ఈ ట్రంప్‌నే కదా, మన మోదీ మళ్లీ గెలిపించమన్నది!
ABN , First Publish Date - 2023-04-06T01:44:46+05:30 IST
చాలావ్యాపారాలు, చాలా సరదాలు ఉన్న ఒక సంపన్నుడు గోల్ఫ్ టోర్నమెంటు చూడడానికి వెళ్లాడు. అతి శృంగార చిత్రాలతో పేరుపొందిన తార ఒకరు అక్కడ కనిపించింది...
చాలావ్యాపారాలు, చాలా సరదాలు ఉన్న ఒక సంపన్నుడు గోల్ఫ్ టోర్నమెంటు చూడడానికి వెళ్లాడు. అతి శృంగార చిత్రాలతో పేరుపొందిన తార ఒకరు అక్కడ కనిపించింది. సంపన్నుడు తన సహాయకుడితో రాయబారం పంపాడు. తరువాత ఆ సెలబ్రిటీలు ఇద్దరూ డిన్నర్ చేశారు. ఏకాంతంగా గడిపారు. కొంతకాలం పాటు ఆ స్నేహం అట్లా కొనసాగింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారం, జూదగృహాలు నడిపే ఆ సంపన్నుడు డోనాల్డ్ ట్రంప్‌కు వెండితెర, టీవీ తెర జీవితం కూడా ఉన్నది. అనేక సినిమాల్లో అట్లా కనిపించి మాయమయ్యే ట్రంప్ సొంతంగా టీవీ షోలు కూడా చేసేవాడు. డిన్నర్ వేళ మచ్చిక మాటల్లో తన షోలో అవకాశమిస్తానని పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు ఆఫర్ చేశాడు కూడా. ట్రంప్‌తో తన సాన్నిహిత్యాన్ని బహిరంగం చేయాలని, అందువల్ల కలిగే ప్రయోజనాలు పొందాలని స్టార్మీ 2011 నుంచే అనుకున్నది.
అప్పటికి ట్రంప్ రాజకీయంగా నిలకడ లేకుండా ఉన్నాడు. 1980లలో రిపబ్లికన్ పార్టీతో ప్రయాణం మొదలుపెట్టిన ట్రంప్ ఆ తరువాత ఐదుసార్లు పార్టీలు మార్చాడు. 2001లో డెమొక్రాటిక్ పార్టీలో చేరాడు. 2009లో తిరిగి రిపబ్లికన్ పార్టీలోకి వచ్చాడు. 2011లో ఇండిపెండెంట్‌గా మారాడు. మరుసటి సంవత్సరం తిరిగి రిపబ్లికన్ పార్టీలో చేరాడు. ఇంత నిలకడ లేని మనిషి, ఆశ్చర్యంగా 2016 నాటికి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి అయ్యాడు. సంపన్నత దేన్ని అయినా సాధిస్తుంది!
