Share News

జానపద గేయాల్లో సంతానేచ్ఛ

ABN , First Publish Date - 2023-11-20T00:37:00+05:30 IST

స్త్రీ హృదయ సముద్రంలో ఉప్పతిల్లే ఘర్షణలు- సంఘర్షణలు, ఆవేదనలు-ఆక్రందనలు, ఆరాటాలు- పోరాటాలు తెలుగు జానపద గేయ సాహిత్యంలో వెలువడినంత తీవ్రంగా, శక్తిమంతంగా తెలుగు...

జానపద గేయాల్లో సంతానేచ్ఛ

స్త్రీ హృదయ సముద్రంలో ఉప్పతిల్లే ఘర్షణలు- సంఘర్షణలు, ఆవేదనలు-ఆక్రందనలు, ఆరాటాలు- పోరాటాలు తెలుగు జానపద గేయ సాహిత్యంలో వెలువడినంత తీవ్రంగా, శక్తిమంతంగా తెలుగు శిష్ట కావ్య సాహిత్యంలో ప్రతిఫలించలేదంటే పండిత ప్రపంచం తల వూపవలసిందే. అట్లే శృంగార, వీర, కరుణ, హాస్య రసాలు నానా ముఖాలుగా తెలుగు జానపద గేయాల్లో, కథా గేయాల్లో ప్రతిబింబించాయి. మన ప్రాచీన తెలుగు కావ్యాల్లో సామాన్య స్త్రీలు, పల్లె పడుచుల రూపురేఖలు కాని, హావ భావాలు కాని ప్రజా జీవితం కాని అల్పంగానే చిత్రిత మయ్యాయి. కళాపూర్ణోదయం, హంసవింశతి, సింహాసన ద్వాత్రింశిక మొదలైన కావ్యాల్లో సకృత్తుగా చిత్రింప బడటమే మన మహాభాగ్యం. కాని తెలుగు జానపద గేయాల్లోనూ, కథాగేయాల్లోనూ మహిళ మనస్సు ఉల్లిగడ్డ పొరలుపొరలుగా ఆవిష్కరణ కావింపబడటం చూడగలం.

ఏండ్లు పూండ్లు గడిచినా పిల్లలు లేని స్త్రీ తన జీవితంలో ఎన్ని ఆరళ్లు పడిందో, ఎన్ని అవహేళనలకు, అవమానాలకు గురయిందో, ఎన్నెన్ని చిత్రహింసల పాలయిందో జానపద గేయాలు ఘోషించినట్లుగా శిష్ట కావ్యాలు పెదవి విప్పిన పాపాన పోలేదు.

అత్తా, ఆడబిడ్డల ఆరళ్లు పడలేక, ఓ ఇల్లాలు పుట్టింటికి బయలు దేరింది. దారిలో ఓ స్త్రీ ఆమెనిలా అడిగింది- ‘‘పాడిపంటా ఉంద గుమ్మేడా. సంతానము ఉంద గుమ్మేడా?’’ అందుకా స్త్రీ తలొంచుకుని బదులు ఇలా ఇచ్చింది- ‘‘పాడిపంటా ఉంది తుమ్మేదా, సంతానమూ లేదు తుమ్మేదా.’’ ఈ మాటలు విన్న ఆ మహాతల్లి నవ్విన నవ్వుకు పిల్లాపాపా లేని ఆ స్త్రీ పాతాళానికి కుంగిపోయింది. సంతానం లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ల ఎకసెక్కాలూ, విసుర్లూ సామాన్య స్త్రీల్నే కాదు, రాణి మహారాణుల్ని కూడా బాధిస్తాయి. ‘బాలనాగమ్మకథ’ లోని భూచక్ర పట్నం రాజైన నవభోజరాజు భార్య లక్ష్మీదేవమ్మ పిల్లాజెల్లా లేకపోవడంతో ఎంత విలపించిందో, వలవలా ఏడ్చిందో, తపించిందో ఆ తల్లి!

‘‘గొడ్డు బోతనే బ్రతుకూ బ్రతకలేను

కని పెంచని జన్మమెందుకేమి?

బాలలు లేని బ్రతుకు లెందుకేమి?

సంతు లేని వారిండ్లు భోజరాజా

కందులు కొట్టిన కళ్ల మందురేమి?

