పొట్ట కూటి కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు..
ABN , First Publish Date - 2023-02-10T01:13:14+05:30 IST
సొంతూరులో ఉపాధి లేక పొట్ట చేతపట్టుకుని కూలికి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న పెదబయలు మండలానికి చెందిన ఐదుగురు గిరిజనులను గురువారం మృత్యువు కబళించడంతో మన్యంలో విషాదం నెలకొంది. ప్రస్తుతం ఏజెన్సీలో వ్యవసాయ పనులు లేకపోవడంతో పేద గిరిజనులు కూలి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం సహజం. అదే క్రమంలో పెదబయలు మండలం పర్రెడ పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన వె చ్చంగి కృష్ణారావు, వెచ్చంగి నరసింగరావు, వెచ్చంగి సాగర్, ఆదే పంచాయతీ పరిధి వంచేడిపుట్టు గ్రామానికి చెందిన కుర్తాడి బొంజుబాబు, సమీపం బొండాపల్లి పంచాయతీ దిగుచెంపాపుట్టు గ్రామానికి చెందిన కొర్రా రామారావు, మరికొంత మంది ఈ ఏడాది సంక్రాంతి పండగ తరువాత జనవరి మూడో వారంలో జి.రాజంపేట ఆయిల్ ఫ్యాక్టరీలో పనికి వెళ్లారు.

- సొంతూరులో ఉపాధి లేక గత నెలలో కాకినాడ జిల్లాకు వెళ్లిన గిరిజనులు
- ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి ఐదుగురు పెదబయలు వాసులు మృత్యువాత
- మండలంలో విషాదఛాయలు
(ఆంధ్రజ్యోతి- పాడేరు/పెదబయలు)
సొంతూరులో ఉపాధి లేక పొట్ట చేతపట్టుకుని కూలికి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న పెదబయలు మండలానికి చెందిన ఐదుగురు గిరిజనులను గురువారం మృత్యువు కబళించడంతో మన్యంలో విషాదం నెలకొంది. ప్రస్తుతం ఏజెన్సీలో వ్యవసాయ పనులు లేకపోవడంతో పేద గిరిజనులు కూలి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం సహజం. అదే క్రమంలో పెదబయలు మండలం పర్రెడ పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన వె చ్చంగి కృష్ణారావు, వెచ్చంగి నరసింగరావు, వెచ్చంగి సాగర్, ఆదే పంచాయతీ పరిధి వంచేడిపుట్టు గ్రామానికి చెందిన కుర్తాడి బొంజుబాబు, సమీపం బొండాపల్లి పంచాయతీ దిగుచెంపాపుట్టు గ్రామానికి చెందిన కొర్రా రామారావు, మరికొంత మంది ఈ ఏడాది సంక్రాంతి పండగ తరువాత జనవరి మూడో వారంలో జి.రాజంపేట ఆయిల్ ఫ్యాక్టరీలో పనికి వెళ్లారు. గతంలోనూ ఈ ప్రాంతం నుంచి ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు కూలి పనుల కోసం గిరిజనులు వెళ్లిన సందర్భాలున్నాయి. అయితే అనుకోని విధంగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు గిరిజనులు మృతి చెందడం బాధాకరం.
లక్ష్మీపురంలో..
జి.రాగంపేట ఆయిల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతి చెందిన వెచ్చంగి కృష్ణారావు(35), వెచ్చంగి నరసింగరావు(39), వెచ్చంగి సాగర్(23) ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కావడంతోపాటు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో స్వగ్రామం పర్రెడ పంచాయతీ లక్ష్మీపురం శోకసంద్రంలో మునిగిపోయింది. వరుసకు సోదరులైన ఈ ముగ్గురు ఆయిల్ ఫ్యాక్టరీలో పని కోసం వెళ్లి ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబీకులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. కుటుంబ పోషణ కోసం దూర ప్రాంతానికి వెళ్లిన తమ వాళ్లు ఇలా ప్రాణాలు కోల్పోతారని అనుకోలేదని మృతుల బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు. అలాగే మరో ఇద్దరు మృతులు సైతం పేద గిరిజనులే కావడంతో వారి కుటుంబాలు సైతం ఈ ఘటనతో వీధిన పడ్డాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకే ఒక్క కొడుకును కోల్పోయి...
ప్రమాదంలో వెచ్చంగి సాగర్ మృతి చెందడంతో అతనిపై ఆధారపడిన తల్లిదండ్రులు సీతారం, సత్తెలమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు అయ్యాయని, ఒక్కగానొక్క కుమారుడు సాగర్ తమను పోషిస్తున్నాడని, అతని మృతితో తమ పరిస్థితి ఏమిటని రోదిస్తున్నారు.
ఇంటి పెద్దదిక్కు లేకుండా పోయాడు
ప్రమాదంలో మృతి చెందిన కొర్రా రామారావుకు తండ్రి, భార్య, ఎనిమిది మంది పిల్లలుఉన్నారు. వారంతా రామారావు రెక్కల కష్టంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుటుంబం కావడంతో రామారావు అవకాశం ఉన్న చోట్ల కూలీ పనులు చేసుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే క్రమంలో సంక్రాంతి తరువాత తోటి కూలీలతో కలిసి జి.రాజంపేట ఆయిల్ ఫ్యాక్టరీలో పనికి వెళ్లి ప్రమాదంలో మృతి చెందాడు. అతని మృతితో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది.
మృతుల కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం
పాడేరు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ఆయిల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున నష్టపరిహారం అందనుంది. ఒక్కో మృతుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.25 లక్షలు, ఆయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి మరో రూ.25 లక్షలు అందిస్తామని ప్రకటించారు.
మృతులకు ప్రముఖుల సంతాపం
ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రభుత్వ పరంగా మృతుల కుటుంబీకులను ఆదుకుంటామని వెల్లడించారు. సంతాపం తెలిపిన వారిలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ టి.నరసింగరావు, అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, ఎస్‌టీ కమిషన్ సభ్యుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఉన్నారు.