కాంపా కోలా మళ్లీ వచ్చిందోచ్..
ABN , First Publish Date - 2023-03-10T01:10:08+05:30 IST
యాభై ఏళ్ల క్రితం నాటి ప్రముఖ శీతల పానీయ బ్రాండ్ ‘కాంపా కోలా’.. సరికొత్త అవతారంలో తిరిగొచ్చేసింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ ఈ బ్రాండ్‌ను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది...

70వ దశకం నాటి ప్రముఖ శీతల పానీయాన్ని తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టిన రిలయన్స్
తొలుత తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి..
కోలా, లెమన్, ఆరెంజ్ ఫ్లేవర్స్‌లో విడుదల
న్యూఢిల్లీ: యాభై ఏళ్ల క్రితం నాటి ప్రముఖ శీతల పానీయ బ్రాండ్ ‘కాంపా కోలా’.. సరికొత్త అవతారంలో తిరిగొచ్చేసింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ ఈ బ్రాండ్‌ను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రిలయన్స్ ఈ మధ్యనే కాంపా కోలా బ్రాండ్ హక్కులను దక్కించుకుంది. కూల్‌డ్రింక్స్ విక్రయాలు జోరందుకుంటున్న వేసవిలో కోకా కోలా, పెప్సీ వంటి అగ్రగామి బ్రాండ్లకు పోటీగా మార్కెట్లోకి అడుగు పెట్టింది. రిలయన్స్ రిటైల్ ఎఫ్‌ఎంసీజీ అనుబంధ విభాగమైన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఈ జనవరిలో గుజరాత్‌కు చెందిన సోస్యో హజూరీ అనే సాఫ్ట్‌డ్రింక్, జ్యూస్ మేకర్ కంపెనీలో 50 శాతం వాటా కొనుగోలు చేసింది. సోస్యో హజూరీ అంతక్రితమే రూ.22 కోట్లకు కాంపా కోలా బ్రాండ్‌ను ఫ్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి కొనుగోలు చేసింది. కాంపా పోర్ట్‌ఫోలియోలో తొలుత మూడు ఫ్లేవర్లతో (కోలా, లెమన్, ఆరెంజ్) శీతల పానీయాలను ప్రవేశపెడుతున్నట్లు రిలయన్స్ వెల్లడించింది. అంతేకాదు, మొట్టమొదట తెలుగు రాష్ట్రాల్లోనే వీటిని అందుబాటులోకి తేనున్నట్లు, దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. 1970-80 దశకాల్లో ప్రముఖ సాఫ్ట్‌డ్రింక్ అయిన కాంపా కోలా.. కోకా కోలా, పెప్సికో బ్రాండ్ల ధాటికి క్రమంగా ప్రాభవం కోల్పోయింది. 1949 నుంచి 1970 వరకు కోకా కోలా ఏకైక డిస్ట్రిబ్యూటర్ అయిన ప్యూర్ డ్రింక్స్ గ్రూప్.. 70వ దశకంలో కాంపా కోలా పేరుతో సొంత కూల్‌డ్రింక్‌ను లాంచ్ చేసింది. అనతి కాలంలోనే మార్కెట్ అగ్రగామి బ్రాండ్‌గా ఎదిగింది. ఆ తర్వాత కాంపా ఆరెంజ్‌తో పాటు ఆరెంజ్ ఫ్లేవర్ డ్రింక్స్‌ను కూడా విడుదల చేసింది. అప్పట్లో కంపెనీకి ముంబై, ఢిల్లీలో బాట్లింగ్ ప్లాంట్లుండేవి.