Share News

Israel-Hamas War: హమాస్ ఆ తప్పు చేయడం వల్లే గాజాలో మళ్లీ బాంబులు.. ఆంటోనీ బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-12-02T14:15:19+05:30 IST

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ‘విరామం’ ముగియడానికి హమాస్ చర్యలే కారణమని.. అది నిబంధనల్ని ఉల్లంఘించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. దుబాయ్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో..

Israel-Hamas War: హమాస్ ఆ తప్పు చేయడం వల్లే గాజాలో మళ్లీ బాంబులు.. ఆంటోనీ బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు

Antony Blinken On Israel-Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ‘విరామం’ ముగియడానికి హమాస్ చర్యలే కారణమని.. అది నిబంధనల్ని ఉల్లంఘించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. దుబాయ్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ విరామం ఎందుకు ముగిసిందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ విరామం ముగియడానికి ముందే.. హమాస్ నిబంధనల్ని ఉల్లంఘించి, జెరూసలెంలో దారుణమైన ఉగ్రవాద దాడికి పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు పౌరులు చనిపోగా.. అమెరికన్లతో పాటు ఇతరులు తీవ్ర గాయాలపాలయ్యారు. విరామం ముగిసేలోపే ఆ ఉగ్రసంస్థ రాకెట్లను కాల్చడం మొదలుపెట్టింది. కొంతమంది బందీలను విడుదల చేసే విషయంలో చేసిన కమిట్‌మెంట్స్‌ని కూడా విరమించుకుంది’’ అని చెప్పుకొచ్చారు.


ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలనేదే అమెరికా ఉద్దేశమని.. ఇజ్రాయెల్ బందీల విడుదలపై యూఎస్ దృష్టి సారించిందని ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. హమాస్ వద్ద బందీలుగా ఉన్న ప్రతి ఒక్కరినీ తమతమ ఇంటికి చేర్చి, వారిని తమ కుటుంబాలతో తిరిగి కలిపేందుకు ఈ ఏడు రోజుల విరామ సమయంలో తాము చేయగలిగిందంతా చేశామన్నారు. ఈ ఏడు రోజుల్లో చాలామంది తిరిగి తమ కుటుంబాలతో కలిశారని చెప్పారు. అక్టోబర్ 7వ తేదీ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలకు తాము మద్దతు ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పౌరులను రక్షించడం, అవసరమైన వారికి మానవతా సహాయం అందేలా చూసుకోవడం ముఖ్యం కాబట్టి.. దానిపైనే దృష్టి పెడుతున్నామని, ఆ రెండు వ్యవహారాలను ఒకే సమయంలో నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సంఘర్షణ మరింత వ్యాప్తి చెందకుండా, ఇతర ప్రదేశాల్లో పెరగకుండా సాధ్యమైనంత కసరత్తులు చేస్తున్నామన్నారు.

ఇదిలావుండగా.. అక్టోబర్ 24వ తేదీన ఇజ్రాయెల్, హమాస్ మధ్య గాజాలో కాల్పుల విరమణ, బందీల బదిలీ ఒప్పందం కుదిరింది. దీంతో.. ఏడు రోజుల పాటు ఎలాంటి దాడులు చోటు చేసుకోలేదు. మొదట్లో ఈ ఒప్పందం నాలుగు రోజులకే కుదరగా.. బందీల విడుదల కోసం అదనంగా మరో మూడు రోజులు పొడిగించారు. శుక్రవారం ఈ గడువు ముగియడంతో.. మళ్లీ పరస్పర దాడులు మొదలయ్యాయి. ఈ ఒప్పందాన్ని హమాస్ ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తూ.. గాజాలో వైమానిక, భూతల దాడులకు దిగింది. ఈ దాడుల కారణంగా.. పాలస్తీనా ప్రజల ప్రాణాలు అన్యాయంగా గాల్లో కలిసిపోతున్నాయి.

Updated Date - 2023-12-02T14:15:20+05:30 IST