Mekapati Rajamohan Reddy: మేకపాటికి మరోసారి జగన్ మొండిచేయి
ABN, First Publish Date - 2023-01-29T20:21:26+05:30
‘నేనున్నాను. నేను విన్నాను’ అంటూ ఎన్నికల ముందు అందరికీ సీఎం జగన్ (CM Jagan) హామీల వర్షం కురిపించారు. అడగడమే తడవు..
అమరావతి: ‘నేనున్నాను. నేను విన్నాను’ అంటూ ఎన్నికల ముందు అందరికీ సీఎం జగన్ (CM Jagan) హామీల వర్షం కురిపించారు. అడగడమే తడవు.. నేను చూస్తాను అంటూ భరోసాలతో ముందుకు వెళ్లాడు. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ నెమ్మదిగా తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తున్నారు. దీంతో తొలి నుంచి ఆయన వెన్నంటే నడిచిన నేతలు ఇప్పుడు ఇంత అన్యాయమా అంటూ వాపోతున్నారు. మాజీఎంపీ రాజమోహన్‌రెడ్డి (Rajamohan Reddy)కి జగన్ మరోసారి మొండిచేయి చూపించారు. గత ఎన్నికల సమయంలో ఎంపీ టికెట్ కోసం పోటీ పడినా జగన్ కుదరదన్నారు. అదేమంటే టీటీడీ చైర్మన్ పదవి ఆశ చూపారు. నాలుగేళ్లు కావస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. అప్పుడు ఆశ చూసి ఇప్పుడేమో టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వలేమని తేల్చిచెప్పారు. దీంతో మేకపాటి వర్గీయులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వైసీపీ కోసం మేకపాటి కుటుంబం మొదటి నుంచి కష్టపడితే కరివేపాకులా తీసి పారేశారంటూ వాపోతున్నారు.
కాంగ్రెస్ (Congress)ను జగన్ వీడినప్పటి నుంచి మేకపాటి కుటుంబం ఆయన వెంటే నడిచింది. జగన్ సూచించిన వెంటనే మారు మాట్లాడకుండా రాజమోహన్‌రెడ్డి రెండు సార్లు ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో నెల్లూరు (Nellore) ఎంపీ రాజమోహన్‌రెడ్డి గెలిచారు. అదే సమయంలో ఆత్మకూరు, ఉదయగిరి టికెట్లు మేకపాటి కుటుంబానికిచ్చారు. గత ఎన్నికల్లో మాత్రం రెండు ఎమ్మెల్యే టికెట్లుతో సరిపెట్టారు. రెండు దఫాలుగా జగన్.. వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy)కి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తూ వస్తున్నారు. అయితే తనకు ఇచ్చిన హామీ మేరకు ఈ సారైనా పదవి దక్కుతుందని మేకపాటి ఆశపడ్డారు. ఇటీవల రాజమోహన్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, జగన్‌ను కలిశారు. ఆ సమయంలో టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వలేమని, కుల ప్రాతిపాదికన ఈ సారి బీసీ సామాజిక వర్గానికి ఇస్తామని జగన్ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం వైఖరిపై మేకపాటి వర్గీయులు మండిపడుతున్నారు.
కావాలనే మేకపాటి కుటుంబానికి జగన్ ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారని మేకపాటి సన్నిహితులు వాపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో కనీసం రెండు ఎమ్మెల్యే టికెట్లైనా ఇస్తారో లేదో అని చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి (Chandrasekhar Reddy)కి తిరిగి టికెట్ ఇవ్వకపోవచ్చని.. ఆ స్థానం నుంచి విక్రమ్‌రెడ్డిని పోటీలోకి దింపుతారని ప్రచారం జరుగుతోంది. ఇంతగా వైసీపీ (YCP) కోసం జగన్ కోసం కష్టపడ్డ వారికే మొండిచేయి చూపిస్తే తమ పరిస్థితి ఏమిటని ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు అయోమయంలో పడ్డారు.
Updated Date - 2023-01-29T20:21:27+05:30 IST