YuvaGalam: పాదయాత్రలో యువనేత హుషారు.. పలుగుపట్టి మట్టి తవ్వుతూ..
ABN, First Publish Date - 2023-04-20T11:06:09+05:30
టీడీపీ యువనేత నారాలోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది.
కర్నూలు: టీడీపీ యువనేత నారాలోకేష్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) జిల్లాలో కొనసాగుతోంది. ఈరోజు ఆలూరు నియోజకవర్గం నుంచి ఆదోని నియోజకవర్గంలోని పాదయాత్ర ప్రవేశించింది. పాదయాత్రలో భాగంగా ఆదోని నియోజకవర్గం పెద పెండేకల్ శివారు ఎర్ర చెరువువంకలో ఉపాధి హామీ కూలీలను యువనేత కలిశారు. కూలీల వద్ద ఉన్న గడ్డపార తీసుకొని మట్టిని తవ్వుతూ వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు తమ సమస్యలను యువనేత ముందు ఏకరువు పెట్టారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పనిచేస్తే రూ.150 కూలీ ఇస్తున్నారని తెలిపారు. ఎండపొద్దున నీడకోసం కనీసం పరదా పట్టలు, మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయడం లేదన్నారు. పెరిగిన ధరల కారణంగా ఇప్పుడిస్తున్న కూలీ ఏ మూలకూ సరిపోవడం లేదని వాపోయారు. పనిదినాలు, కూలీ రేట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని... మంచినీళ్లు, నీడ సౌకర్యం కల్పించాలని కోరారు. గ్రామాల నుంచి పనిచేసే ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించాలని లోకేష్‌ను ఉపాధి కూలీలు కోరారు.
యువనేత లోకేష్ మాట్లాడుతూ... పేదలకు ఇచ్చే ఉపాధి హామీ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వదిలిపెట్టలేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.261 కోట్ల ఉపాధి నిధులు దుర్వినియోగమైనట్లు కేంద్రమే చెప్పిందన్నారు. ఉపాధి హామీ పథకంలో పేదల కష్టాన్ని వైసీపీ నాయకులు మింగేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి పనులు చేసే పేదల కోసం నీడ ఏర్పాటు చేయడమే గాక ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో మజ్జిగ కూడా అందించామని గుర్తుచేశారు. ఉపాధి పనుల కోసం గడ్డపారలు ఇవ్వడమేగాక, దూరాన్ని బట్టి అదనపు కూలీ చెల్లించామన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రంతో మాట్లాడి ఉపాధి హామీ పనిదినాలు, కూలీ పెంచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ అభయమిచ్చారు.
Updated Date - 2023-04-20T11:43:11+05:30 IST