Vangalapudi Anitha: హనుమాయమ్మది ముమ్మాటికీ రాజకీయ హత్యే
ABN, First Publish Date - 2023-06-09T15:15:11+05:30
జిల్లాలోని టంగుటూరు మండలం రావివారిపాలెంలో అంగన్ వాడీ కార్యకర్త హనుమాయమ్మది ముమ్మాటికీ రాజకీయ హత్యే అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు.
ప్రకాశం: జిల్లాలోని టంగుటూరు మండలం రావివారిపాలెంలో అంగన్ వాడీ కార్యకర్త హనుమాయమ్మది ముమ్మాటికీ రాజకీయ హత్యే అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత (TDP Leader Vangalapudi Anitha) ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కక్ష్య కట్టి హనుమాయమ్మను అతి కిరాతకంగా చంపారని మండిపడ్డారు. రాజకీయ అండదండలతోనే ఇంటి ముందే కన్న కూతురి ముందు హత్య చేశారన్నారు. దళిత మహిళను చంపిన వ్యక్తి ఫోటోను కూడా పోలీసులు బయటపెట్టక పోవటం శోచనీయమని వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ, హోం మంత్రి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి, మహిళ కమిషన్ చైర్ పర్సన్.. అందరూ మహిళలై ఉండి తోటి మహిళ హత్య పట్ల కనీస సానుభూతి చూపించటం లేదని టీడీపీ నేత అన్నారు.
చంద్రబాబు (TDP Chief Chandrababu naidu), లోకేష్ (Nara lokesh)గురించి మాట్లాడమంటే తిట్ల దండకం అందుకుంటారన్నారు. జిల్లాకు చెందిన దళిత మంత్రి దళిత ఆడబిడ్డ హత్య చేయబడితే స్పందించలేదని విమర్శించారు. మంత్రి సురేష్ బయటకు వస్తే దళితులే చొక్కా చింపి కొడతారన్నారు. ఇన్‌ఛార్జ్ మంత్రి మేరుగ నాగార్జున (Minister Meruga Nagarjuna) కూడా దళితుడై ఉండి సానుభూతి వ్యక్తం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య చేస్తామని చెప్పి మరీ హనుమాయమ్మను హత్య చేశారన్నారు. ప్రభుత్వం హనుమాయమ్మ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించి.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ (AP CM YS Jaganmohan Reddy) దళిత ద్రోహి అంటూ వంగలపూడి అనిత విరుచుకుపడ్డారు.
Updated Date - 2023-06-09T15:15:11+05:30 IST