Crops damaged : అయ్యో రైతన్నా

ABN , First Publish Date - 2023-05-03T02:54:27+05:30 IST

మార్చి నెలలో కురిసిన అకాల వర్షాలకే భారీగా పంట నష్టపోయి దిగాలు పడిన రైతులను ప్రస్తుత వర్షాలు మరింత ముంచేశాయి. ఉపరితల ద్రోణి ఫలితంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లోని పంటలతో పాటు,

Crops damaged : అయ్యో రైతన్నా

వరుస పంట నష్టాలతో కుదేలు

రబీ పంటలన్నింటిపైనా వాన దెబ్బ.. మార్చిలోనే ఒక విడత పంట నష్టం

మళ్లీ ఇప్పుడు అకాల వర్షాలు.. లక్షలాది ఎకరాల్లో మునిగిన పంటలు

ధాన్యం రైతు పరిస్థితి దయనీయం.. తడిసినవి కొనని వ్యాపారులు

పట్టించుకోని పాలకులు.. పొరుగున స్వయంగా భరోసా ఇచ్చిన టీ-సీఎం

మరో 3 రోజులు వర్ష సూచన.. రైతు గుండెల్లో మరో ‘పెను తుఫాన్‌’

వాన దంచి కొడుతోంది. ప్రభుత్వం పట్టించుకోనంటోంది! కనీస భరోసా కూడా కరువైపోయింది. అన్నదాతకు కష్టం, నష్టమే మిగులుతోంది. మార్చిలో ఒక విడత వాన దెబ్బ! ఇప్పుడు వారం రోజులుగా దెబ్బమీద దెబ్బ! అకాల వర్షాలకు కష్టాలపాలైన రైతులకు ఏమిస్తారు? ఎంతిస్తారు? అసలిస్తారా.. లేదా? ఏ ప్రశ్నకూ సమాధానం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు అకాల వర్షాలకు గంగపాలవుతున్నా, తడిసి పాడైపోతున్నా రైతుల ఆక్రందన పాలకులకు పట్టడంలేదు. పాడవుతున్న ఉత్పత్తుల్ని కొనే నాథుడు లేక వారు మరింత కుంగిపోతున్నారు.

అక్కడలా.. ఇక్కడిలా..

తెలంగాణలోనూ అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దీనిపై మంత్రి కేటీఆర్‌ 3 రోజుల క్రితమే స్పందించారు. రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మంగళవారం దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించారు. మంత్రులు హరీశ్‌ రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి తదితరులూ క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. మంగళవారం సీఎం కేసీఆర్‌ కూడా స్పందించి.. రైతులను ఆదుకుంటామని ప్రకటించారు. ఇలాంటి స్పందన మన పాలకుల్లో కనిపించడమే లేదు. లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నా రాష్ట్ర స్థాయిలో సమీక్ష జరపనే లేదు. పరిహారం చెల్లింపుపై ప్రకటన సంగతి పక్కనపెడితే... క్షేత్రస్థాయిలోనూ ఎవరూ పట్టించుకునే దిక్కులేదు. తడిసిన ధాన్యం కొనుగోలు ప్రస్తావనే లేదు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

మార్చి నెలలో కురిసిన అకాల వర్షాలకే భారీగా పంట నష్టపోయి దిగాలు పడిన రైతులను ప్రస్తుత వర్షాలు మరింత ముంచేశాయి. ఉపరితల ద్రోణి ఫలితంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లోని పంటలతో పాటు, కల్లాల్లో ఆరబోసిన పంట ఉత్పత్తులు తడిసిపోతున్నాయి. మార్చిలో 2లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతినగా, గడచిన వారంలో మరికొన్ని లక్షల ఎకరాలో పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో రైతులకు రూ.వందల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. అకాల వర్షాలు, ఈదురుగాలులకు వరి, మొక్కజొన్న, మిర్చి, పసుపు, శనగ, వేరుశనగ వంటి వాణిజ్య పంటలు తడిసి పాడైపోగా.. ఉద్యాన పంటలైన మామిడి, అరటి, బొప్పాయి, నిమ్మ, దానిమ్మ, బత్తాయి వంటి పంటలు కూడా నేలపాలవుతున్నాయి. ఈ వర్షాలు రైతులపైనే కాకుండా, మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పంట ఉత్పత్తులు ఆరబెట్టకపోతే.. వాటిల్లో తేమ శాతం ఉంటే వ్యాపారులు కొనని పరిస్థితి. ఆరబోస్తే పంటంతా వర్షార్పణమవుతోంది. ఎంత కాపాడుకోవాలన్నా కళ్లాల్లో ఆరబోసిన పంట ఉత్పత్తులు తడవకుండా ఉండటం లేదు. పట్టలు కప్పినా కిందకు వాన నీరు చేరి పంటంతా పాడైపోయి రైతులు నష్టాలపాలవుతున్నారు.

