Cyber Fraud : బాబోయ్.. ఇదో కొత్త రకం మోసం.. త్వరగా తెలుసుకోండి లేకపోతే అంతే..
ABN, First Publish Date - 2023-02-02T22:33:47+05:30
కొత్త కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసరికి.. దీన్ని సక్రమంగా వినియోగించుకునే వారికంటే దుర్వినియోగం చేసుకునే..
హైదరాబాద్ : కొత్త కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసరికి.. దీన్ని సక్రమంగా వినియోగించుకునే వారికంటే దుర్వినియోగం చేసుకునే వారే ఎక్కువ అవుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న అత్యాశతో.. ఎదుటివారి బలహీనతలను, అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. సైబర్ క్రైమ్స్ పట్ల ప్రజలు అవగాహనతో ఉండాలని పదే పదే పోలీసులు (Police) చెబుతున్నా.. నిత్యం ఎక్కడో ఒకచోట ఇలాంటి మోసాలు (Fraud) వెలుగుచూస్తూనే ఉన్నాయి. సైబర్ క్రైమ్స్ గురించి ప్రజలు కాస్తో కూస్తో అవగాహన పెంచుకున్నప్పడల్లా కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కాదేది సైబర్మోసాలకు అనర్హం.. అన్నట్టు నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
వాళ్ల మాటలు నమ్మారో అంతే..!
గిఫ్ట్ కూపన్స్(Gift Cards) వచ్చాయ్.. రివార్డ్స్ వచ్చాయ్ అని అపరిత వ్యక్తుల నుంచి తెగ ఫోన్ కాల్స్ (Phone Calls) వస్తుంటాయ్. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ ఫోన్ కాల్ సంభాషణ కూడా ఎలా ఉంటుందంటే.. బాబోయ్ ఇది నిజమే అన్నట్లుగా ఉంటుంది. పొరపాటున ఫోన్‌లో చెప్పినట్లు చేశారో ఇక అంతే సంగతులు. మాటలు కలుపుతూ నిలువునా ముంచేస్తారు. "మొదట మీ అకౌంట్‌లో నుంచి 10 వేలు, 15వేలు అలా పంపితే.. లక్షలు వచ్చి పడతాయ్" అని మాయ మాటలు చెబుతారు. పంపిన తర్వాత అకౌంట్ డీటైల్స్ అడుగుతారు.. పొరపాటున డీటైల్స్ చెబితే ఇక మీ జేబు ఖాళీ అయిపోతుంది. ఇందులో ఏ మాత్రం అలర్ట్‌గా లేకపోతే అంతే సంగతులు.
తస్మాత్ జాగ్రత్త..!
ప్రముఖ బ్యూటీ కంపెనీ నైకా (NYKAA) పేరుతో ఈ మధ్య మోసాలు భారీగా జరుగుతున్నాయి. మహాప్రభో.. మోసం పోయాం న్యాయం చేయండని పదుల సంఖ్యలో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ సోషల్ మీడియా, పోస్టర్ల రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ‘మీకు అపరిచిత వ్యక్తులు కాల్ చేసి, మీరు నైకా షాపింగ్ (NYKAA Shopping) చేసినందుకు గానీ, మీకు గిఫ్ట్ కూపన్స్ లేదా రివార్డు పాయింట్స్ వచ్చాయి అని చెబితే నమ్మకండి. ఫోన్‌లో మాట్లాడినప్పుడు మీ బ్యాంకు వివరాలు తెలియజేసి మోసపోకండి. పోలీసుల సహాయం కోసం 1930 నంబర్‌కు డయల్ చేయండి’ అని పోలీసులు సోషల్ మీడియాలో అలర్ట్ చేస్తున్నారు.
సో.. చూశారుగా ఇలాంటి ఫోన్ కాల్స్‌తో జాగ్రత్తగా వ్యవహరించండి. వీలైతే మీకు తెలియని, స్పామ్ నంబర్లతో ఫోన్ వస్తే ఫోన్ ఎత్తకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు, బ్యాంకు అకౌంట్స్ వివరాలు ఇతరులతో పంచుకోకుండా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ ఫోన్‌లో మాట్లాడే వ్యక్తులు వివరాల కోసం ఇబ్బంది పెడుతుంటే వెంటనే కాల్ కట్ చేసి ఆ నంబర్‌ను బ్లాక్‌లో పెట్టేస్తే మంచిది.. తస్మాత్ జాగ్రత్త.
Updated Date - 2023-02-02T22:37:52+05:30 IST