Varla: ‘ఆ వాగ్దానం ‘బూడిదలో పోసిన పన్నీరు’గా మాదిగలు భావించాల్సిందేనా’
ABN, First Publish Date - 2023-04-04T09:43:52+05:30
నగరంలోని స్వరాజ్ మైదాన్‌లో డా.అంబేద్కర్ విగ్రహంతో పాటు బాబు జగ్జీవన్ రాం విగ్రహం కూడా నిర్మించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు.
విజయవాడ: నగరంలోని స్వరాజ్ మైదాన్‌లో డా.అంబేద్కర్ విగ్రహంతో పాటు బాబు జగ్జీవన్ రాం విగ్రహం కూడా నిర్మించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan mohan Reddy)కి టీడీపీ నేత వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) లేఖ రాశారు. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాంలు దళిత కులాలకు రెండు కళ్లు లాంటి వారన్నారు. జగ్జీవన్ రాం స్మృతివనం కోసం లేఖ రాయవలసి రావడం దురదృష్టకరమని అన్నారు. దళిత జాతిలో మాల, మాదిగ కులాలు రెండు కళ్లని తెలిపారు. ఏ ప్రభుత్వ రాయితీలైనా, సంక్షేమ ఫలాలైన ఈ రెండు కులాలను బేరీజు వేసుకుని అందించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మాల, మాదిగ కులాలను సాధ్యమైనంత వరకు సమానంగా చూశారని తెలిపారు. అమరావతి రాజధానిలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా. బి.ఆర్ అంబేడ్కర్ స్మృతివనం 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని తలంచామన్నారు. 125 అడుగుల కాంస్య విగ్రహం, కన్వెన్షన్ సెంటర్, లైబ్రరీ, బుదిస్టు ధ్యాన కేంద్రం నిర్ణయించేందుకు రూ.100 కోట్లు విడుదల చేశామని గుర్తుచేశారు. దళితులకు రెండవ కన్ను అయిన డా. బాబు జగ్జీవన్ రాం సమతా స్పూర్తివనం ఏర్పాటు కోసం రాజధానిలో 10 ఎకరాలు కేటాయించామని ఆయన తెలిపారు.
కానీ వైసీపీ (YCP) అధికారంలోకి రావడంతో ఆ రెండు ప్రాజెక్టులు మూలనపడ్డాయని మండిపడ్డారు. స్వరాజ్ మైదాన్‌లో అంబేద్కర్ విగ్రహంతో పాటు జగ్జీవన్ రాం విగ్రహం కూడా నిర్మించాలని గతంలో బహిరంగ లేఖ కూడా రాసినట్లు చెప్పారు. ‘‘నాడు మీ మంత్రి సైతం జగ్జీవన్ రాం ని కూడా సమాంతరంగా గౌరవిస్తామని చెప్పడం జరిగింది. కానీ, ఇంతవరకు ఆ నిర్ణయం కార్యరూపం దాల్చలేదు. ఈ మీ నిర్లక్ష్యం ‘మాదిగ’ వర్గాన్ని బాధిస్తున్నది. జగ్జీవన్ రాం స్మృతివనం కోసం మీ ప్రభుత్వం చేసిన వాగ్దానం ‘బూడిదలో పోసిన పన్నీరు’గా మాదిగలు భావించవలసిందేనా?. ఇప్పటికైనా సమన్యాయం పాటించి వెంటనే బాబు జగ్జీవన్ రాం స్మృతివనాన్ని కూడా చేపట్టాలని కోరుతున్నాను. రాష్ట్రంలోని ఎస్సీ కమ్యునిటీలోని రెండు కులాలను సమానంగా చూడాలని అభర్ధిస్తున్నాను. ఒక వర్గాన్ని గౌరవించి, రెండో వర్గాన్ని కించపరడం సబబు కాదు’’ అంటూ వర్ల రామయ్య లేఖలో రాశారు.
Updated Date - 2023-04-04T09:43:52+05:30 IST