AP: వేమనా.. మన్నించు! తెలుగు తల్లి బదులు తెలంగాణ తల్లి ఫొటో
ABN, First Publish Date - 2023-02-24T12:27:41+05:30
మహనీయుడు యోగి వేమన పేరిట కడపలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ (Yogi vemana university) లో కొందరు తెలుగు తల్లిని, తెలంగాణ తల్లిని
మాతృభాషా దినోత్సవం కార్యక్రమంలో వర్సిటీ తెలుగు విభాగం నిర్వాకం
(కడప-ఆంధ్రజ్యోతి): మహనీయుడు యోగి వేమన పేరిట కడపలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ (Yogi vemana university) లో కొందరు తెలుగు తల్లిని, తెలంగాణ తల్లిని (Telangana Mother) గుర్తించలేని స్థితిలో ఉన్నారు. తెలుగు విభాగం చేసిన నిర్వాకం భాషాప్రియులను నివ్వెరపరుస్తోంది. ఈనెల 21న యూనివర్సిటీలో తెలుగు శాఖ విభాగాధిపతి ఆచార్య జి.పార్వతి అధ్యక్షతన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నిర్వహించారు. ఆర్ట్స్ అండ్ హ్యూమనిటీస్ డీన్ ఆచార్య తప్పెట రాంప్రసాద్‌రెడ్డి, తెలుగు శాఖ ఆచార్యులు, వైవీయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నల్లపురెడ్డి ఈశ్వర్‌రెడ్డి తదితరులు మాతృభాష గొప్పతనం గురించి పద్యాలు, అర్థ తాత్పర్యాలతో వివరించారు. మాతృభాషను ప్రేమించాలని సూచించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై ఫొటోలు చూసి విద్యార్థులు అవాక్కయ్యారు. వేదికపైన డిస్‌ప్లేలో తెలుగు తల్లి బదులు తెలంగాణ తల్లి ఫొటో కనిపించింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు దాటింది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకుంది. తెలుగు తల్లికి, తెలంగాణ తల్లికి తేడా తెలియని వారు యూనివర్సిటీలో ఉండటం బాధాకరమని పలువురు విమర్శిస్తున్నారు.
తెలంగాణ తల్లి ఫొటో ఎందుకో?
డిస్‌ప్లేలో తెలంగాణ తల్లి ఫొటో ప్రత్యక్షమైన విషయాన్ని వైవీయూ తెలుగు విభాగం శాఖాధిపతి ప్రొఫెసర్ జి.పార్వతి దృష్టికి ‘ఆంధ్రజ్యోతి’ తీసుకెళ్లగా.. తెలుగు తల్లి, తెలంగాణ తల్లి రెండు ఫొటోలను రూపొందించామని, ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయన్నారు. ‘అలా తెలంగాణ తల్లి ఫొటో వచ్చినప్పుడు చూసినట్లున్నారు’ అని చెప్పారు.
అక్షరదోషాలు కనిపించవా?
యోగి వేమన వర్సిటీలో తెలుగు భాషకు వచ్చిన దుస్థితి చూసి భాషాప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేమన విగ్రహం పాదాల చెంత రాయించిన పదాలలో కూడా తప్పులున్నాయి. గతేడాది అక్టోబరు 31న వెలుపల గేటు వద్ద యోగి వేమన విగ్రహాన్ని అప్పటి వీసీ, రిజిస్ట్రార్ ఆవిష్కరించారు. విగ్రహం పీఠం భాగంలో ఆవిష్కర్తల పేర్లు రాయించారు. అందులో ‘అద్యాపక, అద్యాపకేతర మరియు పాలకమండలి సభ్యులు’ అని ఉంది. ‘అధ్యాపక’, ‘అధ్యాపకేతర’ అని రాయాల్సింది పోయి తప్పుగా రాశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీలోని అధ్యాపకులంతా పాల్గొన్నారు. అయినా అక్షరదోషాన్ని పట్టించుకోలేదు. వీళ్ల ‘తెగులు తగలెయ్యా’ అంటూ భాషాప్రియులు విమర్శిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆర్టీసీ బస్సులో ఓ యువతిపై మూత్ర విసర్జన చేసిన 25 ఏళ్ల యువకుడు.. విమానంలోనే కాదు.. బస్సులోనూ అదే సీన్ రిపీట్..!
Updated Date - 2023-02-24T12:27:43+05:30 IST