Telangana: అలా అన్నందుకే చావబాదాడు
ABN, First Publish Date - 2023-02-20T14:26:39+05:30
గురుకుల పాఠశాల (Gurukula School)లోని హాస్టల్ (Hostel)లో పెట్టే అన్నం సరిగా ఉడకటం లేదని, తినడానికి బాగుండడం లేదని అన్నందుకే విద్యార్థినులను ప్రిన్సిపాల్ (Principal) చితకబాదారు.
మధిర గురుకుల విద్యార్థినుల గోడు
ప్రిన్సిపాల్ కొట్టడంపై ఆర్‌సీవో విచారణ
బీసీ బాలికల గురుకులంలో 18న ఘటన
‘పది’ విద్యార్థినులపై ప్రిన్సిపాల్ దాష్టీకం
చర్యలకు విద్యార్థి సంఘాల డిమాండ్
మధిర, ఫిబ్రవరి 19: గురుకుల పాఠశాల (Gurukula School)లోని హాస్టల్ (Hostel)లో పెట్టే అన్నం సరిగా ఉడకటం లేదని, తినడానికి బాగుండడం లేదని అన్నందుకే విద్యార్థినులను ప్రిన్సిపాల్ (Principal) చితకబాదారు. ఆ దెబ్బలకు విద్యార్థినుల కాళ్లకు వాతలు పడ్డాయి. ఖమ్మం జిల్లా (Khammam District) మధిర (Madira)లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలిక ల పాఠశాలలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనపై విచారణ జరిపేందుకు రీజినల్ కో-ఆర్డినేటర్ (ఆర్‌వోసీ) జ్యోతి ఆదివారం పాఠశాలను సందర్శించారు. ప్రిన్సిపాల్ చేతిలో దెబ్బలు తిన్న బాధిత విద్యార్థినులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పదో తరగతి (10th class) విద్యార్థినులు జరిగిన విషయాన్ని ఆర్‌వోసీకి తెలిపారు. నెలరోజులుగా తమకు సరైన భోజనం పెట్టడంలేదని, ఈ విషయాన్ని విద్యార్థి సంఘం నాయకులకు చెప్పామంటూ ప్రిన్సిపాల్ నసీమా తమను కర్రలతో తీవ్రంగా కొట్టారని చెప్పారు.
విద్యార్థినులు రమ్య, కీర్తన, ప్రవళిక, హిమబిందు తమకు పడిన వాతలను చూపించారు. కాగా, ప్రిన్సిపాల్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, వంట సిబ్బంది, నిత్యావసరాల కాంట్రాక్టర్‌తో సమావేశం నిర్వహించారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్ ఎందుకు కొట్టారన్న అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తానన్నారు. ఇదిలా ఉండగా విద్యార్థినులను కొట్టిన ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని, బాధిత విద్యార్థినులకు న్యాయం చేయాలని ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు ధర్నా చేశారు. బీజేపీ దళితమోర్చా రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్లపల్లి విజయరాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి సాంబశివరావు విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆర్‌సీవోకు ఫిర్యాదు చేశారు.
మార్కులు సరిగా రాలేదనే..: ప్రిన్సిపాల్
విద్యార్థినులను తాను కొట్టిన మాట వాస్తవమేనని ప్రిన్సిపాల్ నసీమా అంగీకరించారు. అయితే మార్కులు సరిగా రానందుకు మందలింపుగా ఒక దెబ్బ కొట్టానని అన్నారు. 70 మంది విద్యార్థినుల్లో 15 మంది ఫెయిల్ అయ్యారని తెలిపారు. భోజనం నాణ్యత లేదని ఆరోపించడాన్ని ఆమె ఖడించారు.
Updated Date - 2023-02-20T14:26:41+05:30 IST