ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Education: ఫీజులు గాలికొదిలేశారు! సొంతంగా డబ్బులు కట్టుకుంటున్న విద్యార్థులు

ABN, First Publish Date - 2023-03-31T15:14:43+05:30

క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే చెల్లిస్తూ...’! విద్యాదీవెన పథకానికి నిధులు విడుదల సందర్భంగా పెద్దపెద్ద అక్షరాలతో

Fees
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విద్యాదీవెన నిధుల విడుదలలో తీవ్ర జాప్యం

ఎప్పటివి అప్పుడే ఇచ్చేస్తున్నామంటూ కలరింగ్‌

సొంతంగా డబ్బులు కట్టుకుంటున్న విద్యార్థులు

ఈ ఏడాదిలో మొదటి త్రైమాసికానికే పరిమితం

మరో మూడు క్వార్టర్ల భారం తల్లిదండ్రులపైనే

వీరందరికీ వచ్చే సంవత్సరమే ఖాతాల్లోకి నగదు

ఫీజు కడితేనే సరిఫికెట్‌ ఇస్తాం... కాలేజీల మెలిక

మొత్తం డబ్బు వసూలు చేసిన యాజమాన్యాలు

ఒక్కో ఇంజనీరింగ్‌ విద్యార్థిపై 35వేలకు పైగా భారం

మూడు విడతలకు కలిపి రూ.2,100కోట్లు పెండింగ్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే చెల్లిస్తూ...’! విద్యాదీవెన పథకానికి నిధులు విడుదల సందర్భంగా పెద్దపెద్ద అక్షరాలతో వైసీపీ సర్కారు (YCP Government) ఇచ్చిన ప్రకటనలోని సారాంశం ఇదీ. ఈ నెల 19న సీఎం జగన్‌ (CM JAGAN) బటన్‌ నొక్కి విద్యాదీవెన నిధులు విడుదల చేశారు. అయితే అవి 2022-23కు సంబంధించిన ఏప్రిల్‌- జూన్‌ క్వార్టర్‌ ఫీజులు. కానీ ప్రకటనలో మాత్రం అక్టోబరు- డిసెంబరు ఫీజులని పేర్కొన్నారు. ఒకవేళ అదే వాస్తవమైతే ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు రెండు క్వార్టర్ల ఫీజులు ఏమైపోయాయని విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (Reimbursement of Fees) విధానం విద్యార్థులు, తల్లిదండ్రులకు శాపంగా మారింది. దాదాపు ఏడాది ఆలస్యంగా ఫీజులు విడుదల చేస్తుండటం వారిపై ఆర్థిక భారాన్ని మోపుతోంది. ఈ సంవత్సరం ఫీజులు వచ్చే ఏడాది... వచ్చే ఏడాది ఫీజులు ఆపై ఏడాది విడుదల చేసే విధానాన్ని వైసీపీ సర్కారు అవలంబిస్తోంది. దీంతో మొదటి సంవత్సరం కోర్సులో చేరిన వారికి రెండో ఏడాదిలో, రెండో ఏడాది ఫీజులు మూడో సంవత్సరంలో, కోర్సు పూర్తిచేసి వెళ్లిపోయినవారికి ఏకంగా ఉద్యోగంలో చేరాక ఫీజులు విడుదల అవుతున్నాయి. కానీ కళాశాల యాజమాన్యాలు మాత్రం ఫీజు కడితేనే సర్టిఫికెట్లు అని మెలిక పెడుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు మరో దారిలేక తమ జేబులో నుంచి ఫీజులు కడుతున్నారు. ఈ ఏడాది కూడా వారిపై ఫీజుల భారం పడింది. ఇంజనీరింగ్‌, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్‌ కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్నవారు ప్రభుత్వం ఇవ్వకపోయినా ఫీజులు కడుతున్నారు. ఇంజనీరింగ్‌ చదివే విద్యార్థుల్లో ఒక్కొక్కరిపై సగటున రూ.35వేలకు పైగా భారం పడుతోంది. ఇప్పటికే బీటెక్‌ చివరి ఏడాది దాదాపు ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో అందరూ సొంతగా డబ్బులు కట్టుకుంటున్నారు. కట్టలేని వారికి సర్టిఫికెట్లు ఇవ్వమని కొన్ని కాలేజీలు, పరీక్షలు రాయనిచ్చేది లేదని కొన్ని కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ ఏడాదికి సంబంధించి మొదటి క్వార్టర్‌ ఫీజులను ప్రభుత్వం పదిరోజుల కిందట విడుదల చేసింది. ఇంకా మిగిలిన మూడు క్వార్టర్లకు సంబంధించిన రూ.2,100కోట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి.

