Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టుకు రహస్య సాక్షి వివరాలు
ABN, First Publish Date - 2023-07-24T14:20:47+05:30
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సుదీర్ఘంగా విచారణ కొనసాగిన విషయం తెలిసిందే. దీంతో వాంగ్మూలాల్లోని కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సీబీఐ కోర్టుకు వెల్లడించిన రహస్య సాక్షి వివరాలు బయటకు వచ్చాయి. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ సందర్భంగా సీబీఐ అధికారులు రహస్య సాక్షి ప్రస్తావనను హైకోర్టు ముందుకు తీసుకొచ్చారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Case) సుదీర్ఘ విచారణ కొనసాగిన విషయం తెలిసిందే. దీంతో వాంగ్మూలాల్లోని కీలక విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా కోర్టుకు (CBI Court) సీబీఐ అందించిన రహస్య సాక్షి వివరాలు బయటకు వచ్చాయి. ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) ముందస్తు బెయిల్ సందర్భంగా సీబీఐ అధికారులు (CBI) రహస్య సాక్షి ప్రస్తావనను హైకోర్టు (Telangana High Court) ముందుకు తీసుకొచ్చారు. దర్యాప్తు ముగిశాక వివరాలు కోర్టుకు సమర్పిస్తామంటూ గతంలో కోర్టుకు సీబీఐ అధికారులు తెలిపారు. అందులో భాగంగానే రహస్య సాక్షిగా పేర్కొన్న వైసీపీ నేత వాంగ్మూలాన్ని గత నెల 30న కోర్టుకు సీబీఐ సమర్పించింది. పులివెందుల నియోజకవర్గ వైసీపీ నేత కొమ్మా శివచంద్రారెడ్డి వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు నమోదు చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్ 26న హైదరాబాద్‌లో సీబీఐకు కొమ్మా శివచంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. కడప ఎంపీగా అవినాష్ పోటీ చేయరని వివేకా తనతో చెప్పినట్లు శివచంద్రారెడ్డి వెల్లడించారు. ‘‘2018 అక్టోబరు 1న వివేకా మా ఇంటికొచ్చి.. వైసీపీని వీడొద్దని నన్ను కోరారు. అవినాష్ రెడ్డి, శివశంకర్‌రెడ్డితో పనిచేయలేనని వివేకాతో నేను చెప్పాను. అవినాష్ రెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నట్లు వివేకా చెప్పారు. కడప ఎంపీగా విజయమ్మ లేదా షర్మిల పోటీ చేస్తారని వివేకా చెప్పారు. జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడినట్లు వివేకా నాకు చెప్పారు’’ అని సీబీఐకి శివచంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. 2018 అక్టోబరు 1 వరకు వైసీపీ సింహాద్రిపురం మండల కన్వీనర్‌గా ఉన్నట్లు శివచంద్రారెడ్డి వెల్లడించారు. 2018 అక్టోబరు 2న వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కొమ్మా శివచంద్రారెడ్డి.. తిరిగి 2020 జూన్‌లో వైసీపీలో చేరారు. 2019 డిసెంబరు 7న శివచంద్రారెడ్డి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేశారు. టీడీపీ నుంచి వైసీపీలోకి మారడంతో ఏప్రిల్ 26న మరోసారి సీబీఐ విచారించింది. సిట్‌కు ఇచ్చిన వాంగ్మూలానికి కట్టుబడి ఉన్నట్లు సీబీఐకి కొమ్మా శివచంద్రారెడ్డి తెలిపారు.
Updated Date - 2023-07-24T15:32:43+05:30 IST