Nara Lokesh : ఆ స్టిక్కర్లు మీ మొహాలకు వేసుకోండి జగన్ రెడ్డి
ABN, First Publish Date - 2023-04-28T13:18:59+05:30
సీమ ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వడం చేతగాని జగన్ రెడ్డి.. గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన పథకాలకు మాత్రం సిగ్గు లేకుండా స్టిక్కర్లు, రంగులు వేసుకుంటున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
అమరావతి : సీమ ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వడం చేతగాని జగన్ రెడ్డి.. గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన పథకాలకు మాత్రం సిగ్గు లేకుండా స్టిక్కర్లు, రంగులు వేసుకుంటున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇబ్రహీంపురంలో ప్రజలకు స్వచ్చమైన తాగునీరు అందించేందుకు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద గత ప్రభుత్వం మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటుచేసిందన్నారు. ఈ పథకానికి నీరు అందించడం చేత గాక పాడుబెట్టిన వైసీపీ నేతలు జలగన్న స్టిక్కర్ మాత్రం వేసుకున్నారని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఎవరికో పుట్టిన బిడ్డలను తమ బిడ్డలని చెప్పుకోవడం అలవాటుగా మారిన సైకో బ్యాచ్ ఖాళీ ఖజనాతో చేయగలిగింది ఏముందని ప్రశ్నించారు. ఇంతకుమించి మేం పీకేదేం లేదని ఆ స్టిక్కర్లు మీ మొహాలకు వేసుకుంటే ఇంకా బాగుండేదేమోనని నారా లోకేష్ పేర్కొన్నారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Nara lokesh YuvaGalam Padayatra) విజయవంతంగా కొనసాగుతోంది. 82 రోజులుగా లోకేష్ చేస్తున్న పాదయాత్రకు (Lokesh Padayatra) విశేష ఆదరణ లభిస్తోంది. అడుగడుగునా లోకేష్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం మంత్రాలయం నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి అయింది. కాసేపటి క్రితమే ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజవర్గాల్లో పాదయాత్ర చేసిన లోకేష్ ఆయా సామాజిక వర్గాలు, రైతులు, ప్రజలు, యువత చెప్పిన సమస్యలను సామరస్యంగా వింటూ టీడీపీ ప్రభుత్వం రాగానే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈరోజు మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం విడిది కేంద్రం నుంచి 83వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. కాసేపటికే మంత్రాలయం నియోజకవర్గంలో పూర్తై ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. దీంతో లోకేష్‌కు టీడీపీ ఇన్చార్జ్ బీవీ.జయ నాగేశ్వర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అంతకు ముందు పాదయాత్ర చేస్తున్న యువనేతను మంత్రాలయం నియోజకవర్గం కల్లుదేవకుంట గ్రామస్తులు కలిసి సమస్యలను విన్నవించారు. గ్రామంలో ప్రస్తుతం ఉన్న సిమెంటు రోడ్లు టీడీపీ హయాంలో నిర్మించినవేనని యువనేతకు చూపి కృతజ్ఞతలు తెలియజేశారు. తమ గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, ఓవర్ హెడ్ ట్యాంక్ మంజూరు చేయాలని కోరారు. సాగునీటి సమస్య పరిష్కారానికి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయాలన్నారు. అలాగే మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందని, అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఏర్పాటు చేయాలని వినతి చేశారు. పీహెచ్సీలో డాక్టర్, రెగ్యులర్ స్టాఫ్‌ను నియమించాలని యువనేతను గ్రామస్తులు కోరారు.
నారా లోకేష్ స్పందిస్తూ... ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక గ్రామసీమలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారనిమండిపడ్డారు. గ్రామపంచాయితీలకు చెందిన రూ.8660 కోట్లు దొంగిలించారని ఆరోపించారు. తాను పంచాయితీరాజ్ మంత్రిగా ఉన్నపుడు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఇంటింటికీ తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో డ్రైనేజీ, ఇతర సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తామని లోకేష్ తెలిపారు.
Updated Date - 2023-04-28T13:18:59+05:30 IST