సైద్ధాంతిక స్పష్టతే బీజేపీ బలం
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:33 AM
‘ఏమండీ, మనం కూడా కుంభమేళాకు ఎందుకు పోకూడదు...’ అని ఇటీవల ఒక ప్రముఖ ప్రగతిశీలవాదిగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్‌ను ఉదయాన్నే...

‘ఏమండీ, మనం కూడా కుంభమేళాకు ఎందుకు పోకూడదు...’ అని ఇటీవల ఒక ప్రముఖ ప్రగతిశీలవాదిగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్‌ను ఉదయాన్నే డైనింగ్ టేబుల్ వద్ద ఆయన సతీమణి అడిగారట. ‘ఏముంది అక్కడ, మురికి నీళ్లు, జనం చచ్చిపోతున్నారు..’ అని ఆయన జవాబిచ్చారు. ‘మీకేం తెలుసండీ.. అన్ని కోట్ల మంది ప్రజలు అక్కడకు వెళుతున్నారంటే వారు పిచ్చివాళ్లనా మీ అభిప్రాయం? దేశ సంప్రదాయాలను వ్యతిరేకించే వారి దుష్ప్రచారానికి మీరు లోనవుతున్నారు..’ అని భార్య విసురుగా వంటింట్లోకి వెళ్లిపోయిందట. ఈ విషయం ఆయనే చెప్పారు. ‘మా ఇంట్లో కూడా హిందూత్వవాదులు ప్రవేశించారు. నేనేమి చేయను?’ అని ఆ ఆచార్యులవారు వాపోయారు. కుంభమేళాకు వచ్చిన అనేకమంది ప్రముఖులు అక్కడ చేరిన కోట్లాది ప్రజల మధ్య తాము పొందిన అవస్థల గురించి చెప్పారు. ఘాట్ 14 కిమీ దూరంలో ఉన్నప్పటికీ కేంద్ర సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షురాలు దాదాపు 14 గంటలు కారులోనే గడపాల్సి వచ్చిందట. ఆఖరుకు అల్పాహారం చేసేందుకు కూడా గంటసేపు లైనులో నిలుచోవాల్సి వచ్చింది. ఢిల్లీలో తొక్కిసలాట జరిగిన తర్వాత ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌ను కొద్ది రోజుల పాటు మూసివేయాల్సి వచ్చింది.
భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఇది. కుంభమేళాపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినవారు హిందూ మతాన్ని ద్వేషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా విమర్శించారు. భారతదేశ మత వారసత్వ సంపదను తక్కువ అంచనా వేసేవారు బానిసమనస్తత్వంతో ఉన్నారని ఆయన అన్నారు. ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసిన క్షణాల్లోనే దేశంలో కోట్లాది వాట్సాప్ గ్రూపుల్లో ఆయన వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. కొన్ని లెఫ్టిస్టు గ్రూపులను మినహాయిస్తే ఇవాళ ఏ వాట్సాప్ గ్రూప్ చూసినా సగానికిపైగా భారతదేశంలో హిందూమత గొప్పతనాన్ని వివరించే సందేశాలు కనపడుతున్నాయి. ప్రజల సామూహిక చేతనలో మతం ఇంత గణనీయమైన పాత్ర వహించడం గతంలో ఎప్పుడూ లేదు.
ఈ పరిణామాల్ని విస్మరించగలమా? అసలు ఎందుకు విస్మరించాలి? పోనీ ఈ పరిణామాల్ని ఏ రకంగా విశ్లేషించాలి? భారతీయ జనతా పార్టీ రాజకీయంగా విస్తరించే ముందు సామాజికంగా విస్తరిస్తోందన్న విషయంలో సందేహం లేదు. సమాజంలో ఉవ్వెత్తున ఒక ఊపును నిర్మించిన తర్వాత దాన్ని రాజకీయంగా సంఘటితం చేసుకునేందుకు బీజేపీకి అవకాశాలు లభిస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత ఇక ‘బెంగాల్ కీ బారీ..’ అని ఆ పార్టీ నేతలు వెంటనే ప్రకటించారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరిగే బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, కేరళ, తమిళనాడులలో తమ పార్టీని విస్తరించేందుకు బీజేపీ ఎప్పుడో సన్నాహాలు ప్రారంభించింది. అస్సాంలో బీజేపీకి ఇప్పటికే ప్రభుత్వం ఉన్నది. బెంగాల్‌లో 2021 ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. బీజేపీకి, తృణమూల్‌కు కేవలం 3 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఫలితాలు బెంగాల్‌లో పునరావృతం అయినా ఆశ్చర్యం లేదు. బిహార్‌లో ఈ ఏడాది ఆఖరులో తనంతట తాను మెజారిటీ సీట్లు సాధించేందుకు బీజేపీ తప్పనిసరిగా ప్రయత్నిస్తుంది. హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాల ఊపు రాబోయే ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ కొనసాగించేందుకు శాయశక్తులా కృషి చేస్తుందనడంలో సందేహం లేదు.
