ప్రజా సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-07-01T00:23:54+05:30 IST

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్‌ డిమాండ్‌ చేశారు.

ప్రజా సమస్యలు పరిష్కరించాలి
విలేకరులతో మాట్లాడుతున్న రత్నాకర్‌

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 30 :ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక జీవీఎంసీ కార్యాలయానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అభివృద్ధి పనులకు నిధులున్నా పనులు చేయడంపై అధికారులు తీవ్ర అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. అనకాపల్లి మున్సిపాలిటీగా ఉన్నప్పుడు జీవీఎంసీలో కలిస్తే విశాఖ మాదిరిగా అభివృద్ధి చెందుతాదని ఆశ పడ్డామని అయితే అధికారుల తీరు వల్ల అభివృద్ధి చెందడం లేదన్నారు. అనకాపల్లి జోన్‌ తరచూ నిర్లక్ష్యానికి గురవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. పన్నులు వసూళ్లకు అనకాపల్లిపై దృష్టి పెట్టే అధికారులు అభివృద్ధి పనులపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. మంత్రి ఆదేశాలిచ్చినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కొత్త నీటి పైపులైన్లు మూడు నెలలు క్రితమే మంజూరైనా అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ పనులు మొదలు కాలేదన్నారు. తాగునీటి మినీ ట్యాంకులు, బోర్లు మరమ్మతులకు గురైనా పట్టించుకోవడం లేదన్నారు. వీధి లైట్లు పలుచోట్ల వెలగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, 32 హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటుకు స్తంభాలు వేసి నేటి వరకు లైట్లు బిగించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అని రత్నాకర్‌ అన్నారు. పంట కాలువలు, జీవీఎంసీ కాలువల్లో పూడికతీత పనులు చేపట్టలేదని ఈ కారణంగా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయన్నారు. పిచ్చికుక్కల కారణంగా సొంత వీధుల్లో ప్రజలు నడవలేని దయనీయ స్థితిలో ఉన్నారన్నారు. జీవీఎంసీ కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఎవరి సమస్యలు చెప్పుకోవాలో తెలియక ఇంటికి వెళ్లిపోతున్నారన్నారు. చివరకు అధికారులు కూడా జోనల్‌ కార్యాలయంలో అందుబాటులో ఉండడం లేదని ఆరోపించారు. వారంలో సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులు ప్రారంభించకపోతే ఇక్కడ అధికారుల తీరుపై సీఎం దృష్టికి తీసుకువెళతానన్నారు. జీవీఎంసీ ప్రధాన కమిషనర్‌ నెలలో ఒక రోజంతా అనకాపల్లిలో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొణతాల భాస్కరరావు, మళ్ల రాజా, భీశెట్టి కృష్ణఅప్పారావు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-01T00:23:54+05:30 IST