YS Viveka Case Avinash Reddy: సీబీఐ విచారణకు ముందు ట్విస్ట్ ఇచ్చిన అవినాశ్ రెడ్డి !
ABN, First Publish Date - 2023-05-16T11:04:33+05:30
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు సీబీఐ ముందుకు విచారణకు హాజరుకావాల్సి ఉంది.
హైదరాబాద్/అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy) ఈరోజు సీబీఐ ముందుకు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఈరోజు సీబీఐ ముందు విచారణకు హాజరుకాలేకపోతున్నానని అవినాశ్ రెడ్డి తెలిపారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం ముందు మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు. అందుకు ఈరోజు సీబీఐ ముందు హాజరుకాలేకపోతున్నానని అన్నారు. నాలుగు రోజులు గడువు కావాలని సీబీఐని కోరినట్లు చెప్పారు. నాలుగు రోజుల తర్వాత సీబీఐ విచారణకు వస్తానని ఎంపీ అవినాష్ రెడ్డి వెల్లడించారు.
నాలుగు రోజులు గడువు కావాలని సీబీఐకు అవినాష్ లేఖ రాశారు. అత్యవసర పనులు ఉన్నాయని ఈరోజు హాజరుకాలేనని లేఖలో తెలిపారు. అయితే అవినాష్ విజ్ఞప్తిపై సీబీఐ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏం జరగనుందోననే ఉత్కంఠ నెలకొంది.
కాగా.. వివేక హత్య కేసులో అవినాశ్‌కు 160 సీఆర్పీసీ కింద సీబీఐ సోమవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయం ముందు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో పలు దఫాలుగా విచారణ చేసి స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డ్ చేసింది. వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో అవినాశ్ పిటిషన్ వేయగా.. అందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. వివేకా హత్య కుట్రలో ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్రపై అఫిడవిట్‌లో సీబీఐ స్పష్టంగా పేర్కొంది. వివేక హత్య కేసులో 20 రోజుల పాటు విరామం తర్వాత సీబీఐ మరోసారి అవినాశ్‌కు నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పులివెందల, లింగాలలో జరగబోయే కార్యక్రమాలను అవినాష్ రెడ్డి రద్దు చేసుకున్నారు. నేడు అవినాష్ విచారణ తర్వాత సీబీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవినాశ్ అరెస్ట్ తప్పదనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
Updated Date - 2023-05-16T11:11:51+05:30 IST