Education: డిగ్రీ కోర్సులు మాయం! ఇలాగైతే చదివేదెలా అంటున్న..!?
ABN, First Publish Date - 2023-06-21T13:05:18+05:30
ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు నామమాత్రంగా మారిపోతున్నాయి. సగం సగం డిగ్రీ కోర్సులతో ఇంకా ఎన్నాళ్లు ఉంటాయో అన్న పరిస్థితి. ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ సింగిల్ మేజర్‌లోకి మారిన నేపథ్యంలో
ప్రభుత్వ కాలేజీల్లో అరకొర కోర్సులే..
ప్రైవేటులో 159 మేజర్ సబ్జెక్టులు
ప్రభుత్వ కాలేజీల్లో 81 మాత్రమే..
విద్యార్థులు ప్రైవేటు బాట పట్టేలా చర్యలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు నామమాత్రంగా మారిపోతున్నాయి. సగం సగం డిగ్రీ కోర్సులతో ఇంకా ఎన్నాళ్లు ఉంటాయో అన్న పరిస్థితి. ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ సింగిల్ మేజర్‌లోకి మారిన నేపథ్యంలో అనేక ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పలు కోర్సులు మాయమైపోయాయి. డిమాండ్ ఉండే గణితం, ఫిజిక్స్, కెమిస్ర్టీ, ఎకనామిక్స్, బోటనీ లాంటి సబ్జెక్టులు కూడా అన్ని కాలేజీల్లో అందుబాటులో లేకుండాపోయాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులు కోరుకున్న కోర్సు కాకుండా, అక్కడున్న కోర్సులతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. అధ్యాపకుల కొరతతోనే పూర్తిస్థాయి కోర్సులు అందుబాటులో ఉంచలేకపోయామని కళాశాల విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. అయితే, ఇప్పటివరకూ గెస్ట్ లెక్చరర్లతో కొనసాగించిన కోర్సులను యథావిథిగా కొనసాగించాలని ప్రభుత్వ అధ్యాపకులు కోరుతున్నారు.
ఇలాగైతే చదివేదెలా?
ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. ఇప్పటివరకూ మూడు సబ్జెక్టుల విధానంలో దాదాపుగా అన్ని కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. వాటిని ప్రభుత్వం ఈ ఏడాది నుంచి సింగిల్ మేజర్‌లోకి మార్చింది. అంటే విద్యార్థి మూడు సబ్జెక్టులకు బదులుగా ఒక్క సబ్జెక్టునే మేజర్‌గా డిగ్రీకి ఎంపిక చేసుకోవాలి. మొదటి సెమిస్టర్ పూర్తయ్యాక మైనర్ సబ్జెక్టు ఎంచుకోవాలి. ఈ రెండు సబ్జెక్టులతోనే డిగ్రీ పూర్తిచేయాలి. నాలుగేళ్లలో మేజర్ సబ్జెక్టులో 21 పేపర్లు, మైనర్ సబ్జెక్టులో 6 పేపర్లు పూర్తిచేయాలి. కాగా, ప్రైవేటు కాలేజీలు 159 మేజర్ సబ్జెక్టులను, 94 మైనర్ సబ్జెక్టులను అందిస్తున్నాయి. కానీ ప్రభుత్వ కాలేజీల్లో 81 మేజర్ సబ్జెక్టులే అందుబాటులో ఉన్నాయి. అందులోనూ డిమాండ్ ఉన్న సబ్జెక్టులు అన్ని కాలేజీల్లో లేవు. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో చదవాలనుకునే విద్యార్థులకు కోర్సుల్లో ఆప్షన్లు తగ్గిపోయాయి. ఇంటర్‌లో ఎంపీసీ చదివిన విద్యార్థులు డిగ్రీలో గణితం, ఫిజిక్స్, కెమిస్ర్టీ సబ్జెక్టుల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. కానీ, సమీప ప్రభుత్వ కాలేజీల్లో అవి ఉంటాయన్న గ్యారెంటీ లేదు. దీంతో విద్యార్థులు దూరం అయినా వెళ్లి చదువుకోవాలి. లేదంటే ప్రైవేటు కాలేజీలో అయినా చేరాలి.
సగం కాలేజీల్లో ఎకనామిక్స్ లేదు..
రాష్ట్రంలో 167 ప్రభుత్వ కాలేజీలున్నాయి. అయితే, ఎకనామిక్స్ కోర్సు 84 కాలేజీల్లో మాత్రమే అందుబాటులో ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 11 కాలేజీలుంటే 6 కాలేజీల్లోనే ఆ కోర్సు ఉంది. గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఒక్క కాలేజీలో కూడా ఈ కోర్సు లేదు. జువాలజీ కోర్సు కేవలం 82 కాలేజీల్లోనే ఉంది. కృష్ణా జిల్లాలో ఒక్క కాలేజీలో కూడా ఈ కోర్సు అందుబాటులో లేదు. బోటనీ కోర్సు 76 కాలేజీల్లోనే ఉంది. కెమిస్ర్టీ 92 కాలేజీల్లోనే ఉండగా... కృష్ణా, పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్క కాలేజీల్లోనే ఈ కోర్సు ఉంది. ఆ జిల్లాల్లో కెమిస్ర్టీ చదవాలనుకున్న విద్యార్థులు ఎంత దూరంలో ఉన్నా ఆ కాలేజీకే వెళ్లాలి. చివరికి భారీగా డిమాండ్ ఉన్న కంప్యూటర్ అప్లికేషన్స్ 102 కాలేజీల్లో ఉండగా... శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఒక్కచోట కూడా లేదు. కామర్స్ 118 కాలేజీల్లో ఉంది. గణితం 79 కాలేజీల్లో ఉంటే... మన్యం, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్క కాలేజీకే పరిమితం చేశారు. ఫిజిక్స్ 50 కాలేజీల్లో మాత్రమే అందుబాటులో ఉంది. పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఒక్క కాలేజీలో కూడా ఫిజిక్స్ లేదు. 11 జిల్లాల్లో ఒక్కొక్క కాలేజీలోనే ఈ కోర్సు ఉంచారు. జాగ్రఫీ, హార్టికల్చర్, ఒరియా, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ, ఫిషరీస్, సెరీకల్చర్, ఫార్మాసూటికల్, బీబీఏ, బీబీఏ హెల్త్‌కేర్, స్టాటిస్టిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, ఐఓటీ, క్లౌడ్ కంప్యూటింగ్, నానో టెక్నాలజీ, రెన్యువబుల్ ఎనర్జీ తదితర 39 కోర్సులు రాష్ట్రంలోని ఏదో ఒక కాలేజీలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే ఆ కోర్సులు చదవాలనుకునే పేద విద్యార్థులు జిల్లాలు దాటి ఆ కాలేజీకి వెళ్లాల్సిందే.
Updated Date - 2023-06-21T13:05:18+05:30 IST