Pawan Kalyan: వలంటీర్లపై జనసేనాని మరోసారి కీలక వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-07-11T15:09:30+05:30
వలంటీర్లపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వలంటీర్లపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా దుమారం రేపుతుండగా.. మరోసారి వలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ల వ్యవస్థ లేకపోతే దేశం ఆగిపోదని.. నిత్యావసర వస్తువుల వ్యవస్థ ఆగిపోదని తేల్చిచెప్పారు.
ఏలూరు: వలంటీర్లపై (AP Volunteers) జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వలంటీర్లపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా దుమారం రేపుతుండగా.. మరోసారి వలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ల వ్యవస్థ లేకపోతే దేశం ఆగిపోదని.. నిత్యావసర వస్తువుల వ్యవస్థ ఆగిపోదని తేల్చిచెప్పారు. వలంటీర్లు చేసే ప్రతీ తప్పుడు పని సమాజం మీద ప్రభావం చూపుతుందని తెలిపారు. దేశంలో సమాంతర వ్యవస్థలు ఎక్కువయ్యాయని.. ఈ సమాంతర వ్యవస్థ నడుం విరగ్గొడదామని పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు.
ఏలూరులో పవన్ ఇంకేం మాట్లాడారంటే..
‘‘జగన్ తన ఇంట్లో ఏం చేస్తే మనకెందుకు..?, పబ్జీ ఆడుకోనివ్వండి.. లేదంటే ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ ఆడుకోనివ్వండి. ప్రజల డబ్బుతో ఆన్‌లైన్ జూదం ఆడితే తోలు తీసేస్తాం. జగన్ అనే ప్రతీ మాట రేపిస్టులను తయారు చేస్తున్నది. మహిళలు రాజకీయాల్లోకి రాకుండా చేస్తున్నది. మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి రావాలి. వలంటీర్లపై నాకు కోపం లేదు. ఉపాధి కూలీలకు వచ్చే వేతనం కన్నా వారికి తక్కువ వస్తుంది.’’ అని పవన్ తెలిపారు.
‘‘రాజకీయాల్లోకి రాకుండా నన్ను చాలామంది బెదిరించారు. ప్రలోభ పెట్టారు.. వందల కోట్లు ఇస్తామన్నారు. నన్ను డబ్బులతోనూ.. పదవులతోనూ కొనలేరు. నాయకులు చేసే తప్పిదాలు ప్రజల మీద.. కులాల మీద పడుతుంది. 2009లో వైఎస్ సీఎం అయ్యాక గ్రేటర్ హైదరాబాద్ అనగానే ఒక్కసారిగా అక్కడ భూముల రేట్లు పెరిగిపోయాయి. దీంతో ఇదంతా ఆంధ్ర వారి వలనే అని తెలంగాణ ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది. జగన్ మా వాడు అని దళితులు ఆయనను గెలిపిస్తే.. మొదట వారినే జగన్ దెబ్బకొట్టారు.’’ అని పవన్ పేర్కొన్నారు.
‘‘వైసీపీ పార్టీ వారిది కాదు.. వేరే వాళ్ల దగ్గర నుంచి తీసుకున్న పార్టీ. రైతుల పొట్టగొట్టి.. శ్రామికులను దోచుకున్న పార్టీ వైసీపీ. పబ్లిక్ పాలసీ రూపొందించడం అంత తేలికకాదు. ఉదాహరణకు కొల్లేరే. పర్యావరణాన్ని రక్షించాలనుకుంటే.. కొల్లేరుపై ఆధారపడిన రైతులు దెబ్బతింటారు. రైతులను ఆదుకుందామంటే పర్యావరణం దెబ్బతింటుంది. సినిమాల్లో డ్యాన్స్ చేయవచ్చు.. ఇంకా ఏమైనా చేయవచ్చు.. కానీ రాజకీయాల్లో అది సాధ్యం కాదు. నేనేంటో నిరూపించుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చాను.’’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
Updated Date - 2023-07-11T15:20:18+05:30 IST