AP MLC Results: పాపం వైసీపీ.. అగ్ర నేతలు ప్రచారం చేసినా ఫలితం శూన్యం
ABN, First Publish Date - 2023-03-18T02:05:00+05:30
ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను షాక్‌కు గురిచేసింది.
ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలో ఘోర పరాజయం
ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న అధికార పార్టీ నాయకులు
తాయిలాలు ఇచ్చినా ఏమాత్రం ప్రభావం చూపకపోవడంపై విస్మయం
అగ్ర నేతలు ప్రచారం చేసినా ఫలితం శూన్యం
ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు ఈ ఫలితం నిదర్శనం
అభివృద్ధి, ఉపాధి కల్పనపై నిర్లక్ష్యానికి మూల్యం
భూకబ్జాలు, విపక్ష నేతలపై కక్షపూరితంగా వ్యవహరించడంపై ప్రజల్లో ఆగ్రహం
ఓటమిపై వైసీపీ నేతల విశ్లేషణ
ప్రభుత్వ పెద్దలు ఒంటెత్తు పోకడలు మానుకోకపోతే 2024 ఎన్నికల్లో ఇవే ఫలితాలు పునరావృతం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను షాక్‌కు గురిచేసింది. తమ ప్రభుత్వ పాలన జనరంజకంగా సాగుతోందని, వచ్చే సాధారణ ఎన్నికల్లో తిరిగి గెలుపొందడం ఖాయమనే ధీమాలో నాయకులు ఉన్నారు. అందుకే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్ అని పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికను అధిష్ఠానం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సుబ్బారెడ్డితో పాటు సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి వారంతా ఉత్తరాంధ్రలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఓటర్లకు తాయిలాలు పంచారు. అయినప్పటికీ టీడీపీ అభ్యర్థి చేతిలో భారీ తేడాతో ఓడిపోవడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడడం లేదు. ఏడాదిలో జరగనున్న ఎన్నికల్లో కూడా ఇదే తరహా ఫలితాలు పునరావృతం కావచ్చుననే ఆందోళన ఇప్పుడు వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతుండడంతో ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికపై ప్రత్యేకంగా దృష్టిసారించాయి. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడంతోపాటు త్వరలో తాను విశాఖ నుంచే పరిపాలన సాగించనున్నట్టు స్వయంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకపక్షమేనని వైసీపీ నేతలు భావించారు. ఈ ఎమ్మెల్సీ ఫలితాలు మూడు రాజధానుల నిర్ణయంపై రిఫరెండంగా ప్రచారం జరగడంతో వైసీపీ నేతలు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్‌ను చాలాముందుగానే ప్రకటించారు. ఓటర్ల నమోదుకు జిల్లా, నియోజకవర్గ, మండల/వార్డు, బూత్‌ల వారీగా ఇన్‌చార్జులతో సమావేశాలు నిర్వహించారు. పనిలో పనిగా అనర్హులను కూడా ఓటర్లుగా చేర్పించారు. ఓటర్ల నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాత వార్డు సచివాలయ కార్యదర్శులు, వలంటీర్ల ద్వారా వారి పరిధిలోని ఓటర్ల వివరాలను సేకరించారు. నియోజకవర్గాలు, మండలాలు, వార్డుల వారీగా పార్టీ నేతలు, ముఖ్యకార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు గురించి వివరించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్‌నాథ్, విడదల రజనిలతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్‌లు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, కార్పొరేషన్ల చైర్మన్ల ఆధ్వర్యంలో ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. సంక్షేమ పథకాలతోపాటు విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం వంటివి తమ అభ్యర్థి గెలుపునకు దోహదం చేస్తాయంటూ నేతలు భావించారు. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా ఓటర్లకు నగదుతోపాటు కొన్నివర్గాల ఓటర్లకు వెండి బిస్కెట్లు, గిఫ్ట్ కూపన్లు వంటివి పంచిపెట్టారు. వీటన్నింటి కారణంగా తమ అభ్యర్థి గెలుపు తథ్యమనే భావనతో వైవీ సుబ్బారెడ్డి వంటి నేతలు ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలను వచ్చే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్ అంటూ ప్రకటనలు గుప్పించారు.
ప్రభుత్వంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నా సరే తమ అభ్యర్థి గెలుపునకు ఢోకా వుండదనే భావన వ్యక్తపరిచారు. తీరా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తొలిరౌండ్‌లో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం కనబరచడంతో వైసీపీ నేతలు కలవరపడ్డారు. తరువాత రౌండ్ చూద్దామనుకున్నారు. కానీ ప్రతి రౌండ్‌లోనూ టీడీపీ ఆధిక్యం కొనసాగడంతో కంగుతిన్నారు. అధికార బలం, డబ్బు పంపిణీ, అన్నింటికంటే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించినా తమ అభ్యర్థి ఘోర పరాజయం పాలవ్వడాన్ని నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రజా వ్యతిరేకత స్థాయికి నిదర్శనం
పోలైన ఓట్ల (మొదటి ప్రాధాన్యం)లో 43.88 శాతం ఓట్లు టీడీపీ అభ్యర్థికి లభించగా, తమ అభ్యర్థి సుధాకర్‌కు కేవలం 29.43 శాతం ఓట్లు మాత్రమే రావడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడడం లేదు. సుమారు 14.45 శాతం ఓట్ల వ్యత్యాసం వుండడం ప్రమాద సంకేతమని వ్యాఖ్యానిస్తున్నారు. తాము భారీగా తాయిలాలు పంచినా ఓటర్లు పట్టించుకోకుండా...ఏమీ పంచని టీడీపీ అభ్యర్థికి ఓటేశారంటే తమ ప్రభుత్వ విధానాల పట్ల అసంతృప్తిని వ్యక్తంచేయడమేనని అంటున్నారు. పార్టీ అగ్రనేతలు, అధిష్ఠానం క్షేత్రస్థాయిలో వున్న పరిస్థితిని పట్టించుకోకుండా, సర్వేల పేరుతో తమకు తోచినట్టు నిర్ణయాలు తీసుకోవడం వల్లే ప్రస్తుత పరిస్థితి ఎదురైందని నగరంలోని ఒక కీలక నేత వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రతిపక్ష నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుండడం ప్రజల్లో వ్యతిరేకతను పెంచిందని నగరానికి చెందిన ఒక మహిళా వైసీపీ నేత విశ్లేషించారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనను నిర్లక్ష్యం చేయడంతో యువత, నిరుద్యోగుల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగిందని రూరల్ జిల్లాకు చెందిన ఒక శాసనసభ్యుడు అన్నారు. నగరంలో విలువైన భూములను కబ్జా చేశారనే ఆరోపణలతోపాటు విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తే మిగిలిన ఆస్తులను కూడా లాక్కుంటారనే భయం ఉత్తరాంధ్ర ప్రజల్లో నెలకొందని జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. మరో ఏడాది సమయం ఉన్నందున ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను తెలుసుకుని, లోపాలను సరిదిద్దుకుని ప్రజలకు చేరువ కావడంతోపాటు పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసే నేతలకు సముచిత గౌరవం ఇవ్వాలని లేనిపక్షంలో 2024 ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితమే చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
Updated Date - 2023-03-18T10:53:03+05:30 IST