యాకెట్లు, సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలు కనిపించలేదా అని ఎమ్మెల్యే (TDP MLA) నిలదీశారు.
పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, మాదకద్రవ్యాల విక్రయాలు పోలీస్ శాఖకు మాయనిమచ్చకాదా అని అన్నారు. రాష్ట్రం గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు కేరాఫ్‌గా మారిందన్న జాతీయ, అంతర్జాతీయ నివేదికలపై చిత్తూరు ఎస్పీ, డీజీపీ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ‘‘మన పిల్లలు గంజాయికి బానిసలైతే మనమెంత బాధపడతామో, పేద బడుగు, బలహీనవర్గాలు, దళితుల పిల్లలు మత్తులో జోగుతుంటే వారికి బాధ ఉండదా’’ అని అడిగారు. అధికారపార్టీ ఆదేశాలతో రాజకీయపార్టీలపై నిఘాపెట్టడం మానేసి, గంజాయి మాదకద్రవ్యాల వ్యాప్తిపై ఏపీ పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపాలని పయ్యవుల కేశవ్ (Payyavula Kesav) హితవుపలికారు.
Updated Date - 2023-03-03T11:35:40+05:30 IST