రిపబ్లికన్ పార్టీలోకి తిరిగి ప్రవేశించిన సమయంలోనే ట్రంప్ చేస్తున్న ఒక టీవీ షో ‘ది అప్రెంటిస్’ బాగా ప్రాచుర్యం పొందింది. అందులో రాజకీయ వ్యాఖ్యానాలు ఉండేవి. వాచాలత్వం ఎక్కువే అయిన ట్రంప్, అప్పటి అధ్యక్షుడు ఒబామా అసలు అమెరికాలో పుట్టినవాడేనా వంటి చర్చ ఆ షోలో లేవదీశాడు. దానితో ట్రంప్‌కు బాగా చెడ్డపేరు రావడంతో పాటు, షో రేటింగ్ కూడా పడిపోయింది. కానీ రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ఇంతింతై పెరగసాగాడు. సగటు అమెరికన్‌లో ముఖ్యంగా, గ్రామీణ సంప్రదాయ అమెరికన్‌లో, బొటాబొటి ఆదాయం ఉన్న పట్టణ కార్మికుడిలో ఉన్న ఆగ్రహనాడి ఏదో అతనికి దొరికింది. అభ్యర్థిత్వపు అంచెలు దాటి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్షపదవికి నిలబడే సమయానికి, స్టార్మీ తన ప్రయత్నాలను పెంచింది. లక్షా ముప్పైవేల డాలర్లు అందించేట్టు చేసి, ఆమెతో సంబంధం విషయం రట్టు కాకుండా ట్రంప్ జాగ్రత్త పడ్డాడు. అంతే కాదు, ఇంకో స్త్రీతో వివాహేతర సంబంధంలో ఒక బిడ్డకు తండ్రి అయిన విషయం బయటకు చెప్పకుండా ఉండడానికి తన భవనాల్లో పనిచేసే ఒక ఉద్యోగికి 30 వేల డాలర్లు, ప్లేబాయ్ పత్రికతో వార్షిక సుందరిగా ఎన్నికైన మరొక అమ్మాయి తనతో ఉన్న సంబంధాన్ని బహిర్గతపరచకుండా ఉండడానికి లక్షన్నర డాలర్లు చెల్లించుకున్నాడు. పెళ్లికి వెలుపల సంబంధాలు, వయోభేదం ఎక్కువగా ఉన్న సంబంధాలు, డబ్బుతో కొనుగోలు చేసే శృంగారం వంటివి అమెరికన్ అధ్యక్ష అభ్యర్థుల బయోడేటాలో ప్రతికూల అంశాలవుతాయి. ప్రజాజీవితంలో ఉండేవారి నడవడిక గురించి అమెరికన్లకు కొన్ని ప్రమాణాలుంటాయి. అవి విలువల అంశాలు. ఇప్పుడు ట్రంప్ అరెస్టయిన నేరాభియోగాలు ప్రవర్తన, విలువలకు సంబంధించినవి కావు. వ్యక్తిగత ప్రవర్తనతో ముడిపడిన ఆర్థిక నేరం, ప్రజలకు సమాచారం అందకుండా చేసిన ఎన్నికల నేరం!
వాళ్లకు డబ్బులిచ్చి ‘సెటిల్’ చేసుకోవడం కాదు, ఆ ఇచ్చిన డబ్బు ఏ ఖాతాలో ఇచ్చావన్నది పాయింట్. ఓటర్లను మభ్యపెట్టావు సరే, కానీ, ఆ మభ్యపెట్టడానికి ఇచ్చిన డబ్బును ప్రచార ఖర్చుగా చూపించలేదుగా మరి? వేరే వేరే బిల్లులు పెట్టి, ఆ చెల్లింపులను మాయ చేశావా లేదా?
ట్రంప్ మీద నేరారోపణలు అతను పదవినుంచి దిగిపోయాక మొదలైనవి కావు. అతను అధ్యక్షుడిగా ఉండగానే ప్రక్రియ మొదలయింది. అసలు ట్రంప్ గురించి చేస్తున్న అభియోగాలు మన దేశం పెద్దల మీద వస్తే అవి అంగుళమైనా ముందుకు నడుస్తాయా? అసలు, ఏ అప్రదిష్టనయినా మన రాజకీయ నాయకుడు డబ్బులిచ్చి తొలగించుకోవాలనుకుంటాడా? మౌనాన్ని కొనుక్కుంటాడా లేక గొంతులను నులిమేస్తాడా? నిజానికి ఇటువంటి ‘అతి సహజ మగ వ్యసనాలను’ జనం ఖాతరు చేస్తారా? రకరకాల అవినీతులను బోరవిడుచుకుని ప్రదర్శించుకునే బరితెగింపే విలువగా ఇక్కడ చెలామణి అవుతోంది కదా?
