Share News

ప్రతిష్ఠకు ఎంపికయిన 4.25 అడుగుల బాల రాముని విగ్రహం

ABN , Publish Date - Dec 28 , 2023 | 03:35 AM

‘‘రాముని ప్రతిమల్లో మూడు డిజైన్లు మా ముందుకు వచ్చాయి. వాటిలో స్వచ్ఛమైన తెల్లని మకరానా మార్బుల్‌తో చేసిన 51 అంగుళాల (4.25 అడుగులు) విగ్రహాన్ని ఎంపిక చేశాం. ఆ విగ్రహంలో దైవత్వం

ప్రతిష్ఠకు ఎంపికయిన  4.25 అడుగుల బాల రాముని విగ్రహం

తెల్లని మకరానా మార్బుల్‌తో తయారీ

అయోధ్య ఆలయ నిర్మాణ విశేషాలను వివరించిన క్షేత్ర కార్యదర్శి రాయ్‌

అయోధ్య, డిసెంబరు 27: ‘‘రాముని ప్రతిమల్లో మూడు డిజైన్లు మా ముందుకు వచ్చాయి. వాటిలో స్వచ్ఛమైన తెల్లని మకరానా మార్బుల్‌తో చేసిన 51 అంగుళాల (4.25 అడుగులు) విగ్రహాన్ని ఎంపిక చేశాం. ఆ విగ్రహంలో దైవత్వం మూర్తీభవిస్తుంది. చూడడానికి ఐదేళ్ల బాల రాముడిని తలపిస్తుంది’’ అని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆలయ నిర్మాణ విశేషాలను వివరించారు. ‘‘యావత్‌ దేవాలయ నిర్మాణానికి 21 నుంచి 22 లక్షల క్యూబిక్‌ మీటర్ల రాయిని వాడారు. ఉత్తర భారతదేశంలో కానీ, దక్షిణాన కానీ ఇంత పెద్ద రాతి కట్టడాన్ని గడచిన 100 - 200 ఏళ్లలో ఎవరూ నిర్మించలేదు. ఈ రాతి నిర్మాణం దిగువున పునాదుల్లో 56 పొరల కృత్రిమ రాయిని ఇంజనీర్లు తయారు చేశారు. గుడి లోపలి భాగంలో భూమి నుంచి 21 అడుగుల ఎత్తు వరకూ గ్రానైట్‌తో తాపడం చేశాం. తెలంగాణ, కర్ణాటక నుంచి తెప్పించిన 17,000 గ్రానైట్‌ బ్లాక్‌లు ఇందుకోసం వినియోగించాం. గుడి నిర్మాణంలో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ నుంచి తెప్పించిన సుమారు ఐదు లక్షల క్యూబిక్‌ అడుగుల గులాబీ రంగు శాండ్‌ స్టోన్‌ను ఉపయోగించాం. గర్భగుడిని స్వచ్ఛమైన తెలుపుతో కూడిన మకరానా మార్బుల్‌తో నిర్మించాం. 2019లో సుప్రీం కోర్టు హిందువులకు అప్పగించిన 70 ఎకరాల్లో ఉత్తర భాగంలో దేవాలయాన్ని నిర్మిస్తున్నాం. మూడు అంతస్థుల దేవాలయ ప్రాంగణంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌ పూర్తయింది. మొదటి అంతస్థు నిర్మాణంలో ఉంది. గుడికి నాలుగు వైపులా ప్రాకారాన్ని నిర్మిస్తున్నాం. ఈ ప్రాకారం 14 అడుగుల వెడల్పు, మొత్తంగా పొడవు 2,460 అడుగులు ఉంటుంది. రెండు అంతస్థుల ఈ ప్రాకారంలో పై అంతస్థులో భక్తులు దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి అనుమతిస్తాం. ఇది పూర్తి కావడానికి ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుంది. యాత్రికుల సేవా కేంద్రంలో 25 వేల మంది యాత్రికులకు సరిపడా లాకర్‌ సౌకర్యాన్ని సమకూరుస్తున్నాం. చిన్న ఆస్పత్రి అందుబాటులో ఉంటుంది. భక్తులకు మరుగుదొడ్డి, ఇతర అవసరాలకు కోసం అతిపెద్ద కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నాం. ఆలయ అవసరాల కోసం ప్రత్యేకంగా 33 కేవీ విద్యుత్‌ లైను వేస్తున్నారు. ఆలయం లోపలే విద్యుత్‌ పంపిణీ కేంద్రం ఉంటుంది. నీటి అవసరాలకు భూగర్భ జలాలపై అధారపడతాం. మరీ అవసరమైతే సరయూ నదినుంచి తీసుకుంటాం. ఇక్కడ వాడిన నీరు ఇక్కడే భూమిలోకి ఇంకిపోతుంది. మొత్తం 70 ఎకరాల్లో కేవలం 20 ఎకరాల్లో మాత్రమే నిర్మాణాలు ఉంటాయి. మిగిలిన 50 ఎకరాల్లో సూర్య కిరణాలు భూమిని సోకనంత ఒత్తుగా వృక్షాలు ఉంటాయి. ఈ వృక్షాలన్నీ 100 ఏళ్ల చరిత్ర కలిగినవే. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటడం అనేది ఉండదు’’ అని రాయ్‌ వివరించారు. కాగా, విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ శనివారం అయోధ్య రానున్నారు. మరోవైపు అయోధ్య నుంచి రామాలయానికి దారితీసే ప్రధాన రహదారి... రామ్‌ పథ్‌, సుమారు 13 కి.మీ. ఈ మార్గంలో ఇరువైపులా ఉన్న దుకాణాలన్నీ జై శ్రీరామ్‌ నినాదాలతో, స్వస్తిక్‌ గుర్తుతో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Dec 28 , 2023 | 06:27 AM