సాగని కొనుగోళ్లు

అకాల వర్షాలతో రైతులు నానా అవస్థలు పడుతుంటే.. వర్షాలకు తడిసిన సరుకు కొనుగోలు చేస్తే నష్టపోక తప్పదని వ్యాపారులు ధాన్యం, మొక్కజొన్న, మిర్చి, పసుపు కొనుగోళ్లు నిలిపివేస్తున్నారు. ఇప్పటికే అనేక చోట్ల పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు మందగించాయి. ఒక వేళ కొనుగోలు చేసినా.. మద్దతు ధర కన్నా తక్కువకే అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో దాళ్వా రైతులకు ఈ అకాల వర్షాలు ముప్ప తిప్పలు పెడుతున్నాయి. ఓ వైపు చేలో పంట నీట మునుగుతుండగా, కోసిన వరి పనలు తడిసిపోతున్నాయి. ఆరబోసిన ధాన్యం కూడా తడిసి ముద్దవుతోంది. మొక్కజొన్న పరిస్థితీ ఇంతే. మిర్చి ఎండకుండా టిక్కీల్లో తొక్కితే బూజేసి పోతుందని, ఆరబెడితే వానకు తడిసి దెబ్బతింటోందని వాపోతున్నారు.

నష్టాన్ని గుర్తించని సర్కార్‌

గత నాలుగేళ్లుగా వరుస విపత్తులు రైతులు బాగా కుంగదీశాయి. పంట పండినా.. ప్రయోజనం లేకుండా పోతోంది. విపత్తులతో వాస్తవ సాగుదారులైన కౌలు రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. సాగు పెట్టుబడులకు అదనంగా కౌలు చెల్లించే కౌలురైతులకు ఈ విపత్తులు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. సాగు విస్తీర్ణం, పంట ఉత్పత్తి అంచనాలే తప్ప.. వాస్తవంగా దిగుబడి ఎంతొచ్చింది? రైతుకు మిగిలిందెంత? అనేది పాలకులు, అధికారులు పరిగణనలోకి తీసుకోవట్లేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. కాగా, మంగళవారం కూడా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మరో మూడ్రోజులు వర్ష సూచన, వచ్చే వారం వాయుగుండం హెచ్చరికలు రైతుల గుండెల్లో పెను తుఫాన్‌ సృష్టిస్తోంది.

గత ఏడాది వివిధ కారణాలవల్ల ఖరీఫ్‌ సాగు ఆలస్యమైంది. నవంబరు, డిసెంబరులో కురిసిన వర్షాలతో ఖరీఫ్‌ పంటలు దెబ్బతిన్నాయి. కోతలు ఆలస్యమయ్యాయి. దీని ప్రభావం రబీపైనా పడింది. విత్తనాలు అందకపోవడం, ఎరువుల ధర పెరుగుదల, సాగునీరివ్వలేమని నేరుగా ప్రభుత్వమే చెప్పడం, విత్తనాలు అందకపోవడం తదితర కారణాలతో 10.75 లక్షల ఎకరాల్లో రబీ సాగు తగ్గింది.

ఏప్రిల్‌ నెలాఖరుకే రబీ కోతలు పూర్తికావాలి. అదే జరిగితే ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతినేవే కావు. కానీ... రబీ సాగుతోపాటు కోతలూ ఆలస్యమయ్యాయి. తాజా వర్షాల కారణంగా రబీలో సాగు చేసిన దాదాపు అన్ని రకాల పంటలూ దెబ్బతిన్నాయి. వరి కోతలు జరిగినా కొనుగోళ్లు లేవు. చేలో ఉన్న వరికంకులు నేలరాలగా... కోతలు జరిగి రాశులు పోసిన ధాన్యం తడిసిపోయాయి.

గత ప్రభుత్వంలో రాయితీ మీద వ్యవసాయ పరికరాలు, పట్టలు అందించే వాళ్లు. వైసీపీ సర్కారు వచ్చాక ఆ పద్ధతికి స్వస్తి పలికింది. పట్టలు, యంత్రాలను అద్దెకు ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా రైతులకు పట్టలు అందుబాటులో లేకపోవడంతో వర్షాల నుంచి పంట ఉత్పత్తులను కాపాడుకోలేకపోతున్నారు.

