Elon Musk: ఎలాన్ మస్క్ గిన్నిస్ రికార్డు.. ఆయన ఏం సాధించారో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-01-10T20:04:01+05:30 IST
ట్విటర్ చేజిక్కించుకున్నాక ఆయన పరిస్థితి తారుమారైంది. మస్క్ ప్రస్తుత స్థితికి అద్దంపట్టే ఓ గిన్నిస్ రికార్డు ఆయనను తాజాగా వరించింది.
ఎన్నారై డెస్క్: టెస్లా(Tesla), స్పేస్ ఎక్స్ సంస్థల(SpaceX) అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) అంటే అపర కుబేరుడు..ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. వ్యాపారంలో అద్భుతాలు చేస్తాడు.. ఇవీ మస్క్ విషయంలో ఒకప్పుడు వినిపించిన పొగడ్తలు. కానీ.. ట్విటర్ చేజిక్కించుకున్నాక ఆయన పరిస్థితి తారుమారైంది. మస్క్ ప్రస్తుత స్థితికి అద్దంపట్టే ఓ గిన్నిస్ రికార్డు(Guinness Record) ఆయనను తాజాగా వరించింది. చరిత్రలో అత్యధికంగా వ్యక్తిగత సంపద కోల్పోయి(Loss of Personal Fortune) మస్క్ తాజాగా గిన్సిన్ రికార్డులోకెక్కారు. ఫోర్బ్స్ వార్తను ఊటంకిస్తూ గిన్నిస్ రికార్డు వారు తమ బ్లాగులో ఈ విషయాన్ని ప్రస్తావించారు. 2021 నవంబర్ నుంచి మస్క్ ఏకంగా 182 మిలియన్ డాలర్ల సంపద కోల్పోయారని తెలిపారు. కొన్ని అంచనా ప్రకారం.. మస్క్ నష్టం 200 మిలియన్ల డాలర్లు కూడా ఉండొచ్చని చెప్పారు.
అంతర్జాతీయ పత్రికల ప్రకారం.. నవంబర్ 2021లో 230 మిలియన్ డాలర్లుగా ఉన్న మస్క్ సంపద ఈ ఏడాది జనవరి నాటికి 137 మిలియన్ డాలర్లకు పడిపోయింది. టెస్లా స్టాక్స్ పనితీరు బాగాలేనందుకే మస్క్ సంపద విలువ తరిగిపోయింది. ఆయన ట్విటర్ కొనుగోలుకు సిద్ధపడ్డాక మార్కెట్ విలువ మరింత వేగంగా క్షీణించింది. ‘‘ట్విటర్ కొనుగోలుతో పాటూ మస్క్ వివాదాస్పద వ్యవహార శైలి కారణంగా టెస్లా వాటాదారులు తమ షేర్లు మునుపెన్నడూ చూడని స్థాయిలో అమ్మేందుకు సిద్ధమైనట్టు మీడియా వర్గాలు పేర్కొన్నాయి.