Share News

భూ సంస్కరణలతోనే సామాజిక న్యాయం

ABN , First Publish Date - 2023-10-19T01:10:50+05:30 IST

స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచి అమృత ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ గ్రామీణ భారతంలో ఫ్యూడల్ పోకడలు ఇంకా పోలేదు. దీనివల్ల భూమి, వేతనాలు, ఆత్మగౌరవం లాంటి పదాలు అంటరానివిగా...

భూ సంస్కరణలతోనే సామాజిక న్యాయం

స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచి అమృత ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ గ్రామీణ భారతంలో ఫ్యూడల్ పోకడలు ఇంకా పోలేదు. దీనివల్ల భూమి, వేతనాలు, ఆత్మగౌరవం లాంటి పదాలు అంటరానివిగా మారిపోయాయి. 143 కోట్ల జనాభాలో 80 కోట్ల మంది ప్రజానీకానికి కనీసం సెంటు భూమి గాని, భూమిపై హక్కులు గాని లేవు. ప్రస్తుతం గ్రామీణ భూస్వామ్య రాజ్యాలే యధేచ్ఛగా వర్ధిల్లుతున్నాయి. వ్యవసాయ రంగ అభివృద్ధి పునాదులే ఇతర రంగాల అభివృద్ధికి మూలమని ప్రముఖ ఆర్థికవేత్త గున్నార్ మిర్డాల్ చెప్పారు. వ్యవసాయ ఉత్పాదకత పెరగాలంటే దున్నేవానికే భూమి ఉండాలని నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ లాంటి ఆర్థికవేత్తలు సైతం అభిప్రాయపడ్డారు. 1952లో ప్రారంభించిన కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ పథకంతో వ్యవసాయ రంగంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టి 1965 నాటికి దానిని హరిత విప్లవంగా మార్చారు. ఉత్పాదకతను పెంచడానికి, సామాజికన్యాయ సాధనకు హరిత విప్లవం ఒక్కటే సరిపోదని వ్యవస్థాగత మార్పులు ఆవశ్యమని, భూ సంస్కరణలను ప్రారంభించి రెండు దశలలో అమలుపరిచారు. వెస్ట్ బెంగాల్‌లో తెబాగ, కేరళలో పున్నప్ర, వాయిలారా, మహారాష్ట్రలో వర్లీ ఆదివాసీ పోరాటాలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో వచ్చిన రైతాంగ పోరాటాల స్ఫూర్తితోనే ఈ దేశంలో భూ సంస్కరణలు ఆరంభమయ్యాయి. భూ సంస్కరణల చట్టాలను 1948–53 మధ్య కాలంలో దాదాపు అన్ని రాష్ట్రాలు అమలు జరిపాయి. కానీ చట్టంలో లొసుగులు, పాలకుల చిత్తశుద్ధి లోపం, తదితర అనేక కారణాల వల్ల భూ సంస్కరణల అమలులో రాష్ట్రాల మధ్య తీవ్ర అంతరాలు ఏర్పడి అవి విఫలమైనాయి. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన అశాంతి, 1969లో వచ్చిన నక్సల్బరీ ఉద్యమం కారణంగా భూ సంస్కరణల రెండో దశ చట్టాలు 1970లో అమలు జరిపారు. అయితే ఇప్పటి వరకు పంచింది ఈ దేశంలో 65.5 లక్షల ఎకరాలు మాత్రమే.

ప్రస్తుతం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వ్యక్తులు భూ పంపిణీ కోసం సమరశీల పోరాటాలను పూర్తిగా వదిలేశారు. అయితే ప్రజానీకం మెప్పు పొందటం కోసం గుడిసెల కోసం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం, వేతన పెంపు కోసం, ఆసరా పింఛన్ల కోసం, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. వీటితో బడుగు వర్గాలను మభ్యపెడుతున్నారు. రాజకీయ పార్టీల, వ్యక్తుల, ప్రజాసంఘాల ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం, లబ్ది పొందటం కోసం, చివరిగా అధికారం కోసం అర్థం–పర్థం లేని పోరాటాలు చేస్తున్నారు. ఇది కాదు ఇప్పుడు కావలసింది. భూ పంపిణీ చేస్తూ, గ్రామీణ ఫ్యూడల్ పంపిణీ వ్యవస్థను బద్దలు కొట్టడం.


