పీడిత వర్గాల ఐకాన్ గద్దర్
ABN , First Publish Date - 2023-08-26T03:52:21+05:30 IST
చరిత్ర గతిని మార్చేవి వర్గ సంఘర్షణలేనని మార్క్స్ చెప్పింది నిజమే గానీ, ఆ క్రమంలో వ్యక్తుల ప్రమేయాన్ని నిరాకరించడం సరైనది కాదని రివల్యూషనరీ అంబేడ్కర్ వ్యాఖ్యానించాడు...

చరిత్ర గతిని మార్చేవి వర్గ సంఘర్షణలేనని మార్క్స్ చెప్పింది నిజమే గానీ, ఆ క్రమంలో వ్యక్తుల ప్రమేయాన్ని నిరాకరించడం సరైనది కాదని రివల్యూషనరీ అంబేడ్కర్ వ్యాఖ్యానించాడు. అంతేకాదు మన దేశ చరిత్రను వర్గ దృక్పథం నుంచి మాత్రమే వివేచించి, వ్యాఖ్యానించే పద్ధతి అసమగ్రమని కూడా ఆయన ప్రకటించాడు. ఈ అవగాహనతో గద్దర్ తాత్వికతను, ఆచరణను, ఆయన సుదీర్ఘ ప్రయాణాన్ని ఆలోకన చేయాల్సి వుంటుంది.
ఫ్యూడలిజంతో జరిగే పోరాటం విజయవంతంగా ముగియకముందే ఒక రాజీకి కమ్యూనిస్టులు, రాజ్యం సిద్ధపడ్డాయి. ఆధునిక విలువలను ఒక జీవన విధానంగా రాజ్యాంగం ప్రజలకు హామీ ఇచ్చింది. కానీ ఆ హామీలు వాస్తవరూపం దాల్చలేదు. ఫ్యూడలిస్టులకు రాజ్యం మద్దతు ఉంది. పేద, మధ్యతరగతి వర్గాల మీద ఫ్యూడల్ అనుకూల పాలన విధానాలు హింసాత్మకంగా అమలవుతున్న సందర్భంలో ప్రజల సాయుధ తిరుగుబాటు మరోసారి మొదలైంది. ఫ్యూడలిజాన్ని బలహీనపర్చే వర్గ కుల పోరాటం అనివార్యమైనది. ఆ ఫ్యూడల్ వ్యతిరేక పోరాటంలో ప్రజలను భాగస్వాములను చేసే ఒక క్రియాశీల ఆచరణ అవసరమైనది. అదిగో అలాంటి ఒక చారిత్రక కర్తవ్యాన్ని నెరవేర్చినవాడే గద్దర్. ఫ్యూడలిజం నుంచి క్యాపిటలిజం దిశగా జరిగే పరివర్తన ఎప్పుడూ హింసాత్మకంగానే ఉంటుంది. ఫ్యూడలిజంతో ప్రజాస్వామిక సంప్రదింపులు గానీ, సంభాషణ గానీ వీలుకాదు. అహంకారం, ఆధిపత్యం, హింస మూడు ఫ్యూడలిజం వ్యక్తీకరణ రూపాలు. వాటిని సహనం, సామరస్యం, శాంతిచర్చల ద్వారా సంస్కరించలేం. అనివార్యంగా ప్రజలు హింసాత్మక ప్రతిఘటనను ఆశ్రయిస్తారు. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ చాలా ఉద్విగ్నభరితంగా వుంటుంది. ఈ పీరియడ్‌లోనే ప్రజలకు బలమైన శక్తిమంతమైన ప్రేరణనిచ్చే సాంస్కృతిక కళారూపాలు కావాలి. ప్రజలను ఉద్యమంతో మమేకంచేసే మహాశక్తిమంతమైన కళాకారుడు కావాలి. గద్దరు అలా మహావాగ్గేయకారుడిగా అవతరించాడు. అయితే గద్దర్ సాదాసీదా కళాకారుడు కాదు. అతడొక తాత్వికుడు. అతడు వొట్టి భౌతికవాది కాదు. పదార్థం చుట్టూతా వుండే అనేకానేక అంశాలను నిర్దిష్టంగా అర్థం చేసుకొని, దాన్ని వాస్తవీకరించే క్రమంలో ఒక తాత్వికస్థాయికి వెళ్లిపోతాడు. ప్రకృతి, సంఘం, వ్యక్తుల మధ్యగల అధికార సంబంధాలను నిరసించి, వాటికి ప్రజాస్వామిక పంథాను చూపించిన తాత్వికుడు గద్దర్.
