Welfare Hostels Bills Stop: తిండి బిల్లుకూ తిప్పలే!
ABN, First Publish Date - 2023-02-17T13:40:04+05:30
మేనమామను నేను’ అంటారు. ముద్దులు పెడతారు! కానీ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో వేలమంది విద్యార్థుల తిండీ తిప్పలు మాత్రం పట్టించుకోరు! విద్యార్థుల నోటి ముద్దకు
సంక్షేమ హాస్టళ్లకు చెల్లింపులు బంద్
సీఎఫ్‌ఎంఎస్‌లోనే 150 కోట్ల దాకా పెండింగ్
ఆర్థిక శాఖ చుట్టూ కాంట్రాక్టర్ల ప్రదక్షిణలు
చెల్లించకపోతే సరఫరా చేయలేమని ఆవేదన
బీసీ, ఎస్సీ, మైనారిటీ హాస్టళ్లలో దుస్థితి ఇదీ
మైదాన గిరిజన గురుకులాల్లో మరీ దయనీయం
అప్పులు చేసి ప్రిన్సిపాళ్లు సరుకుల సరఫరా
కొన్ని నెలల నుంచి బిల్లులు పెండింగ్
‘మేనమామను నేను’ అంటారు. ముద్దులు పెడతారు! కానీ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో వేలమంది విద్యార్థుల తిండీ తిప్పలు మాత్రం పట్టించుకోరు! విద్యార్థుల నోటి ముద్దకు సంబంధించిన బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టారు! ఇదీ... జగన్ సర్కారు తీరు!
ఉమ్మడి గుంటూరు జిల్లా (Guntur District)లో వందకుపైగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లు (Social welfare hostels) ఉన్నాయి. వీటికి సరుకులు సరఫరాచేసే కాంట్రాక్టర్లు ఇద్దరు ఉన్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల సరఫరా ఆపివేశారు. అధికారులు సమావేశం నిర్వహించి సరుకులు పంపాలని కోరినా ఫలితం లేదు. దీంతో కొన్ని చోట్ల వార్డెన్లు సొంత నిధులు వెచ్చించి నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాల్సి వస్తోంది.
నెల్లూరు జిల్లా (Nellore District)లోని ఎస్టీ గురుకులాల్లో నిత్యావసరాల సరఫరాకు టెండరు పాడుకున్న కాంట్రాక్టర్లు ధరలు పెరిగినప్పుడల్లా సరఫరా ఆపేస్తున్నారు. రోజు వారీగా సరుకులు రాకపోతే వార్డెన్లే కొనుగోలు చేయాల్సి వస్తోంది. జిల్లాలో గిరిజన హాస్టళ్లకు గత ఏడాది ఆగస్టు వరకు... బీసీ, ఎస్సీ హాస్టళ్లకు డిసెంబరు వరకు మాత్రమే డైట్ బిల్లులు అందాయి.
విశాఖ జిల్లా (Visakha District)లోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల నిర్వహణ భారం పూర్తిగా వార్డెన్ల (Wardens) పైనే పడింది. నగర పరిధిలోని ఓ వసతి గృహానికి చెందిన వార్డెన్ తన సొంత పూచీకత్తుపై సామగ్రి కొనుగోలు చేసి తీసుకువచ్చి విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. నాలుగు నెలల నుంచి డబ్బులు చెల్లించకపోవడంతో... ‘ఇక ఇవ్వలేను సార్’ అని దుకాణదారుడు చేతులెత్తేశాడు. దీంతో వార్డెన్ మరో దుకాణదారుడిని బతిమిలాడి సరుకులు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ వసతి గృహంలో సుమారు వంద మంది పోస్టుమెట్రిక్ విద్యార్థులు ఉంటున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): సమయానికి జీతాలు, పెన్షన్లు ఇవ్వడం లేదు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులూ చెల్లించడం లేదు. వైసీపీ సర్కారు (Ycp government)లో పలువురు కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లి బిల్లులు సాధించుకోవాల్సిన దుస్థితి. చివరకు గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు పాలు, కూరగాయలు, గుడ్లు, సరుకులు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు కూడా ప్రభుత్వం బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా గత నవంబరు నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లకు సరుకులు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదు. దీంతో వచ్చే నెలలో సరుకులు సరఫరా చేయలేమని చెబుతున్నారు. 81 మైదాన ప్రాంత గిరిజన హాస్టళ్లకు గత జూన్ నుంచి సరుకుల బిల్లులు ఇవ్వకపోవడంతో ఎలా నెట్టుకురావాలని ప్రిన్సిపాళ్లు ప్రశ్నిస్తున్నారు. బీసీ, ఎస్సీ, మైనారిటీ హాస్టళ్లకు నిత్యావసర సరుకులు సరఫరా చేసేందుకు ఏ జిల్లాకు ఆ జిల్లాలో జాయింట్ కలెక్టర్లు టెండర్లు నిర్వహించారు. అయితే బిల్లులు మాత్రం జిల్లా యంత్రాంగంతో సంబంధం లేకుండా సీఎ్‌ఫఎంఎస్ ద్వారా అప్‌లోడ్ చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు నేరుగా వారి ఖాతాల్లో బిల్లులు పడతాయని అధికారులు చెబుతున్నారు. అయితే సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఎవరిని అడగాలో అర్థం కాక సరఫరాదారులు ఆందోళన చెందుతున్నారు. సీఎ్‌ఫఎంఎ్‌సలోనే సుమారు రూ.150 కోట్ల దాకా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