అక్కడా ఇక్కడా సమానంగా ఉన్నది మాత్రం ఒకరకం భయం! తప్పు చేసిన వాడిని బోనులో నిలబెడితే, నిందితుడికే సానుభూతి పెరిగి బలవంతుడవుతాడేమోనన్న భయం అది! ట్రంప్‌ను అభిశంసించి, నేరాభియోగం చేసిన తరువాత, కొన్ని గంటలు మాత్రమే అరెస్టయినప్పటికీ, ఆయన హయాంలోనే ఇదంతా మొదలయినప్పటికీ, బైడెన్ ప్రభుత్వమే ఇదంతా చేయిస్తున్నదేమోనన్న అభిప్రాయం ఏర్పడుతుందేమో? 2024లో ట్రంప్ రావడానికి ఇది ఉపయోగపడుతుందేమో? అన్న భయం డెమొక్రాట్స్‌ని మాత్రమే కాదు, ప్రమాదం ముదరకముందే ట్రంప్‌ను విరగడ చేసుకున్నామని నిశ్చింతపడుతున్న ప్రజలందరినీ ఆవరించింది. ఈ లైంగిక సంబంధాల రుసుముల కేసులు నిలబడతాయా? సాధారణ తప్పుకీ, నేరానికీ నడుమ ఉన్న సున్నితమైన అస్పష్ట స్థలంలో ప్రస్తుత కేసు ఊగిసలాడుతోంది. కేపిటల్‌పై దాడి కేసు ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది. ప్రస్తుత కేసు నడుస్తుండగానే, ఆ ముఖ్యమైన కేసు వాయిదాలు, విచారణలు, సాక్ష్యాలు ట్రంప్ మీద అధికార వేధింపులుగా కనిపించవచ్చు. అదొక్కటే కాదు, ట్రంప్ చాలా పెద్ద పెద్ద నేరాలు చేసి ఉండగా, టుమ్రీ కేసు ఇంతదాకా రావడమేమిటి? అన్నది వారి బాధ! ‘మేమిందుకు మాత్రమే అర్హులమేమో, మాకింతే ప్రాప్తమేమో’ అని ఒక అమెరికన్ కాలమిస్టు వ్యాఖ్యానించారు.
మన దేశం ఎంత వెనుకబడి అయినా ఉండవచ్చును కానీ, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, జూదగృహాలు నడిపే వ్యక్తి దేశప్రధాని, అధ్యక్షుడు అయ్యే పరిస్థితి లేదు. రాజకీయ నేరాలు, సాంఘిక నేరాలు, హత్యాకాండలకు మౌన సమ్మతులు, ప్రజలపై అణచివేతలు చేసి ఉండవచ్చును కానీ, ట్రంప్ అంతటి వాచాలత్వం, చౌకబారుతనం ఉన్న వారిని దేశసారథులుగా మనం చూడలేదు. ఇప్పుడిప్పుడు, హీన అభిరుచులుగా పరిగణించే వ్యవహార సరళులు జాతీయ స్థాయి వ్యవహారాలలో కనిపిస్తున్నాయి కానీ, మరీ ట్రంప్ స్థాయి కాదు. దేశ పాలకుడు ఒక కార్పొరేట్ ప్రముఖునితో సన్నిహితంగా ఉంటూ మేళ్లు చేస్తున్నాడనే ఆరోపణ అమెరికాలో కూడా రావచ్చు. కానీ దేశనేత విద్యార్హతలు వివాదాస్పదం కావడం భారతదేశానికి మాత్రం కొత్త విషయమే. తనను విమర్శిస్తూ డాక్యుమెంటరీ తీసినందుకు విదేశీ మీడియా సంస్థ మీద ఆదాయపన్ను దాడి చేయడం సరే, ఆ విదేశీ రాయబార కార్యాలయం దగ్గర్లో పబ్లిక్ టాయ్‌లెట్ కట్టిస్తామని హెచ్చరించడం మాత్రం ట్రంపు మార్కు వెకిలితనమే! ఈ సామీప్యాలు ఏర్పడుతున్నందువల్లనో, ఏమో, భారత ప్రధాని ట్రంప్ మరోసారి ఎన్నిక కావాలని ఆశించి, అమెరికాలోనే ఆ మాట అన్నారు!
