Nara Lokesh: మొదటి 100 రోజుల్లోనే పేద క్షత్రియులకు చేయూతనందిస్తాం: లోకేష్
ABN, First Publish Date - 2023-09-06T20:12:37+05:30
నాడు, నేడు ఎప్పుడూ క్షత్రియులకు టీడీపీ ప్రభుత్వం అండగా నిలబడిందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మొదటి వంద రోజుల్లోనే నిధులు కేటాయించి పేద క్షత్రియులకు చేయూతనందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
పశ్చిమ గోదావరి: నాడు, నేడు ఎప్పుడూ క్షత్రియులకు టీడీపీ ప్రభుత్వం అండగా నిలబడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మొదటి వంద రోజుల్లోనే నిధులు కేటాయించి పేద క్షత్రియులకు చేయూతనందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. భీమవరం మండలం వెంప గ్రామంలో క్షత్రియ సామాజిక వర్గీయులతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ ముఖాముఖిలో లోకేష్‌తో క్షత్రియులు తమ బాధలు చెప్పుకున్నారు. దీంతో క్షత్రియుల బాధలు విని చలించిపోయిన లోకేష్ వారిని అన్ని విధాల ఆదుకుంటామని హామి ఇచ్చారు. క్షత్రియులు రాజకీయాల్లో క్రమశిక్షణ, పద్ధతిగా నిలబడుతున్నారని ఆయన అన్నారు. క్షత్రియులను అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షత్రియులు ఆక్వారంగంలో చాలా కీలకపాత్ర వహిస్తున్నారని, కానీ వైసీపీ ప్రభుత్వ వైఖరి వల్ల వారు చాలా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీని సైకో జగన్ మరో బీహార్‌గా మార్చేశారని లోకేష్ మండిపడ్డారు. పుంగనూరులో చంద్రబాబుపై ఎలా దాడిచేశారో చూశామని, ఏనాడు చట్టాన్ని ఉల్లంఘించని వ్యక్తిపై రాళ్లదాడి చేయించారని అన్నారు. పార్టీ చేసిన తప్పులను ఎండగడుతున్నారని రఘురామకృష్ణంరాజును టార్చర్ చేశారని చెప్పారు. 8 నెలల్లో జగన్ వైరస్‌కు మంచి వ్యాక్సిన్ వస్తుందని లోకేష్ చెప్పారు. అలాగే భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని ఆయన హామీ ఇచ్చారు. అమరావతిలో అల్లూరి మెమోరియల్ ఏర్పాటుచేస్తామని తెలిపారు. పార్లమెంటులో కూడా అల్లూరి విగ్రహం ఏర్పాటుకు తెలుగుదేశం కృషిచేస్తుందని లోకేష్ చెప్పారు.
కాగా అంతకుముందు లోకేష్‌తో క్షత్రియులు తమ బాధలను చెప్పుకున్నారు. క్షత్రియుల్లో కూడా వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారు ఉన్నారని తెలిపారు. ‘‘మాలో కూడా పేదలు ఉన్నారు. కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి ఆదుకోవాలి. గతంలో క్షత్రియ సంక్షేమ నిధి ఏర్పాటుచేసి బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక కార్పొరేషన ఏర్పాటుచేసి ఏ ఒక్క క్షత్రియుడికి సహాయం చేయలేదు. చింతలపాటి వరప్రసాద మూర్తి రాజు తన 1800 ఎకరాలను విద్యాసంస్థలకు దానం చేశారు. కానీ ఆయన మరణానంతరం తగిన గౌరవం ప్రభుత్వాల నుంచి రాలేదు. టీడీపీ వచ్చాక రాష్ట్రప్రభుత్వం తరపున స్మారక భవనం ఏర్పాటుచేయాలి. ఆక్వాకల్చర్ రాకముందుకు వెంపలో 5 రైస్ మిల్లులు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మూతపడ్డాయి. ఆక్వాకు సంబంధించిన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లేవు. ఇక్కడ యువత ఇతర ప్రాంతాలకు వలసవెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నారు’’ అని క్షత్రియ సామాజికవర్గ ప్రతినిధులు లోకేష్‌తో తెలిపారు.
Updated Date - 2023-09-06T20:14:40+05:30 IST