Putin Offer: వాగ్నర్ గ్రూప్ సైనికులకు పుతిన్ ఇచ్చిన ఆఫర్ ఏమిటంటే...?
ABN , First Publish Date - 2023-06-27T14:41:49+05:30 IST
యెవ్జెనీ ప్రిగోజిన్ సారథ్యంలోని వాగ్నర్ ప్రైవేటు సైన్యం ఈ వారాంతంలో చేసిన తిరుగుబాటును కేవలం 24 గంటల్లోనే అణిచివేసిన రష్యా అధ్యక్షుడు వ్యాడిమిర్ పుతిన్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వాగ్నర్ గ్రూప్ యోధుల్లో చాలా మంది దేశభక్తులున్నారని, వారిని ప్రభుత్వ సైన్యంలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు.
మాస్కో: యెవ్జెనీ ప్రిగోజిన్ (Yevgeny Progozhin) సారథ్యంలోని వాగ్నర్ ప్రైవేటు సైన్యం (Wagner Mercenary troops) ఈ వారాంతంలో చేసిన తిరుగుబాటును కేవలం 24 గంటల్లోనే అణిచివేసిన రష్యా అధ్యక్షుడు వ్యాడిమిర్ పుతిన్ (Vladimir Putin) సోమవారంనాడు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రెండున్నర దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న తమ నాయకత్వం ఎదుర్కొన్న సవాళ్లలో ఈ తిరుగుబాటు ఒకటని అన్నారు. వాగ్నర్ గ్రూప్ యోధుల్లో చాలా మంది దేశభక్తులున్నారని, వారు తమ ప్రజలకు, దేశానికి ద్రోహం చేయలేరని అన్నారు. తిరుగుబాటులో పాల్గొనని సైనికులకు ధన్యవాదాలు తెలిపారు. వారిని ప్రభుత్వ సైన్యంలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు.
''వాగ్నర్ గ్రూపు యోధుల్లో చాలామంది దేశభక్తులు ఉన్నారు. వాళ్లు రష్యా సైనికులతో కలిసి పలు యుద్ధాలలో పోరాడారు. తాము చేసిన పని సరికాదని, సమాజం అంగీకరించదని గ్రహించిన సైనికులకు ఒక అవకాశం ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. రక్షణ మంత్రిత్వ శాఖ కాంట్రాక్టుపై సంతకం చేసి వారు రష్యా సైన్యంలో చేరవచ్చు. లేదంటే ఇళ్లకు తిరిగిపోవచ్చు. ఇచ్చిన వాగ్దానాన్ని నేను నిలుపుకొంటాను. ఛాయెస్ మీకే ఇస్తున్నాను'' అని వాగ్నర్ గ్రూపు సైనికులను ఉద్దేశించి పుతిన్ అన్నారు.
పుతిన్ ఆహ్వానంతో వాగ్నార్ గ్రూప్ సైనికులు రష్యా ఆర్మీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రిగోజిన్ ఇప్పుడు రష్యాలో లేకపోవడం కూడా ఇందుకు కారణమవుతోంది. వాగ్నర్ గ్రూపు సైనికుల్లో వేలాది మంది ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని రష్యా అక్రమిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు.
అజ్ఞాతంలో ప్రిగోజిన్
మరోవైపు, వాగ్నార్ గ్రూపు చీఫ్ ప్రిగోజిన్ తమకు తిరుగుబాటు చేయాలనే ఆలోచన లేదని చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో తన ప్రైవేటు మిలటరీ కంపెనీని కీలక పాత్ర పోషించిందని, తమ కంపెనీని ధ్వంసం చేసేందుగు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నమే తాము చేశామని చెప్పారు. తమకు జరుగుతున్న అన్యాయాలపైనే తాము స్పందించామని ఆయన అజ్ఞాత ప్రదేశం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. తాను ఎక్కడున్నది, తన భవిష్యత్ వ్యూహాలేమిటనేవి ఆయన వెల్లడించలేదు.
తిరుగుబాటుకు కారణం ఏమిటి?
ఉక్రెయిన్‌లోని వాగ్నార్ గ్రూప్ శిక్షణా శిబిరంపై రష్యా ఆర్మీ ఇటీవల క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో పలువురు వాగ్నార్ గ్రూప్ సైనికులు మరణించడం వివాదానికి కారణమైంది. రష్యా ఆర్మీ జనరల్స్ ఈ దాడులకు ఆదేశించిందని, తమ ప్రైవేటు సైన్యాన్ని మట్టుబెట్టడమే ఆర్మీ ఉద్దేశంగా కనిపిస్తోందని ప్రిగోజిన్ ఆరోపించారు. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రైవేటు సైనికులు రష్యా సైన్యంలో చేరాలని కూడా రష్యా రక్షణ శాఖ ఇటీవల ఒక ఉత్తర్వును జారీ చేసింది. ఈ ఉత్తర్వు ప్రిగోజిన్‌కు మరింత ఆగ్రహం తెప్పించింది. రష్యా సైన్యంతో ఒప్పందానికి ప్రిగోజిన్ ససేమిరా చెప్పారు. ప్రిగోజిన్ ఆర్మీలో 50 వేల మందికి పైగా ప్రైవేటు సైనికులు ఉన్నారు.