కాయలు కొట్టిన మాను లందురేమి?’’

పిల్లలు లేని స్త్రీల గోడు చెప్పనలవి కాదు. కోసిన కందిపంటను కళ్లంలో ఎండపెట్టి, ఎండిన కందికాయల్ని విడిపించి, మూటలు కట్టి, బళ్లల్లో ఇళ్లకు చేరుస్తారు రైతులు. తర్వాత ఆ కళ్ళాన్ని వూడ్చి, అయిన కాడికి శుభ్రపరుస్తారు. అప్పుడా కళ్ళం బోసిపోయి వుంటుంది. అలా వుంటుందట నిస్సంతురాలైన స్త్రీ జీవితం.

ఈ జానపద గేయంలో జగన్మాత పార్వతీదేవి కూడా తన శోకాన్ని పరమేశ్వరునికి ఇలా వెళ్ళబోసుకుంది:

‘‘అందరికి సంతుల్లు ఉయ్యాలో

విస్తవున్నావయ్య ఉయ్యాలో

నాకూనూ సంతుల్లు ఉయ్యాలో

ఎందుకూ లేదయ్య ఉయ్యాలో

లోకమ్ము మీదను ఉయ్యాలో

గొడ్డు పేరూ నాది ఉయ్యాలో

వద్దూను దేవుడ ఉయ్యాలో

నాకూనూ సంతుల్లు ఉయ్యాలో

కావాలె దేవుడు ఉయ్యాలో’’

గొడ్రాలుగా పిలవబడటం సంఘంలో ఎంత అప్రతిష్ఠో, పిల్లలు గల పదిమంది ముతైదువుల మధ్య మసలడం ఎంత బాధాకరమో పార్వతీదేవి ఈ వేదనాస్వరం ఘోషిస్తుంది.

జానపదకవి చూపు గుండె లోతుల్ని తరచి చూస్తుంది. వివిధ కోణాల్ని పరిశీలించి, ఆర్ద్రతతో అనుశీలిస్తుంది. సంతానం లేని దంపతుల బతుకు బరువును రకరకాలుగా సానుభూతితో చూస్తుంది. వరంగల్లు జిల్లాలోని ఓ జానపద గేయంలో హృదయవేదనల్ని కవి ఎంత సహజంగా చిత్రించాడో చూడండి:

‘‘సంతు లేనటివారు ఉయ్యాలో

సక్కాదన మేమి ఉయ్యాలో

పిల్లలు లేనిల్లు ఉయ్యాలో

పీరీల కొట్టము ఉయ్యాలో

సిరిబాల లేనిల్లు ఉయ్యాలో

సీకటి కోనమ్ము ఉయ్యాలో’’

పల్లెల్లోనూ, బస్తీల్లోనూ, నగర మహానగరాల్లోనూ ఏడాది కోసారి మాత్రమే పీర్లచావిడి తలుపులు తెరుస్తారు. అప్పటిదాకా అవి చీకటి గుయ్యారాలే. పీర్ల పండగప్పుడు మాత్రం ఆ పీర్ల చావిడి కళకళలాడుతుంది. చుట్టు పక్కలంతా సందడో సందడి! కాని పిల్లలు లేని వాళ్ల ఇళ్ళల్లో జీవితమంతా చీకటే, నిరాశే అంటున్నదీ గేయం.

ఓ కన్నడ జానపద గేయంలో పిల్లలు లేని దౌర్భాగ్యాన్ని తలుచుకుని ఓ స్త్రీ తన్ను తానే శపించుకుంటుంది; బతుకే చాలించాలనుకుంటుంది: ‘‘కడగ రిద్దరేన సంపత్తిద్దరేన/ తొడెయ మేలాడో మగనిల్ల బళిక/ సుడబేకు ఒయ్దు హెణ్ణ బాళ.’’ (సొమ్ములు లేకపోతే పాయ. సిరి సంపదలు లేకున్నా ఫరవాలేదు. ఒళ్లో ఆడుకునే మగబిడ్డ లేకుంటే ఎందుకీ బతుకు? కాల్చనా?)

