Share News

Israel vs Hamas: గాజాలో అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడి.. 15 మంది మృతి

ABN , First Publish Date - 2023-11-04T08:43:30+05:30 IST

ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్దం కొనసాగుతోంది. పరస్పర దాడులతో రెండు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచదేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.

Israel vs Hamas: గాజాలో అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడి.. 15 మంది మృతి

ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్దం కొనసాగుతోంది. పరస్పర దాడులతో రెండు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచదేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికే రెండు వైపుల వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా హమాస్ అధీనంలోని గాజాపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఓ అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 15 మంది చనిపోగా.. 60 మంది గాయపడ్డారు. గాజా నగరంలోని అల్-షిఫా హాస్పిటల్ సమీపంలో ఈ దాడి జరిగింది. అయితే ఈ ఘటనపై ఇటు హమాస్, అటు ఇజ్రాయెల్ పరస్పరం విరుద్ధ ప్రకటనలను విడుదల చేశాయి. ‘‘ఉత్తర గాజా నుంచి క్షతగాత్రులను తరలిస్తున్న అంబులెన్స్‌పై శుక్రవారం ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 15 మంది చనిపోయారు. 60 మంది గాయపడ్డారు.’’ అని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ‘‘హమాస్ టెర్రరిస్ట్‌లు ఉపయోగిస్తున్న అంబులెన్స్‌ను గుర్తించి దాడి చేశాం. ఈ దాడిలో హమాస్ ఫైటర్లు చనిపోయారు. ఉగ్రవాదులు, ఆయుధాలను బదిలీ చేయడానికి అంబులున్స్‌లను ఉపయోగిస్తున్నారు.’’ అని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.


ఇక ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మరణ మృదంగం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో రెండు వైపుల మృతుల సంఖ్య 10 వేలు దాటింది. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో ఏకంగా 9,227 మంది పాలస్తీయన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఏకంగా 3,826 మంది చిన్నారులు ఉండడం విషాదకరం. ఇక అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడిలో 1,400 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లారు. దీంతో అప్పటి నుంచి రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుపడుతోంది. ముఖ్యంగా తమ హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిని విడిపించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలోని పెద్ద పెద్ద భవనాలు నేలకూలాయి. అనేక మంది తమ నివాసాలను కోల్పోయారు. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పలువురు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాల్చుకుంటున్నారు. మరికొందరేమో ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. మొత్తంగా గాజాలో ఎటు చూసిన హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి.

Updated Date - 2023-11-04T08:43:32+05:30 IST