గద్దర్ సృష్టించిన వాగ్గేయ సాహిత్యాన్ని పరికించినప్పుడు అతడి భావజాల గాఢత, తాత్విక దృక్పథం స్పష్టమవుతాయి. దృగ్గోచర ప్రపంచాన్నీ దృగ్గోచర మానవ పర్యావరణాన్ని ఆయన వీక్షించే తీరు అనూహ్యంగా వుంటుంది. అది తన పాటల్లో ఒక మెరుపులాగా వ్యక్తమవుతూ వుంటుంది. వర్గకేంద్ర దృక్పథం నుంచి ప్రపంచాన్ని అర్థం చేసుకొని వ్యాఖ్యానించే మార్క్సియన్ పంథాతోపాటు, వర్ణజాతి వ్యవస్థలను విశ్లేషించే సమయంలో నిర్దిష్టతలను ఆయన స్పష్టంగానే అర్థం చేసుకున్నాడు. అమెరికన్ సమాజంలోని శ్వేతజాతి అహంకారాన్ని, భారత సమాజంలోని కుల అమానుషత్వాన్ని ఆయన అంబేడ్కరీయ దృక్పథం నుంచే అర్థం చేసుకొనే ప్రయత్నం చేశాడు. కులం, వర్గం రెండూ భారత ప్రజల ప్రగతికి అడ్డంకులని గద్దర్ అవగాహన. ఈ రెండిటికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక పోరాటం జరగాలని ఆయన ప్రతిపాదించాడు. సాయుధ పోరాటాలు ఆధునిక సమాజానికి సరిపోవు. రాజ్యం బలమైనది కావడం వల్లనే కాదు, ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థతో డీల్ చేసేందుకు సాయుధ మార్గం అనువైనది కాదు. అందుకే పార్లమెంటరీ రాజకీయాల ఆవశ్యకతను ఆయన గుర్తెరిగాడు. భారత రాజ్యాంగంలోని ఆశయాలను (ప్రియాంబుల్) సాధించడానికి పార్లమెంటరీ పంథా తోడ్పడుతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతికి ఎన్ని పరిమితులున్నప్పటికీ, అది మాత్రమే పెట్టుబడిదారీ వ్యవస్థ దిశగా పయనిస్తున్న సమాజానికి ఏదో ఒక మేరకు తోడ్పడుతుంది. ఈ అవగాన గద్దర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుకైన పాత్ర పోషించాడు. పాటను విప్లవీకరించిన గద్దర్ తెలంగాణీకరించింది కూడా నిజం. పోస్ట్ తెలంగాణ పీరియడ్‌లో పాటను అంబేడ్కరీకరించిన తీరును గమనించొచ్చు. అలాగే సనాతన ఫాసిజాన్ని ఎదుర్కోవడానికి రాజ్యాంగ మార్గమే సరైనదని భావించాడు. రాజ్యాంగాన్ని ఆయన అంగీకరించాడు అంటే రాజ్యాంగ నిర్మాణ కాలం నాటి ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చే కర్తవ్యాన్ని స్వీకరించాడని అర్థం.
గద్దర్‌లో విస్మరించాల్సిన చేష్టలు కొన్ని వున్నాయి. అవి చేష్టలు మాత్రమే. వాటిని ముందుపెట్టి ఆయన ఈ సమాజానికి చేసిన సేవను, సంఘ పరివర్తనను వేగవంతం చేసే క్రమంలో ఆయన జోక్యాన్నీ, భాగస్వామ్యాన్నీ నిమ్నీకరించడం కురచవాదం అవుతుంది. అలాంటి తీర్పరులను విముక్తి కోరే సమూహాలు ఆమోదించలేరు. అయితే గద్దర్‌ను కేవలం ఒక సాంస్కృతిక ప్రతీకగానో, విప్లవ చిహ్నంగానో చూడకూడదు. గద్దరు పీడిత వర్గాల విముక్తి పోరాటాలకు ఒక ఐకాన్. అంబేడ్కర్ తర్వాత పీడిత ప్రజలకు దొరికిన ఒక పాన్ ఇండియా ఐకాన్ గద్దర్. స్థూలంగా ఆయన అవగాహనను సూత్రీకరిస్తే కుల నిర్మూలన, వర్గ నిర్మూలన, సామ్రాజ్య వ్యతిరేక పోరాటం, ఫాసిస్టు వ్యతిరేక పోరాటం, లింగ సమానత్వం. గద్దర్ సృష్టించి ప్రదర్శించిన సాహిత్యమంతా ఇవే విలువలు పరివ్యాప్తమై వున్నాయి.
శ్రీనివాస్ దక్షిణ్
(రేపు సాయంత్రం 6 గంటలకు
హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గద్దర్ సంస్మరణ సభ)