ఈ-క్రాప్‌ ఆధారంగా పంట నష్టాల గణన

అగ్రి కమిషనర్‌ హరికిరణ్‌

అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షాలకు జరిగిన పంట నష్ట గణనను ఈ-క్రాప్‌ ఆధారంగా చేపట్టాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం జిల్లాల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. పీఎం కిసాన్‌-2023లో 14వ విడత లబ్ధికి రైతులందరూ ఈనెల 20లోగా ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకుని, బ్యాంక్‌ అకౌంట్‌కు ఆధార్‌ అనుసంధానంతో పాటు ఎన్‌పీసీఐ లింకేజ్‌ కూడా చేయించుకోవాలని సూచించారు. 2023 ఖరీఫ్‌ ఈ-క్రాప్‌ నమోదును జియో రిఫరెన్సింగ్‌ ద్వారా చేయబోతున్నట్లు చెప్పారు. క్లస్టర్‌ యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటు మే 12వరకు పూర్తి చేసి, రాయితీ ప్రతిపాదనలు ఈ నెల19లోగా పంపాలని సూచించారు. వైఎస్సార్‌ యాప్‌ ద్వారా యంత్ర పరికరాలను అద్దెకు తీసుకునే అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. ‘పచ్చిరొట్ట విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయనున్నాం. అన్ని రకాల కంపెనీల పత్తి, మిర్చి విత్తనాలు లభ్యమవుతాయి. అధిక ధరకు ఎవరూ కొనవద్దు. డీలర్లు కృత్రిమ నిల్వలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఆయన హెచ్చరించారు.

సకాలంలో సంచులివ్వకే...

పంటకోసి 20 రోజులు దాటింది. సంచులు కావాలని ఆర్బీకేలో అడిగినా అందించలేదు. ధాన్యమంతా కల్లంలోనే ఉండిపోయింది. పూర్తిగా ఆరబెట్టిన ధాన్యం చివరికి వర్షానికి తడిసిపోయింది. అధికారులు స్పందించి సంచులను అందించి కల్లంలో ఉన్న ధాన్యాన్ని మిల్లుకు తరలించాలి.

- జుజ్జవరపు సుబ్రహ్మణ్యం, కొవ్వూరు,

తూర్పు గోదావరి జిల్లా

ఆర్బీకే చుట్టూ తిరిగినా...

18 ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నా. ఇటీవల యంత్రాలతో కోతలు కోయించా. సంచుల కోసం ఆర్‌బీకే చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఆ తర్వాతే కొంత మేరకు సంచులు ఇచ్చారు. ఆ మేరకు ధాన్యాన్ని మిల్లులకు తరలించాం. మిగిలిన ధాన్యమంతా తడిసిపోయింది. అవసరమైనన్ని సంచులు ఇవ్వనందుకే ఈ సమస్య.

- యాళ్ళ సుబ్బారావు, మల్లపరాజుపేట, గణపవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా

నష్ట పరిహారం వస్తుందో... రాదో...

చేతికి వచ్చిన 4ఎకరాల మామిడి పంట ఈదురుగాలులకు నేలరాలి, దాదాపు రూ.3లక్షల నష్టం వాటిల్లింది. అధికారులు వచ్చి పంటను పరిశీలించారు. పండ్ల మొక్కలు ధ్వంసం అయితేనే పరిహారం అందుతుందని చెప్పారు. వర్షాలతో కాయలన్నీ రాలిపోయాయి. ప్రభుత్వమే నాలాంటి పేద రైతులను ఆదుకోవాలి.

- రైతు జనార్దన్‌రెడ్డి, కాశేపల్లి,

పెద్దవడుగూరు మండలం, అనంతపురం జిల్లా

లారీలు పెట్టడం లేదు

పండించిన ధాన్యం మిల్లులకు తీసుకెళ్లడానికి వాహనదారులు ముందుకు రావడం లేదు. రైసు మిల్లులు వద్ద రోజులు తరబడి ఆలస్యం అవుతోంది. రోడ్లపైనే ధాన్యం బరకాలు కప్పి ఉంచాం. వర్షాలకు తడిసి మొలక వచ్చే ప్రమాదం ఉంది.

- గాలింకి బాబు, కౌలు రైతు, తేతలి (తణుకు)

Updated Date - 2023-05-03T02:54:27+05:30 IST