రాజకీయంగా బీజేపీని ఎదుర్కోవడమే వివిధ రాజకీయ పక్షాల లక్ష్యం. అందుకు అనేక రాజకీయ వ్యూహాలు పన్నేందుకు అవి సిద్ధంగానే ఉన్నాయి. కాని బీజేపీ, దానికి మద్దతు నిచ్చే వందలాది సంస్థలు సమాజంలో నిర్మిస్తున్న మతపరమైన భావోద్వేగాలను ఎదుర్కోవడం అంత సులభం కాదు. బీజేపీని సకల విపక్షాల నేతలతో పాటు వామపక్ష మేధావులూ రకరకాలుగా విమర్శిస్తూనే ఉన్నారు. కార్పొరేట్ల అనుకూల పార్టీ అని, రాజ్యాంగ సంస్థల్ని ధ్వంసం చేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని, నిరుద్యోగాన్ని, పెరుగుతున్న ధరలను అరికట్టలేకపోతోందని ఎన్నో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. రోజుకు వందలాది సెమినార్లు, సభలు జరుగుతూనే ఉన్నాయి. కాని ఈ సభల్లో పాల్గొనే వారెవరూ విస్తరిస్తోన్న బీజేపీ ప్రభావాన్ని అరికట్టలేకపోతున్నారు. బీజేపీని అత్యధికంగా విమర్శించిన రాష్ట్రాల్లోనే ఆ పార్టీ ఓట్ల శాతాన్ని పెంచుకుంటోంది. అందుకు కారణం బీజేపీ, దాని అనుబంధ సంస్థలు, అభిమాన సంస్థల ప్రచారం ముందు బీజేపీ వ్యతిరేకులు చేస్తున్న ప్రచారం వెలవెలబోవడమే.
సీపీఐ(ఎం) పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో ఓడిపోయిన తర్వాత భారతదేశంలో ఆ పార్టీ భవిష్యత్ అగమ్యగోచర పరిస్థితిలో పడిందని అనేకమంది మేధావులు అంచనా వేశారు. ప్రజల నుంచి ఆ పార్టీ దూరమైందని, తన రాజకీయ అజెండాపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆ పార్టీ సానుభూతిపరులైనవారే విశ్లేషించారు. విచిత్రమేమంటే బెంగాల్‌లో గత 14 ఏళ్లలో సీపీఎం తన పునాదిని రోజురోజుకూ కోల్పోవడమే కాక బీజేపీ విస్తరణను అడ్డుకోలేకపోయింది. ఇప్పుడు వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికలలో మూడోసారి ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోతే దేశవ్యాప్తంగా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అస్తిత్వ సంక్షోభం అనేది సీపీఎంకే కాదు, రకరకాల రూపాల్లో ఉన్న వామపక్ష శక్తులన్నిటికీ ఇప్పుడు ఏర్పడుతున్న సవాలు. తాము ఎంత ప్రచారం చేసినా, ఎన్ని సభలు నిర్వహించినా, ఎన్ని పుస్తకాలు రాసినా ప్రజలు తమకు అనుకూలంగా ఎందుకు స్పందించడం లేదు అని ఈ శక్తులు ఒక్కసారి స్వేచ్ఛగా చర్చించుకున్నా వారికి జవాబు వచ్చేదేమో. కాని వీరెవరూ తమది తప్పుడు పంథా అని, తాము క్షీణిస్తున్నామని, తమ మూలంగా యువత త్యాగాలు వృధా అవుతున్నాయని ఆత్మవిమర్శ చేసుకునేందుకు బహిరంగంగా సిద్ధం కావడం లేదు. పైగా బీజేపీ, మోదీపై కురిపిస్తున్న తిట్ల వర్షం వారికే నష్టం చేకూరుస్తోంది.
తమ అస్తిత్వ సంక్షోభం వల్ల ఏర్పడిన అయోమయం వారి సిద్ధాంతీకరణల్లో కూడా కనిపిస్తోంది. బీజేపీని, మోదీని ఇంతకాలం వామపక్షాలు ఫాసిస్టు శక్తులుగా అభివర్ణించాయి. తాజాగా సీపీఎం పోలిట్ బ్యూరో సమన్వయకర్త, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ బీజేపీని తాను ఫాసిస్టు అని కానీ, నయా ఫాసిస్టు అని కానీ అనడం లేదని, అయితే నయా ఫాసిస్టు మార్గంలో బీజేపీ పయనిస్తోందని విశ్లేషించారు. అదే పార్టీ ముసాయిదా తీర్మానంలో ప్రతిఫలించింది. విచిత్రమేమంటే మూడేళ్ల క్రితం 2022లో ఆమోదించిన రాజకీయ తీర్మానంలో కూడా బీజేపీ స్పష్టంగా ఫాసిస్టు సంస్థ అని సీపీఎం విమర్శించింది. ఇటీవల మరణించిన పార్టీ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి కూడా తన ‘ఐడియా ఆఫ్ ఇండియా’ అన్న వ్యాసంలో భారతదేశంలో ఫాసిస్టు శక్తుల మతతత్వ అజెండా గురించి విశ్లేషించారు. సీపీఐ, సీపీఐ(ఎంఎల్ ) ఇప్పటికే బీజేపీని ఫాసిస్టు శక్తిగా అభివర్ణించాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ మోదీని ఫాసిస్టు అని అనేకసార్లు ప్రకటించారు.
