Chandrababu: జగన్ రాయలసీమ ద్రోహి.. సీమకు అన్యాయం చేస్తున్నందుకు సిగ్గనిపించడం లేదా?..
ABN, First Publish Date - 2023-07-26T13:55:27+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాజెక్ట్స్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. జగన్ రాయలసీమ ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టులకు జగన్ తీరని అన్యాయం చేశారన్నారు. రాయలసీమకు అన్యాయం చేస్తున్నందుకు జగన్‌కు సిగ్గనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) రాయలసీమ ప్రాజెక్ట్స్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాయలసీమ ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టులకు జగన్ తీరని అన్యాయం చేశారన్నారు. రాయలసీమకు అన్యాయం చేస్తున్నందుకు జగన్‌కు సిగ్గనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి కోసం దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరిగాయన్నారు. రాయలసీమ అభవృద్ధి ఎన్టీఆర్ తెచ్చిన తెలుగు గంగ ప్రాజెక్ట్‌తోనే ప్రారంభమైందన్నారు. కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం వల్ల రాష్ట్రానికి మేలు కలుగుతుందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలుగుదేశం హయాంలో రూ.68,293 కోట్లు ఖర్చు పెడితే.. వైసీపీ ప్రభుత్వం (YCP Government) కేవలం రూ.22,165 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఇరిగేషన్ శాఖను వైసీపీ భ్రష్టు పట్టించిందని టీడీపీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాయలసీమలో ప్రాజెక్టుల కోసం తమ హయాంలో రూ. 12,441 కోట్లు ఖర్చు చేశామని.. వైసీపీ హయాంలో రూ. 2011 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని తెలిపారు. తెలుగు గంగకు టీడీపీ రూ. 504 కోట్లు ఖర్చు పెడితే.. వైసీపీ రూ.300 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని తెలిపారు. హంద్రీ - నీవా ప్రాజెక్టు కోసం టీడీపీ రూ. 4 వేల కోట్లకు పైగా ఖర్చు పెడితే.. జగన్ రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారన్నారు. గొల్లపల్లి ప్రాజెక్టును పూర్తి చేశామని. అందుకే కియా ప్రాజెక్టు వచ్చిందని తెలిపారు. రాజకీయ కక్షతో కుప్పానికి నీరందించ లేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి కమీషన్లపైన ఉండే శ్రద్ధ రాయలసీమ ప్రాజెక్టుల మీద లేదన్నారు. రాయలసీమకు నీళ్లిస్తే రతనాల సీమగా మారుతుందని బాబు చెప్పుకొచ్చారు.
అలాంటి జీవో జారీ చేస్తారా?...
రాయలసీమకు గుండెకాయలాంటి ప్రాజెక్టు ముచ్చుమర్రి అనిఅన్నారు. అలాంటి ప్రాజెక్టును టీడీపీ పూర్తి చేస్తే.. వైసీపీ కనీసం నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఓ పక్క ప్రాజెక్టులు కట్టకుండా రాయలసీమకు అన్యాయం చేస్తూనే.. మరో వైపు ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను రక్షించ లేకపోతున్నారన్నారు. నిర్వహణ సరిగా లేక.. ఇసుక మాఫియాలో అన్నమయ్య డ్యాం కొట్టుకు పోయిందని తెలిపారు. రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు పేరుతో భారీ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఏపీ వ్యాప్తంగా 198 ప్రాజెక్టులు.. రాయలసీమలో 102 ప్రాజెక్టులను ప్రీ క్లోజర్ చేసేశారన్నారు. మరో ఐదేళ్ల వరకు టెండర్లు పిలవొద్దని జీవో జారీ చేస్తారా?... ఇంతటి దారుణానికి పాల్పడిన జగన్ రాయలసీమ ద్రోహి కాదా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమకు నీరందించగలిగితే కరవు.. వలసలు ఉండవన్నారు. జగన్ పోవాలి.. సీమలో సిరులు పండాలన్నారు. రాయలసీమకు ఎవ్వరూ చేయనంత ద్రోహం జగన్ చేశారని అన్నారు. కరవు ప్రాంతాన్ని కరవు ప్రాంతంగానే చూస్తామని... కులాల.. రాజకీయ కోణంలో చూడమని తెలిపారు. రాయలసీమ అభివృద్ధి కోసం యువగళంలో డిక్లరేషన్ ఇచ్చామని చెప్పారు. తాను మాట్లాడేది ఏపీ ప్రజల కోసమే అని అన్నారు. టీడీపీ రాగానే సీమ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే..