ఎందుకు డొనాల్డ్ ట్రంప్‌కూ నరేంద్రమోదీకి సమీకరణం కుదిరింది? భావజాలంలో పోలికలున్నాయి, నిజమే. అంతకుమించి, ఒక గ్లోబల్ వాతావరణం కూడా అనుకూలించింది. పుతిన్ ఎంచుకుని, ప్రోత్సహించిన నాయకుడు ట్రంప్ అన్న ప్రచారం తెలిసిందే. సామాజిక మాధ్యమాల రాజకీయ వినియోగం ట్రంప్-, పుతిన్ సందర్భంలోనే మొదట చర్చలోకి వచ్చింది. యూరప్‌లో అధికారం చేపట్టిన రైటిస్టు నేతల కంటె, పుతిన్‌తోనే ట్రంప్‌కు ఎక్కువ సత్సంబంధాలుండేవి. తానుంటే ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించి ఉండేవాణ్ణని, పుతిన్ మీద యుద్ధం చేసేవాణ్ణని, ఇప్పుడు ట్రంప్ అంటాడు కానీ, ఆ ప్రగల్భాలకు పెద్ద విలువ లేదు. బైడెన్ వచ్చిన తరువాత, ఉక్రెయిన్ యుద్ధం తరువాత మారిన గ్లోబల్ సన్నివేశంలో నరేంద్రమోదీ, పుతిన్, జిన్‌పింగ్ నూతన అక్ష రాజ్యాధినేతలుగా పరిణమిస్తున్నారు. చైనాకూ మనకూ మధ్య చిన్నపాటి వైరం కొనసాగుతూ ఉంటుంది, అదెప్పుడూ మంచుకొండలను దాటదు. అప్పుడప్పుడు చైనా విషయంలో మనతో గొంతు కలుపుతున్నట్టు అమెరికా కనిపిస్తుంది కానీ, విదేశాంగ మంత్రి జయశంకర్ మాటల్లో కరకుదనం చూస్తే దూరం పెరుగుతూనే ఉన్నదనిపిస్తుంది. (లెక్కప్రకారం, అమెరికా ప్రతిపక్ష నాయకుడి అరెస్టును, కేసును భారత్ గమనిస్తున్నది అని మన విదేశాంగ మంత్రి ఒక పోటీ ప్రకటన ఈ పాటికి జారీచేసి ఉండాలి!) అమెరికాలో డెమొక్రాట్లయినా, బ్రిటన్‌లో కన్సర్వేటివ్‌లు అయినా, ఇండియాలోని తీవ్రజాతీయవాద వాతావరణాన్ని ఆమోదించడం లేదు. భారత అంతర్గత పాలనా వ్యవస్థను ఏ ఫిర్యాదూ లేకుండా ఆమోదిస్తున్నవి రష్యా, చైనా మాత్రమే. ట్రంప్ తిరిగి అమెరికన్ రాజకీయ రంగం మీద బలపడడం, గ్లోబల్ మితవాద రాజకీయాలను ప్రభావితం చేస్తుంది.
అమెరికా అనుభవం భారతీయ సమాజానికి ఎంతో ఉపయోగిస్తుంది. రేపు ఒకవేళ ప్రజాస్వామిక శక్తులు బలపడి, భారతదేశంలో రాటుదేలిపోతున్న మెజారిటేరియన్ స్వామ్యం ఓట్ల ద్వారా ఓడిపోయినంత మాత్రాన, పరిస్థితులేమీ పూర్తిగా మారిపోవు. ట్రంప్ ఉన్మాదం, అమెరికన్ సమాజంలో గణనీయంగా ఇంకిపోయి ఉంది. మరోవైపు, మళ్లీ అతను వస్తాడమోనన్న భయం కూడా వ్యాపించి ఉంది. డెమొక్రాట్లు అధికారంలోకి వచ్చి సగం హయాం దాటినా పీడకల చెదిరిపోలేదు. పైగా బైడెన్ మెతకదనం మీద ఆయన ఓటర్లకు కోపంగా కూడా ఉంది.
కె. శ్రీనివాస్