మహిళ ఎన్నో కష్టనష్టాలు భరిస్తుంది. ముళ్లబాటపై నడిచి జీవితయాత్ర కొనసాగిస్తుంది. కాని వంధ్యత్వాన్ని పిసరంత కూడా భరించలేకపోతుంది. నీళ్లు తేవడానికి బావిగట్టున్నో, బట్టలు ఉతకడానికి చెరువు గట్టున్నో ఓ మూల కూర్చొని ఏడుస్తున్న ఓ యువతిని స్నేహితురాళ్లు ఎందుకు ఏడుస్తున్నావని అడిగితే ఆమె ఏమంటుందో వినండి, హిందీ మాండలికమైన ఈ భోజపురి గేయంలో: ‘‘నా మొర్‌ సాసు, ససుర్‌ దుఃఖ్‌ దేలే,/ నఇహర్‌ దూర్‌ బాడేహో/ నాహి మొర్‌ కంత్‌ బిదేసే/ కోఖీ కె దుఃఖ్‌ రోఇలే హో.’’ (అత్తమామల ఆరళ్లు లేవు. పుట్టిల్లూ దగ్గరే. మొగుడూ ఎక్కడికీ వలస పోలేదు. నా కడుపే పండలేదు.)

పిల్లలు పుట్టలేదే, ఇల్లు వెలవెలా పోతుందే అని తల్లడిల్లే ఇంటిల్లపాదీ కొడుకే పుట్టాలని కోరుకుంటారు కాని కూతుర్ని కనాలని ఎవరూ ఆశించరు. కోస్తా ప్రాంతంలోని ఓ జానపదగేయం మగబిడ్డ ప్రాధాన్యాన్ని ఎలా వొత్తొత్తి చెప్తున్నదో చూడండి-

‘‘కొడుకుల కననాళ్ల కడుపేమి కడుపు

కులముద్ధరించన్ని కొడుకేమి కొడుకు

పిడికెడు విత్తనాలు మడికెల్ల జాలు

ఒక్కడే కొడుకైన వంశాన జాలు

లాభమ్ము లాభమ్ము ఏమి లాభమ్ము

కొడుకుల గంటేను కోటి లాభమ్ము’’

జానపద గేయ సాహిత్యంలో ఆడపిల్లకన్న మగపిల్లవాడికే అగ్రస్థానం లభించింది. జానపద కవి ఆడామగా వ్యత్యాసాన్ని ఇలా పోల్చి చెపాడు-

‘‘ఆముదాలు పండిన చేను చూడండి

ఆడవార్ని గన్న తల్లి నరసి చూడండి

మోదుగు పూసిన బీడు చూడండి’’


ఆడపిల్లను కన్న తల్లి మొగం వాడిపోయి వుంటే, మగ పిల్లవాణ్ణి కన్న తల్లిముఖం కళకళలాడుతూ వుంటుందని ఇందులోని భావం. మగపిల్ల వాడంటే అందరి తల్లులకూ పట్టరానంత ఆనందం. కాని ఆడపిల్లలంటే చాలామంది తల్లులకు అంతంత మాత్రమే సంతోషం. జానపద గేయాల్లో ఇది మామూలే.

కూతుర్ని అత్త వారింటికి సాగనంపుతూ ఓ తల్లి ఇలా ఆశీర్వదించింది:

‘‘పోయిరా శాంతమ్మ - బుద్ధి గలిగుండమ్మ

కొడుకులూ బిడ్డలు-కొమరొప్ప గలిగి’’ వర్ధిల్లమంది ఆ తల్లి.

అప్పగింతలప్పుడు ఓ తల్లి తన కూతురిని అత్తమామల చేతుల్లో పెట్టి ఇలా మనసులోని మాట వెల్లడించింది.

‘‘అన్ని దేవుల పూజ అతి భక్తితో చేసి-

పతి కరుణచే నేను పడతిని గంటి

సుకుమారమైనట్టి కురులు నున్నగ దువ్వి

కోరుజడ బంగారు కరుణతో బెట్టి’’

అల్లారు ముద్దుగా సాకానని కళ్ల నీరు పెట్టుకొంటుంది ఆ మాతృదేవత.