మోదీ ఫాసిస్టా, నయా ఫాసిస్టా లేక ఫాసిస్టు అయ్యే క్రమంలో ఉన్నారా, హిట్లర్, ముస్సోలినీ కంటే మోదీ భిన్నమైన వ్యక్తా అన్న చర్చ జరగడమే ఒక అసంబద్ధంగా అనిపిస్తోంది. మోదీని, బీజేపీని ఎదుర్కొనే ప్రత్యామ్నాయ సామాజిక సిద్ధాంతాలు లేనప్పుడు అవతలి సంస్థలను, వ్యక్తులను ఏదో ఒక పేరుతో విమర్శించడం, లేదా సిద్ధాంతీకరణ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? సీతారాం ఏచూరి దేశంలో దేశభక్తి గల అన్ని ప్రజాస్వామిక శక్తులు ఐక్యమయి బీజేపీని అధికారం నుంచి తొలగించడం గురించి రాశారు. కాని కనీసం వామపక్ష శక్తులైనా సిద్ధాంతాల అయోమయం లేకుండా కలిసి పనిచేసే అవకాశాలున్నాయా? ఇక మిగతా శక్తులు కలిసి పనిచేసేందుకు మోదీ వ్యతిరేక ఎజెండా తప్ప వాటిని ఐక్యంగా బంధించే సామాజిక సిద్ధాంతం అంటూ ఏమైనా ఉన్నదా?
ఇవాళ దేశంలో బీజేపీ ఒక్కటే స్పష్టమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ సైద్ధాంతిక లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షాలను హిందూమత విద్వేషకులన్నా, అర్బన్ నక్సల్స్ అన్నా మోదీకి ఒక సైద్ధాంతిక స్పష్టత ఉన్నది. అదే సమయంలో సంఘ్ పరివార్ శక్తులు ఒక స్పష్టమైన అవగాహనతో పనిచేస్తున్నాయి. ప్రజల్లోకి భావోద్వేగాలు చొచ్చుకుపోతున్నాయి. కుంభమేళా వంటి కార్యక్రమాలు ప్రజలను స్వచ్ఛందంగా హిందూత్వ భావజాలం దిశగా ఆకర్షితులను చేస్తున్నాయి. దేశ భక్తినీ, భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక చరిత్ర పట్ల గౌరవాన్ని పెంపొందించే దిశగా కళారూపాలు తయారవుతున్నాయి. ఆ రకమైన సినిమాలు హిట్ అవుతున్నాయి. వాటిలో సహేతుకతను ప్రశ్నించినవారే ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. రాజకీయ ప్రయోజనాలకోసమైనా హిందూత్వను ఆమోదించినట్లు ప్రదర్శించేవారు అంతటా కనపడుతున్నారు. ఇది గత పదేళ్ల పై నుంచి మోదీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందువల్ల సాధించిన విజయం అని చెప్పక తప్పదు.
స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న చరిత్ర గల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్నేళ్ల వరకూ ఆ స్ఫూర్తిని కొనసాగించింది. కాని ఆ ప్రభావాన్ని ఎక్కువ కాలం కొనసాగించడంలో విఫలమైంది. వెనుకబడిన వర్గాలకోసం, దళితులకోసం ఏర్పడ్డాయనుకున్న సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు తమ లక్ష్యాలకు దూరమయ్యాయి. ఒక సైద్ధాంతిక పార్టీగా అస్తిత్వాన్ని, తన సంప్రదాయ ఓటుబ్యాంక్‌ను కాంగ్రెస్ 1970ల తరువాత కోల్పోవడం ప్రారంభమయింది. ఇవాళ ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ కులగణన, రాజ్యాంగం, బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడుతున్నారు. ఒక సైద్ధాంతిక పార్టీగా కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని కల్పించే కృషి ఉధృతంగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తాము బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎందుకు మారాలో కాంగ్రెస్ స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోనంత వరకూ ఆ పార్టీ తడబడుతూ అడుగులు వేస్తూనే ఉంటుంది. సిద్ధాంతం ప్రజలలో పట్టు బిగించనంతవరకూ అది భౌతిక శక్తిగా మారదని, భౌతికశక్తిని భౌతికశక్తే తొలగించగలదని కారల్ మార్క్స్ ‘క్రిటిక్ అఫ్ హెగెల్ ఫిలాసఫీ’లో చెప్పిన విషయం బీజేపీకి అర్థం అయినంత బాగా ఈ దేశంలో మరే పార్టీకి అర్థం కావడం లేదు.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Also Read:
లాలూ నావల్లే ఎదిగారు.. తేజస్విపై విరుచుకుపడిన నితీష్
For More Andhra Pradesh News and Telugu News..