గ్రామీణ ప్రాంతాల్లో భూమి ఎక్కువ మందికి ప్రధాన జీవనోపాధి వనరు. భూమి యాజమాన్యంలో ఉండే అసమానతలను భూమిని పునః పంపిణీ చేయడం ద్వారా సామాజిక న్యాయాన్ని అందించడానికి భూ సంస్కరణలు అవసరం. వివిధ చట్టాల సంస్కరణల ఆధారంగా 2013 నాటికి 57.3 లక్షల మందికి 65.5 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారు. అయితే మిగులు భూమి విషయంలో 1969 నాటికి పీసీ మహలనోబిస్ 6 కోట్ల 80 లక్షల ఎకరాల మిగులు భూమి ఈ దేశంలో ఉందని అంచనా వేయగా, 2013 నాటికి ప్రభుత్వాలు ప్రకటించిన మిగులు భూమి 92.5 లక్షల ఎకరాలు మాత్రమే. ప్రకటించిన మిగులు భూమిలో కూడా ప్రభుత్వాలు పంచి పెట్టింది కేవలం 64శాతం మాత్రమే. గుజరాత్, బిహార్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల వారీగా 55శాతం భూమి, యూపీ, ఎంపీ– 65శాతం, అస్సాం, మహారాష్ట్ర– 75శాతం, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు– 80శాతం, హర్యానా, ఢిల్లీ, పాండిచ్చేరి– 92శాతం భూమిని పంచాయి. అంటే ఎక్కువ రాష్ట్రాలు ప్రకటించిన తక్కువ భూమిలో కూడా తక్కువ పంచి పెట్టాయి. ఒక్క పశ్చిమ బెంగాల్‌లో జ్యోతిబసు నాయకత్వంలో ఆపరేషన్ బార్గ్ కార్యక్రమం క్రింద 14 లక్షల మంది కౌలుదారులకు 11 లక్షల ఎకరాల భూమిని పంచారు. భూ పంపిణీ చట్టాలలో దేశంలో పంపిణీ చేసిన భూమి మొత్తంలో దాదాపు 20శాతం భూమిని పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వం మాత్రమే పంచింది.

ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలుగా ఉన్న శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ, మీడియా సామాజిక న్యాయ సాధనకు తమ వంతు పాత్రను నిర్వహించాలి. రాజ్యాంగంలోని 11వ షెడ్యూలులో పొందుపరిచిన భూ పంపిణీ చట్టాలను అమలు జరపడానికి ఈ నాలుగు శాఖలు పూనుకుంటే చైనాలో మాదిరిగా 17 రోజులలో భూ సంస్కరణలు ఎందుకు అమలుకావు. దక్షిణ కొరియా లాంటి దేశాల్లో భూ గరిష్ట పరిమితి 7.5 ఎకరాలే ఉన్నది. దీనిని మన ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. మన దేశంలో భూ సంస్కరణలు వైఫల్యానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం, కోర్టు జోక్యాలు, బ్యూరోక్రసీ ఆటంకాలు, వివిధ రాష్ట్రాలలో వివిధ చట్టాలు, భూమి రికార్డు లేకపోవడం, లబ్దిదారులలో ఉదాసీనత, బినామీ పేర్లతో భూములు ఉండటం అని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని ప్రస్తుత ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ సాంకేతిక యుగంలో ప్రభుత్వాలు నిబద్ధత కలిగి ఉంటే ఏ రైతు వద్ద ఎంత భూమి ఉందో తెలుసుకోవడం సులభం కాదా?

పొందూరు ప్రభాకర్ రావు

అర్థశాస్త్ర అధ్యాపకుడు

Updated Date - 2023-10-19T01:10:50+05:30 IST