Payyavula Keshav: జగన్ ఆరోపణలపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఫైర్
ABN, First Publish Date - 2023-03-20T21:21:11+05:30
ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ (CM Jagan)ఆరోపణలపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) ఫైర్ అయ్యారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ (CM Jagan)ఆరోపణలపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) ఫైర్ అయ్యారు. ఏ స్కామ్ లేని సీమెన్స్ ఒప్పందంలో ఏదో జరిగిందని జగన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, సీమెన్స్ సంస్థ, ప్రేమ్చంద్రారెడ్డి, సెంట్రల్ టూల్ డిజైన్స్ సంస్థ తప్పు చేయకుండా చంద్రబాబే చేశారా? అని పయ్యావుల ప్రశ్నించారు. ఈడీ ఎంక్వైరీ చేస్తుండగా సీఐడీ విచారణ ఎందుకు చేస్తున్నారు? అని మండిపడ్డారు. ఈడీ నలుగురిని అరెస్ట్ చేసింది కాబట్టి.. తప్పేననే రీతిలో సీఎం కామెంట్లు చేశారని పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేస్తేనే తప్పు చేసినట్లు అయితే ఈ రూల్ సీఎం జగన్కూ వర్తిస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ మాజీ ఎండీ అర్జా శ్రీకాంత్ ఇచ్చిన నివేదిక బయట పెట్టాలని, ఏ అకౌంట్లకు డబ్బులు వెళ్లాయి?.., ఏ పెద్దల ఖాతాలకు వెళ్లాయనే వివరాలు విడుదల చేయాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.
అయితే.. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో (skill development) గత ప్రభుత్వం దోపిడీ చేసిందని అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) ఆరోపించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయని జగన్ చెప్పారు. ఇది స్కిల్డ్ క్రిమినల్ చేసిన అతిపెద్ద స్కామ్, స్కిల్ పేరుతో డబ్బులు దోచేయడం చంద్రబాబు (Chandrababu)కు తెలిసిన స్కిల్ అని జగన్ విమర్శించారు. లాటరీ తరహాలోనే ఈ స్కిల్ స్కామ్ జరిగిందని, చంద్రబాబు ఈ స్కామ్‌ను ఎలా నడిపించారో చూపిస్తానని జగన్ అన్నారు. రూ.371 కోట్లు హారతి కర్పూరంలా మాయం చేశారని, స్కిల్ పేరుతో నిధులను మొదట షెల్ కంపెనీలకు మళ్లించారని, మళ్లీ అవి చంద్రబాబుకు తిరిగి వచ్చేలా చేశారని జగన్ ఆరోపించారు. స్కిల్ స్కామ్ ఏపీలో ప్రారంభమై విదేశాలకూ పాకిందని, ఈ స్కామ్‌పై సీఐడీ, జీఎస్టీ, ఐటీ, ఈడీ దర్యాప్తు జరుగుతోందన్నారు.
డబ్బు ఈ దేశం నుంచి విదేశాలకు.. అక్కడి నుంచి చంద్రబాబుకు చేరిందని, యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో డబ్బు దోచేయడం దారుణమన్నారు. ఈ స్కామ్‌లను గొప్ప విజన్‌తో క్రిమినల్ మాత్రమే చేయగలరని, చంద్రబాబు తన మనుషులను పెట్టించి స్కిల్ స్కామ్ నడిపారని జగన్ మండిపడ్డారు. సీమెన్స్ కంపెనీలో ఓ వ్యక్తితో లాలూచీ పడ్డారని, ఆ వ్యక్తిని వాడుకుని దోపిడీకి పాల్పడ్డారని సీఎం అన్నారు. స్కిల్ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు రూ.3,356 కోట్లు అయితే, ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం.. 90 శాతం సీమెన్స్ భరిస్తుందని జగన్ అన్నారు. ప్రైవేట్ కంపెనీ ఎక్కడైనా రూ.3 వేల కోట్లను గ్రాంట్‌గా ఇస్తుందా?, చంద్రబాబు మొహం చూసి ఇన్ని వేల కోట్లు గ్రాంట్‌గా ఇచ్చారా? అని జగన్ ప్రశ్నించారు. స్కిల్ స్కామ్‌పై దత్తపుత్రుడు ఎందుకు మౌనంగా ఉన్నారు?, కేబినెట్ అనుమతితో ఆగమేఘాలపై జీవో ఇచ్చారని, ఇచ్చిన జీవో ఒకటైతే.. జరిగిన ఒప్పందం మరొకటి అని జగన్ ఆరోపించారు. దోచుకో.. పంచుకో.. తినుకో అనేలా చంద్రబాబు విధానం ఉందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-03-20T21:23:28+05:30 IST