హనీ ట్రాప్
ABN , First Publish Date - 2023-05-27T00:43:02+05:30 IST
సీతమ్మధార ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి ఒకరికి గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సాప్ వీడియోకాల్ వచ్చింది.

వీడియో కాల్స్‌తో జాగ్రత్త
తెలియని నంబర్లతో వచ్చే వీడియో కాల్స్‌ను కట్ చేయడమే మంచిది
పొరపాటున ఎత్తితే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం
అందమైన యువతులతో వల
అంతా రికార్డింగ్ చేయించి తర్వాత డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిలింగ్
ఇవ్వకపోతే ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేస్తామని బెదిరింపులు
ఇటీవల కాలంలో నగరంలో పెరుగుతున్న బాధితులు
వర్చువల్ ప్రైవేటు నెట్‌వర్క్ ఆధారంగా మోసాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
సీతమ్మధార ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి ఒకరికి గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సాప్ వీడియోకాల్ వచ్చింది. ఎవరోనని ఫోన్ లిఫ్ట్ చేసిన ఆయనకు స్ర్కీన్‌పై అందమైన యువతి కనిపించింది. ఆయన్ను ఆమె మెల్లగా మాటల్లో దింపి తాను క్రమంగా నగ్నంగా మారడంతోపాటు...విశ్రాంత ఉద్యోగిని కూడా అలాగే చేయాలని కోరింది. ఆమె చెప్పినట్టే చేశారు. కొంతసేపటి తరువాత అవతల యువతి తప్పుకుని వేరొక వ్యక్తి లైన్‌లోకి వచ్చారు. కాల్ మొత్తం వీడియో రికార్డు అయిందని తమకు రూ.లక్ష పంపించకపోతే వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తామని బెదిరించి డబ్బు గుంజారు.
...ఈ తరహా నేరాలు నగరంలో కొద్దిరోజులుగా పెరుగుతున్నాయి. వీడియో కాల్స్ బాధితులమంటూ కనీసం రోజుకొకరు స్టేషన్‌కు వస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్‌లనే వాడుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ వంటి యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. సైబర్ నేరగాళ్లు దీన్ని ఆసరాగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. తాము ఎంపిక చేసుకున్న ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేస్తున్నారు. ఎక్కువగా పురుషులు వినియోగించే నంబర్లకే ఈ కాల్స్ వస్తుంటాయి. ఎవరోననే కుతూహలంతో ఫోన్ ఎత్తగానే అవతలి వైపు నుంచి అందమైన యువతి స్ర్కీన్‌పై కనిపిస్తుంది. తాను ఒంటరిననో...మీతో సరదాగా గడపాలనుకుంటున్నానో...చెప్పి చనువుగా మాట్లాడుతూ ముగ్గులోకి దింపుతుంది. క్రమంగా తన శరీరంపై వున్న దుస్తులను ఒక్కొక్కటి తొలగిస్తూ...అవతలి వారిని కూడా అలాగే చేయాల్సిందిగా ప్రేరేపిస్తుంది. ఆమె ట్రాప్‌లో పడితే అంతే సంగతులు. తమ సెల్‌ఫోన్‌లో స్ర్కీన్ రికార్డింగ్ చేయడం మొదలెడతారు. ఆ తరువాత తమ అసలు స్వరూపాన్ని బయటపెడతారు. మీరు నగ్నంగా ఉండి మాట్లాడినదంతా రికార్డింగ్ చేశామనో...స్ర్కీన్‌షాట్‌లు తీశామనో చెప్పి...అడిగినంత డబ్బులు ఇవ్వాలని...కానిపక్షంలో వాటిని మీ కుటుంబ సభ్యులు, బంధువులకు పంపిస్తామని, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తామని, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తామని బెదిరించడం మొదలుపెడతారు. ఎందుకొచ్చిన గొడవనుకుని ఎవరైనా ఒకసారి డబ్బులు ఇచ్చినా...తర్వాత కూడా వదలరు. దశలవారీగా డబ్బుల కోసం బెదిరిస్తూనే ఉంటారు. ఇలాంటి బాధితులు నగరంలో ఇటీవల పెరుగుతున్నారు. బాధితుల్లో అత్యధికులు సంపన్న కుటుంబాలకు చెందినవారు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు, మంచి హోదాలో ఉద్యోగ విరమణ చేసినవారు ఉండడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లడానికి వెనుకంజ వేస్తున్నారు. అవతలివారి టార్చర్ శ్రుతిమించినప్పుడు మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అప్పుడు కూడా కేసు నమోదుచేయకుండా తమను వేధిస్తున్న వారిని, బెదిరింపులకు గురిచేస్తున్న వారిని గుర్తించి, హెచ్చరించడం ద్వారా తమకు ఇబ్బంది కలగకుండా చూడాలని మాత్రమే కోరుతున్నారు. దీంతో పోలీసులు వారి వివరాలను బహిర్గతం చేయడానికి వెనుకాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