బిల్లుల కోసం తిప్పలు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమశాఖ హాస్టళ్లకు సరుకులు సరఫరా చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం సచివాలయంలో ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నారు. నెల నెలా అప్పులు చేసి హాస్టళ్ల (hostels)కు సరుకులు పంపిణీ చేశామని వాపోతున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో నష్టానికి పలు సరుకులు సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనికి తోడు నెలల తరబడి బిల్లులు ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఏ నెలలోనైనా సరుకులు సకాలంలో అందించకపోతే రిమార్కులు రాసి అధికారులు ఇబ్బంది పెడుతున్నారని చెబుతున్నారు. గతంలో సరఫరా చేసిన పెద్ద కాంట్రాక్టర్లు ఎక్కువ మొత్తంలో బిల్లులు పెండింగ్‌లో ఉంటే పైరవీలు చేయించుకుని సాధించుకునేవారు. ఇప్పుడు అన్ని జిల్లాల్లో హాస్టళ్లకు విడివిడిగా టెండర్లు పిలవడంతో చిన్న స్థాయి సరఫరాదారులు సరుకులు సరఫరా చేస్తున్నారు. రాజకీయ అండదండలు లేకపోవడంతో బిల్లులు సాధించుకోలేక సతమతమవుతున్నారు.
సమస్యలతో సతమతం
రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజన విద్యార్థుల హాస్టళ్ల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. 2016లో గిరిజన హాస్టళ్లను గురుకులాలుగా మార్చిన తర్వాత వాటి అభివృద్ధిలో ఎలాంటి పురోగతి లేదని. 81 గురుకులాల పరిస్థితి అధ్వానంగా తయారైందని, అక్కడ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని చెబుతున్నారు. గురుకులాలుగా మార్చినప్పటికీ అక్కడ ఆ వాతావరణం లేదు. అన్ని సబ్జెక్టులకు టీచర్లు లేకపోగా, 100 మంది సామర్థ్యం గల హాస్టళ్ల భవనాల్లో 200 మందికి పైగా వసతి కల్పించాల్సి పరిస్థితి. ఇక సరుకుల సరఫరాకు ప్రభుత్వం టెండర్లు పిలవకుండా ఆయా గురుకులాల ప్రిన్సిపాళ్లు సరఫరా చేయాలని సూచించింది. దీంతో ప్రిన్సిపాళ్లు పెట్టుబడి పెట్టి సరుకులు సరఫరా చేస్తున్నారు. 7 నెలల నుంచి బిల్లులు ఇవ్వకపోవడంతో వారు అప్పులపాలయ్యారు. తాము పట్టించుకోకపోతే పిల్లలు పస్తులు ఉండాల్సి వస్తుందని, బిల్లుల గురించి గట్టిగా అడిగితే సర్కారు కన్నెర్ర చేస్తోందని, అడగకపోతే సరుకులు ఎలా తీసుకురాగలమని ప్రిన్సిపాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరగని డైట్ చార్జీలు
సంక్షేమ విద్యార్థుల డైట్ చార్జీల (Diet charges)ను చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Govt.)లో 2018లో పెంచారు. అప్పటి నుంచి డైట్ చార్జీలు పెంచలేదు. అప్పట్లో సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో చదివే 3, 4 తరగతుల విద్యార్థులకు నెల డైట్ చార్జీలను రూ.750 నుంచి రూ.1000కు పెంచారు. అదేవిధంగా 5 నుంచి 10 తరగతుల విద్యార్థులకు రూ.750 నుంచి రూ.1250కు, ఇంటర్ విద్యార్థులకు రూ.1200 నుంచి రూ.1400కు పెంచారు. ప్రతి ఏటా ఏప్రిల్ 15 కల్లా ఉన్నత స్థాయి కమిటీ సమావేశమై డైట్ చార్జీలు సమీక్షించాలని అప్పట్లో సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ప్రభుత్వంలో ఒక్క ఏడాది కూడా అమలు చేయలేదు. ప్రభుత్వం కేటాయించే బడ్జెట్ కూడా ధరలకు అనుగుణంగా పెరగలేదు. ఉన్న బడ్జెట్‌లోనే సర్దుబాటు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతి ఏటా కేటాయింపులు తగ్గించడంతో పాటు బిల్లులు సరిగా ఇవ్వకపోవడంతో కేటాయించిన వ్యయం కూడా ఖర్చు చేసే పరిస్థితి లేకుండా పోయింది. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోతే ఏ క్షణమైనా వారు సరఫరా నిలిపేసే అవకాశముందని హాస్టళ్ల అధికారులు ఆందోళన చెందుతున్నారు.
Updated Date - 2023-02-17T13:40:06+05:30 IST