Vontimitta Temple: ఒంటిమిట్ట రాములోరి కల్యాణం.. ఆ మార్గాల్లో అస్సలు వెళ్లకండి..
ABN , Publish Date - Apr 10 , 2025 | 03:42 PM
ఒంటిమిట్ట రాములోరి కల్యాణం నేపథ్యంలో సీఎం చంద్రబాబు సతీసమేతంగా ఆలయానికి రానున్నారు. భక్తులు, టీడీపీ అభిమానులు సైతం పెద్దఎత్తున పాల్గొనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.

తిరుపతి: కడప జిల్లా ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం దగ్గరపడింది. రేపు (శుక్రవారం) రాత్రి స్వామిఅమ్మవార్ల కల్యాణానికి ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా హాజరుకానున్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఆయన వివాహ కార్యక్రమానికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇందు కోసం మంగళవారం సాయంత్రం 5 గంటల సమయానికి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ఒంటిమిట్ట రాములవారి ఆలయానికి చేరుకుంటారు. అనంతరం వివాహ వేడుకలో పాల్గొని స్వామిఅమ్మవార్ల అశీస్సులు తీసుకుంటారు. ఆ తర్వాత ఒంటిమిట్ట టీటీడీ అతిథి గృహంలో రాత్రి బస చేసి శనివారం ఉదయం కడప నుంచి విజయవాడకు బయలుదేరుతారు.
అయితే సీఎం చంద్రబాబు పర్యటన, రాములోరి కల్యాణం నేపథ్యంలో భక్తులు, టీడీపీ అభిమానులు పెద్దఎత్తున ఒంటిమిట్ట ఆలయానికి చేరుకుంటారు. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఈ మేరకు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని డిఎస్పీ శ్రీరామకృష్ణచారిని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. దీంతో తిరుపతి జిల్లా నుంచి కడప జిల్లాకు వెళ్లే భారీ వాహనాలను భాకారపేట వయా పీలేరు- రాయచోటి మీదుగా మళ్లిస్తున్నట్లు డిఎస్పీ శ్రీరామకృష్ణచారి తెలిపారు. అలాగే హెవీ వెహికల్స్ కడప నుంచి తిరుపతికి రావాలంటే.. కడప- రాయచోటి, పీలేరు- రాయచోటి మీదుగా భాకరాపేట నుంచి తిరుపతికి వెళ్లాలని సూచించారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన చెప్పారు. కావున వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని డిఎస్పీ కోరారు.
మరోవైపు కల్యాణ మహోత్సవానికి 150 కిలోల ముత్యాలను ఆలయ అధికారులు సిద్ధం చేశారు. అలాగే వివాహ వేడుకకు హాజరయ్యే భక్తులకు 1.50 లక్షల ప్యాకెట్ల తలంబ్రాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. తలంబ్రాలతోపాటు తిరుమల శ్రీవారి చిన్నలడ్డూలను సైతం భక్తులకు అందించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ప్రత్యేక పంపిణీ కేంద్రాలను సిద్ధం చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి తోపులాటలు జరగకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే భద్రతా ఏర్పాట్లను సైతం పటిష్టం చేశారు. ఇందుకోసం జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దగ్గరుండి మరీ పనులను పరిశీలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Dowry Harassment: ఎంత దారుణం.. మహిళను వివస్త్రను చేసి ఆపై
Miniser Kollu Ravindra: ఏపీలో ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్..