నాలుగు విడతల్లో ఫీజులు

వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఫీజులను కాలేజీల ఖాతాల్లో కాకుండా, తల్లిదండ్రులకు ఇచ్చే విధానం తీసుకొచ్చింది. దీనికి జగనన్న విద్యా దీవెన అని పేరు పెట్టింది. ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికన నాలుగు క్వార్టర్లకు నాలుగు సార్లు ఫీజులు విడుదల చేస్తోంది. ఏ క్వార్టర్‌ ఫీజులు ఆ క్వార్టర్‌కే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది. కానీ వాస్తవానికి ఏడాది ఆలస్యంగా నిధులు విడుదల చేస్తోంది. ఎప్పటి ఫీజులు అప్పుడే అంటే... మొదటి క్వార్టర్‌ ఏప్రిల్‌- జూన్‌ పూర్తికాగానే జూలైలో ఫీజులు ఇవ్వాలి. జూలై- సెప్టెంబరు నగదు అక్టోబరులో, అక్టోబరు- డిసెంబరు నగదు జనవరిలో, జనవరి- మార్చి క్వార్టర్‌ నగదు ఏప్రిల్‌లో విడుదల చేయాలి. కానీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి క్వార్టర్‌ (ఏప్రిల్‌- జూన్‌) ఫీజులు ఈ నెల 19న విడుదల చేసింది. మరో రెండు రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. అంటే ఏప్రిల్‌లో మొత్తం నాలుగు క్వార్టర్‌ల నగదు ఖాతాల్లో వేయాలి. ఇప్పటివరకూ 9.86 లక్షల మంది విద్యార్థులకు కేవలం ఒక్క క్వార్టర్‌ నగదు రూ.698.68కోట్లు విడుదల చేశారు. ఈ లెక్కన మిగిలిన మూడు క్వార్టర్లకు కలిపి రూ.2100 కోట్లు ఏప్రిల్‌లో విడుదల చేస్తే సకాలంలో ఫీజులు చెల్లించినట్లు అవుతుంది. కానీ మరో రెండు నెలల తర్వాతే రెండో క్వార్టర్‌ ఫీజులు ఇచ్చే అవకాశం ఉంది. అప్పటికి 2023-24 విద్యా సంవత్సరం మొదలైపోతుంది.

అందరిపైనా మోత

ఉన్నత విద్యలో ఇంజనీరింగ్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఐటీఐ తదితర కోర్సులకు విద్యా దీవెన కింద ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తోంది. ఇంజనీరింగ్‌ కోర్సులకు రూ.35వేల నుంచి రూ.70వేల వరకు, డిగ్రీకి గరిష్ఠంగా రూ.30వేలు, పాలిటెక్నిక్‌, ఐటీఐలకు రూ.20వేల వరకూ ఫీజులుగా నిర్ణయించింది. వీరిలో ఇంజనీరింగ్‌ విద్యార్థులే ఎక్కువ. వారి ఫీజులు సగటున రూ.50వేలుగా ఉన్నాయి. అంటే క్వార్టర్‌కు రూ.12,500 చొప్పున మూడు క్వార్టర్ల ఫీజు రూ.35వేలకు పైగా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థులు రేపో, మాపో కాలేజీలను వీడిపోతుండటంతో విద్యా దీవెనతో సంబంధం లేకుండా కాలేజీల యాజమాన్యాలు మొత్తం ఫీజులు వసూలు చేశాయి. మిగిలిన కోర్సుల విద్యార్థులపైనా ఇలాగే మూడు క్వార్టర్ల భారం పడింది.

Updated Date - 2023-03-31T15:14:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising