పశ్చిమ బైపాస్‌కు బ్రేక్
ABN , First Publish Date - 2023-04-18T00:44:18+05:30 IST
శరవేగంగా నిర్మాణం పూర్తిచేసుకుంటున్న విజయవాడ పశ్చిమ బైపాస్‌కు హెచ్‌టీ లైన్స్ రూపంలో బ్రేక్ పడుతోంది. విజయవాడ నగరానికి శాశ్వత ప్రాతిపదికన ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడానికి నిర్మిస్తున్న ఈ బైపాస్ రోడ్డు పనులు దాదాపు 80 శాతం పూర్తవగా, సూరంపల్లి, గొల్లపూడి గ్రామాల వద్ద హెచ్‌టీ లైన్స్ ప్రతిబంధకంగా ఉండటంతో పనులు ఆగిపోయాయి.

రోడ్డు పనులు 80 శాతం పూర్తి
సూరంపల్లి, గొల్లపూడి వద్ద హెచ్‌టీ లైన్స్ సమస్య
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వాస్తవానికి ఈపాటికే అందుబాటులోకి రావాల్సిన విజయవాడ పశ్చిమ బైపాస్ విద్యుత్ లైన్ల మార్పిడి కారణంగా అసంపూర్తిగా ఉండిపోయింది. విజయవాడ పశ్చిమ బైపాస్ అనేది కాజ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులో అంతర్భాగంగా జరుగుతున్న ప్యాకేజీ-3 పనులు. దీని పొడవు 30 కిలోమీటర్లు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో చిన్న అవుటపల్లి నుంచి ప్రారంభమై మార్లపాలెం, గన్నవరం, బీబీగూడెం, కొండపావులూరు, సూరంపల్లి, కొత్తూరు తాడేపల్లి, జక్కంపూడి, గొల్లపూడి వరకు విజయవాడ బైపాస్ ఉంటుంది. ఈ ప్యాకేజీ-3 పనులకు సంబంధించి చిన్న అవుటపల్లి నుంచి మర్లపాలెం వరకు రోడ్డు పోర్షన్ పనులు పూర్తయ్యాయి. మర్లపాలెం దగ్గర ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్నాయి. ఇవి గడ్డర్ల దశలో ఉన్నాయి. తిరిగి ఇక్కడి నుంచి గన్నవరం వరకు రోడ్డు పోర్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. గన్నవరం దగ్గర ఆర్‌వోబీ పూర్తయింది. అప్రోచ్ పనులు చేపడుతున్నారు. గన్నవరం నుంచి బీబీ గూడెం సరిహద్దు వరకు బైపాస్ రోడ్డు పనులు పూర్తయ్యాయి. బీబీ గూడెం నుంచి కొండపావులూరు వరకు రోడ్డు పోర్షన్ పనులు పూర్తయ్యాయి. మధ్యలో ఒక్క ఆర్‌వోబీ పనులు తుది దశలో ఉన్నాయి. కొండపావులూరు నుంచి సూరంపల్లి మార్గంలో కూడా ఆరు వరసల రోడ్డు, ఆర్‌వోబీల పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న టోల్‌గేట్ పనులు కూడా ఇటీవల పూర్తయ్యాయి. సూరంపల్లి నుంచి నున్న వెళ్లే మార్గంలో ఒకచోట హై టెన్షన్ తీగలు భూమికి అత్యంత దగ్గరగా ఉండటంతో ఇక్కడ పనులు పురోగతిలో లేవు. నున్న ఆర్‌వోబీ, నూజివీడు ఆర్‌వోబీ పనులు నడుస్తున్నాయి. నున్న నుంచి గొల్లపూడి శివారు వరకు రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయి. మధ్యలో రైల్వే ట్రాక్ ఉంది. ఈ ట్రాక్ మీదుగా ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్నాయి.
గొల్లపూడి ఫ్లై ఓవర్ వద్ద..
గొల్లపూడి ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా పలు ప్రాంతాల్లో హెచ్‌టీ లైన్స్ క్రాస్ అవుతున్నాయి. ఈ ప్రదేశాల్లో ఆర్‌వోబీ కాకుండా నేలపై రోడ్డు పనులు చేపడుతున్నారు. కానీ, కొన్నిచోట్ల నేలపై కూడా హెచ్‌టీ లైన్స్‌తో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో తక్షణం వాటిని మార్చాల్సి ఉండగా, ఈ ప్రక్రియ సాగుతూ వస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం స్థానిక రైతులతో చర్చలు జరిపినా కొలిక్కిరాలేదు. రైతుల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ కారణంతో ఈ ప్రాంతాల్లో పనులు పురోగతిలో లేవు.
పురోగతిలో ప్యాకేజీ-4 పనులు
65వ నెంబరు జాతీయ రహదారిపై ప్రస్తుతం ఫ్లై ఓవర్ పనులు తుది దశలో ఉన్నాయి. దీనికి అనుసంధానంగా ప్యాకేజీ-4లో భాగంగా సూరాయపాలెం నుంచి కృష్ణానది మీదుగా బ్రిడ్జి, అమరావతి మీదుగా కాజ వరకు ఆరు వరసల రోడ్డు పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. కాజ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన నాలుగు ప్యాకేజీల్లో ఇప్పటికే ప్యాకేజీ-2 పనులు పూర్తయ్యాయి. కలపర్రు నుంచి చిన్న అవుటపల్లి వరకు, మధ్యలో జంక్షన్ బైపాస్ పనులు పూర్తయ్యాయి. ప్యాకేజీ-1 పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. ప్యాకేజీ-2 తర్వాత పూర్తవటానికి అవకాశం ఉన్నది ప్యాకేజీ-3 (విజయవాడ బైపాస్) పనులే. ఈ పనులు జాప్యం కావటానికి విద్యుత్ లైన్స్ సమస్యగా ఉంది కాబట్టి తక్షణం ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.