Kotamreddy: వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి
ABN, First Publish Date - 2023-03-24T16:26:32+05:30
జిల్లాలో రోజు రోజుకు టీడీపీకి బలం పెరుగుతోంది. వైసీపీని అధిష్టానాన్ని దిక్కిరిస్తూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) ముప్పుతిప్పలు పెడుతున్నారు.
నెల్లూరు: జిల్లాలో రోజు రోజుకు టీడీపీకి బలం పెరుగుతోంది. వైసీపీని అధిష్టానాన్ని దిక్కిరిస్తూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) ముప్పుతిప్పలు పెడుతున్నారు. శ్రీధర్‌రెడ్డి టీడీపీలో చేరలేదు కానీ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తానని ప్రకటించారు. రానున్న రోజుల్లో కోటంరెడ్డి టీడీపీలో చేరుతారనే ప్రచారం కూడా ఉంది. కోటంరెడ్డి ఇలా ఉంటే ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి (Kotam Reddy Giridhar Reddy) టీడీపీలో చేరి వైసీపీకి షాకిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సమక్షంలో గిరిధర్‌రెడ్డి టీడీపీలో చేరారు. గిరిధర్‌రెడ్డికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. గిరిధర్‌రెడ్డి టీడీపీ చేరుతున్న నేపథ్యంలో నెల్లూరు నగరంలో చంద్రబాబు, లోకేష్ (Lokesh) ఫొటోలున్న ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. గిరిధర్‌రెడ్డి నెల్లూరు నుంచి భారీ కాన్వాయ్‌తో తాడేపల్లి వెళ్లి టీడీపీలో చేరారు.
2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను అధికార వైసీపీ క్లీన్ చిప్ చేసింది. కానీ ఇప్పుడు ఆ పార్టీకి జిల్లాలో గడ్డు రోజులు ఎదురవుతున్నాయనే చెప్పవచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆనం కుటుంబానికి చెందిన రామనారాయణరెడ్డి (Ramanarayana Reddy) వైసీపీ ప్రభుత్వంపై, జగన్‌మోహన్‌రెడ్డి (Jagan Mohan Reddy)పై ధిక్కార స్వరం వినిపించారు. ఆ వెనువెంటనే తన ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆవేదనతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీ నుంచి నిష్కమిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అధికార పార్టీకి చెందిన ఈ ఇద్దరు నాయకులు జగన్‌రెడ్డిపై, ఆయన ప్రభుత్వంలోని ఇతర ప్రముఖులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతానికి వీరి తిరుగుబాటు ప్రభావం రాష్ట్రమంతా కనిపించక పోయినా లోలోన రగిలిపోయే ఎంతోమంది వైసీపీ నాయకుల గొంతులకు జీవం పోసిందనే వాదన వినిపిస్తోంది. ఆత్మాభిమానం దెబ్బతీసే పరిస్థితులు ఎదురైనప్పుడు తిరుగుబాటు చేయడం నెల్లూరు జిల్లా (Nellore District) ప్రత్యేకం. అందుకు కారకులెవరైనా సరే... వారెంతటివారైనా సరే... చివరికి రాజకీయంగా జీవితం ఇచ్చినవారైనా సరే.. తిరగబడి ఎదురు నిలవడం నెల్లూరు నేతల నైజం.
నెల్లూరు రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే నిలుస్తూ ఉంటాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం వెనుక నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) ఉన్నారనే చర్చ కూడా సాగుతోంది. వాస్తవానికి ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ ఎప్పుడో ఆశలు వదులుకుంది. మిగిలిన ఓట్లన్నీ పడతాయనే అంచనాతోనే ఏడు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కానీ వారిలో మరో ఇద్దరు ‘క్రాస్’ ఓటింగ్ చేసేశారు. నికరంగా తమకు మిగిలిన 19 మందితోపాటు వైసీపీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు ఇద్దరు తమకే ఓటేస్తారని టీడీపీ భావించింది. 21 ఓట్లు గ్యారెంటీగా పడే అవకాశముందని పోటీకి దిగింది. వైసీపీలోని అసంతృప్త ఎమ్మెల్యేల్లో మరొక్కరు ఓటు వేస్తే గెలుపు ఖాయమని అంచనా వేసింది. కానీ అనూహ్యంగా రెండు అదనపు ఓట్లు పడ్డాయి. దీంతో ‘ఆ ఇద్దరు ఎవరు?’ అనే దిశగా సర్వత్రా చర్చ జరుగుతోంది. నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరుగా అధిష్టానంపై తిరుగుబాటు చేయడంతో ఇవన్నీ టీడీపీకి ప్లస్‌గా మారుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న ఎన్నికల్లో జిల్లా రాజకీయాల్లో కచ్చితంగా మార్పులు వస్తాయని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మున్ముందు జిల్లా వైసీపీలో ఇంకెందరు ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వెల్లగక్కుతారో వేచి చూడాలి మరి.
Updated Date - 2023-03-24T16:26:32+05:30 IST