ప్రీ - క్లోజర్ చేసిన 102 ప్రాజెక్టులు తిరిగి ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రీ-క్లోజర్ చేసేశారన్నారు. టీడీపీ హయాంలో కూడా కొన్ని ప్రాజెక్టులను ప్రీ-క్లోజర్ చేయమని చెప్పినా తాను అంగీకరించ లేదని గుర్తుచేశారు. లాభం లేకున్నా.. ప్రాజెక్టులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చామన్నారు. ఐదేళ్లు వరకు ప్రాజెక్టులకు టెండర్లు పిలవద్దంటే.. అవి మూలన పడేయడం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రకటనల ఖర్చులు.. సలహాదారుల జీతాలతో కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేసే పరిస్థితి ఉండేదన్నారు. తాను మాట్లాడే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేక తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్ అయ్యారని వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు.. యువతకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో ప్రాంతం.. కులం పేరు చెప్పుకుని రాజకీయం చేస్తున్నారన్నారు. సీమలో ప్రశాంతత తెచ్చింది టీడీపీనే అని అన్నారు. ఏపీలో తుపాను నివారించలేమని.. కానీ కరవును నివారించవచ్చని తెలిపారు. అభివృద్ధి చేయకపోగా.. ప్రాజెక్టులను కూల్చేస్తారా అని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టులు కొట్టుకుపోలేదని.. గేట్లు విరిగిపోలేదన్నారు. వైసీపీని భూస్థాపితం చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు.
రాయలసీమ ప్రజలకు హోప్ కలిగించిన పార్టీ టీడీపీ..
రాయలసీమ ప్రజలకు హోప్ కలిగించిన పార్టీ టీడీపీ అని అన్నారు. అనంత లాంటి జిల్లాల్లో పదేళ్లల్లో ఎనిమిదేళ్లు వేరుశెనగ పంటలు ఎండిపోయిన పరిస్థితులు ఉండేవన్నారు. కరవులో ఉన్న సీమ ప్రజలకు తెలుగు గంగను ఎన్టీఆర్ ప్రారంభించారని గుర్తుచేశారు. హంద్రీ - నీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారని తెలిపారు. ఆ తర్వాత పట్టిసీమ ద్వారా సీమకు నీటిని తరలించామని చెప్పారు. నదుల అనుసంధానం ప్రాజెక్టులు చేపట్టాలని అప్పటి ప్రధాని వాజ్ పేయిని కోరానని.. గంగా - కావేరీ కలపాలని సూచించామన్నారు. ఏపీ విభజన తర్వాత పోలవరం ద్వారా కృష్ణా - గోదావరి నదుల అనుసంధానం కోసం ప్రయత్నించామని తెలిపారు. దీనికి అనుగుణంగా వివిధ ప్రాజెక్టులను రూపొందించి వాటిల్లో కొన్నింటికి టెండర్లు కూడా టీడీపీ హయాంలో పిలిచామన్నారు. నదుల అనుసంధానం ద్వారా ఏపీలో ప్రతీ ఎకరాకు నీరందించే ప్రయత్నం చేశామన్నారు. టీడీపీ హయాంలో మొత్తం బడ్జెట్టులో 9.63 శాతం ఇరిగేషన్ కోసం కేటాయింపులున్నాయని.. కానీ జగన్ హయాంలో మొత్తం బడ్జెట్టులో 2.35 శాతం మాత్రమే ఇరిగేషన్ కోసం ఖర్చు పెట్టిందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Updated Date - 2023-07-26T14:27:54+05:30 IST