వీడియో కాల్స్‌తో రకరకాల మోసాలు జరుగుతున్నాయనేందుకు ఇటీవల వెలుగుచూసిన మరో కేసును కూడా పేర్కొనవచ్చు. హైదరాబాద్‌లో స్థిరపడిన పెందుర్తి ప్రాంతానికి చెందిన దాడి శ్రీనివాసరావు కొంతమందిని నియమించుకుని అమాయకులైన వారిని ముఖ్యంగా మహిళలకు స్కైప్ లేదా వాట్సాప్ ద్వారా కాల్ చేయించేవారు. తాము పోలీస్ అధికారిగా పరిచయం చేసుకుని...మీ పేరుతో కొరియర్‌లో పార్శిల్ వచ్చిందని, అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయని బెదిరించేవారు. అవతలి వారిని నమ్మించేందుకు నకిలీ గుర్తింపు కార్డులను కూడా చూపించేవారు. దీనిపై విచారణలో భాగంగా ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ సూచించి, వారి ఫోన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకునేవారు. కేసు నుంచి బయటపడేందుకంటూ డబ్బులు గుంజేవారు. ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా వంటి నగరాలకు చెందిన పలువురు శ్రీనివాసరావు గ్యాంగ్ చేతిలో మోసపోయారు. ఢిల్లీలో నమోదైన ఒక కేసులో బాధితురాలితో సైబర్ నేరగాడు వీడియో కాల్ చేసినప్పుడు ఖాకీ యూనిఫారం ధరించి మాట్లాడినట్టు తేలింది.
వర్చువల్ ప్రైవేటు నెట్‌వర్క్ ఆధారంగా మోసాలు
వీడియో కాల్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న వారంతా వర్చువల్ ప్రైవేటు నెట్‌వర్క్ (వీపీఎన్) ఆధారంగా వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. నిర్ణీత మొత్తం చెల్లించి వీపీఎన్ ద్వారా ఎవరైనా గంట, రెండు గంటలు, ఒకరోజు...పనిచేసేలా తమకు కావాల్సిన నంబర్‌ను పొందవచ్చు. సాధారణంగా మనం వీడియో కాల్స్ చేయాలంటే బీఎస్‌ఎన్‌ఎల్, జియో, ఎయిర్‌టెల్, ఐడియా వంటి నెట్‌వర్క్ ప్రొవైడర్ల నుంచి సిమ్ కార్డు పొందాల్సి ఉంటుంది. మొబైల్ డేటా కావాలనుకుంటే పైన పేర్కొన్న నెట్‌వర్క్ ప్రొవైడర్లనే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు ఏ నెట్‌వర్క్ వాడుతున్నామనేది టెక్నాలజీ మీద అవగాహన ఉన్నవారెవరైనా సులభంగా తెలుసుకోవచ్చు. అదే వీపీఎన్ ద్వారా వీడియోకాల్ చేసేవారు మాత్రం అమెరికా, సింగపూర్, లండన్, స్విట్జర్లాండ్...ఇలా దేశాలకు చెందిన నంబర్లను చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక చేసుకున్న దేశాన్ని బట్టి వాళ్లు వీడియోకాల్ చేసినప్పుడు +45, +11, +24 వంటి కోడ్‌లు ఫోన్ నంబర్ కంటే ముందు వస్తాయి. వారికి ఐపీ అడ్రస్ అవసరం లేకుండానే కావాల్సిన నంబర్‌కు ఇంటర్‌నెట్ ద్వారా వీడియోకాల్ చేసే వీలుంటుంది కాబట్టి, పోలీసులు వారిని గుర్తించడం కూడా చాలా కష్టంగా మారుతోంది.
తెలియని నంబర్లకు దూరంగా ఉండండి
కె.భవానీప్రసాద్, సైబర్‌క్రైమ్ సీఐ
మనకు తెలియని నంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే వాటిని లిఫ్ట్ చేయకుండా కట్ చేయడం మంచిది. ఇండియా నంబర్లు అయితే +91తో మొదలవుతాయి. +91 కాకుండా ఇతర కోడ్‌తో కాల్ వచ్చిందంటే అది మనదేశం నుంచి కాదని తెలుసుకోవాలి. సైబర్ నేరగాళ్లు వీడియోకాల్స్ చేసి నగ్నంగా మార్చి స్ర్కీన్ రికార్డింగ్‌లు, స్ర్కీన్‌షాట్‌లు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతారు. ఇలాంటి బాధితులు నగరంలో రోజుకు ఒకరైనా ఉంటున్నారు. తెలియని నంబర్ల నుంచి వీడి యోకాల్ ఏ దేశం నుంచి వచ్చినా తప్పనిసరి పరిస్థితిలో ఎత్తాల్సి వస్తే మాత్రం ఫ్రంట్ కెమెరా మూసిన తర్వాత మాత్రమే మాట్లాడాలి.