తెలుగు జానపద గేయాల్లో ఆడపిల్ల పుట్టినప్పుడు ఇంట్లో సంబరాలు జరగలేదన్న సంగతి ప్రస్తావించబడిందే కాని ఇంటి నిండా విషాదం కమ్ముకొన్నట్లు చిత్రింపబడ లేదు. కాని హిందీ మాండలికమైన భోజపురి గేయంలో ఆడపిల్ల జన్మ అరిష్టాలకు దారితీసినట్లు చెప్పబడింది. ఆడపిల్ల పుట్టినందుకు ఓ తల్లి ఇలా వాపోతూంది:

‘‘జాహిదిన్‌ బేటీ హొ తొహరీ జనమ్‌ భఇలే/ భడలీ భదఉ ఆ కే రాత్‌ మే./ సాస్‌ ననద్‌ ఘరే బిఅరోన బారేలీ;/ నహొ ప్రభు బోలేలే కుబోల్‌. ఏ.’’ (నీవు పుట్టినప్పుడు ఇల్లంతా చీకట్లు కమ్ముకున్నా యన్నట్లు అనిపించింది. అత్త ఆడ పడుచులు కాన్పుగదిలో దీపం వెలిగిస్తే వొట్టు, మీ నాన్న నన్ను అనరాని మాటలన్నాడు.) ఉత్తరాదిలో ఆడపిల్లల పుట్టుక పట్ల వున్నంత వ్యతిరేకత దక్షిణాదిలో లేనట్లు ఈ జానపద గేయాలు తెలియచేస్తున్నాయి.

‘‘ఆరతి కొబ్బ మగళు, కీరితి కొబ్బ మగ’’ - కర్ణాటక ప్రభుత్వం ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణను ప్రచారం చేస్తూ విడుదల చేసిన వాల్‌ పోస్టర్‌ లోని మాటలివి. ‘‘హారతికి ఓ అమ్మాయి. కీర్తి కో అబ్బాయి’’ అన్నది దాని అర్థం. కాని ఈ రోజుల్లో ‘‘మేమిద్దరం మా కొక్కరే- ఆడైనా సరే, మొగైనా సరే’’ అన్న నినాదం ప్రచారంలోకి వచ్చింది. రోజులు గడిచే కొద్దీ ‘‘మేమిద్దరమంటే మేమిద్దరమే’’ గాను, మరిప్పుడేమో ‘‘నేనొక్కణ్ణే నేనొక్కతినే’’ గాను మారాం.

పెద్దల మాటలు సద్దిమూటలనే నానుడికి దాదాపు కాలం చెల్లిపోయింది. ‘వంశాన్ని ఉద్ధరించేవాడు కొడుకు’ అన్న సామెత మాటలకే పరిమితమై పొయ్యింది. కొడుకుల్ని నెత్తికెక్కించుకొనే కాలం పోయి, కూతురినీ కొడుకునీ ‘ఆ చంకనొక బిడ్డ ఈ చంక నొకబిడ్డ’గా భావించి, పెంచి పెద్ద చేసే సమయమొచ్చింది. కర్ణాటక లోని కోలారు జిల్లాలోని ఓ తెలుగు సామెత ‘కొరివి పెట్టేవాడు కొడుకు, కూడు పెట్టేది బిడ్డ’ అని చెప్తుంది. బతికినప్పుడు కూడు పెట్టకుండా కడుపు మాడ్చి, చచ్చిన తర్వాత తలకొరివి పెట్టే కుపుత్రుడి కంటే, బతికిన రోజుల్లో పిడికెడన్నంపెట్టి తల్లిదండ్రుల్ని కాపాడుకున్న కుమార్తె సుపుత్రి కదా! కర్ణాటకలోని ఈ ప్రాంతంలోనే ఇంకో సామెత ఏమంటుందంటే- ‘పేదోల్లింట ఆడబిడ్డ పుట్నా, మగబిడ్డ పుట్నా పండగే నంట.’

‘‘అయ్యో! ఆడపిల్ల పుట్టిందే’’ అని వాపోయే చదువుకున్న దంపతుల కంటే ఈ చదువురాని పల్లె ప్రజల హృదయాలు నిర్మలమైనవి కదా! పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తమ సుఖసంతోషాల్ని బలిపెట్టి, చివరి రోజుల్లో తమని పిసరంత కూడా పట్టించుకోని బిడ్డల్ని ‘కలకాలం చల్లగా బతకండి’ అని దీవించే ఆ ముసలి జీవాల కడుపు తీపిని ఏమనాలి?

ఘట్టమరాజు

99640 82076

Updated Date - 2023-11-20T00:37:03+05:30 IST