Heavy Rains Effect: భారీ వర్షాలకు శివాలయం కూలి 9 మంది మృతి.. ప్రమాద ప్రాంతానికి సీఎం
ABN, First Publish Date - 2023-08-14T13:18:37+05:30
హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. సోమవారం కురిసిన భారీ వర్షాల కారణంగా సిమ్లాలోని శివాలయం కూలిపోయింది. ఈ ఘటనలో ఏకంగా 9 మంది మరణించారు.
హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. సోమవారం కురిసిన భారీ వర్షాల కారణంగా సిమ్లాలోని శివాలయం కూలిపోయింది. ఈ ఘటనలో ఏకంగా 9 మంది మరణించారు. సమ్మర్‌హిల్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంపై కొండచరియలు విరిగిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల కింద 21 మంది వరకు ఉన్నట్లు సమాచారం. వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో నేడు శ్రావణ సోమవారం కావడంతో భక్తులు శివాలయానికి భారీగా తరలివచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆలయంలో 50 మంది వరకు ఉన్నారని సమాచారం. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ సిమ్లాలో శివాలయం కూలిపోయిన బాధాకరమైన వార్తలు వెలువడ్డాయి. ఇప్పటివరకు తొమ్మిది మృతదేహాలను వెలికి తీశారు. స్థానిక యంత్రాంగం శిథిలాలను తొలగించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.” అని ఆయన ఒక ట్వీట్‌లో రాశారు. అలాతే తాను ప్రమాదం జరిగిన ప్రాంతాన్నికి వెళ్లనున్నట్లు సీఎం తెలిపారు.
"హిమాచల్‌ప్రదేశ్‌లో గత 48 గంటలుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. బియాస్ నది నీటిమట్టం పెరిగింది. భారీ వర్షాల కారణంగా కొంతమంది మరణించారు. శివాలయం కూలిపోవడంతో తొమ్మిది మంది మృతదేహాలను వెలికితీశారు. నేను ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లబోతున్నాను. అధికారులందరూ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు" అని సీఎం సుఖ్వీందర్ సింగ్ (himachal pradesh cm sukhvinder singh sukhu) మీడియాతో చెప్పారు. గత 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి అనేక రహదారులు మూసుకుపోయాయి. ఇప్పటివరకు 700కు రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. కీలకమైన సిమ్లా-చండీగఢ్ రహదారిపై కూడా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. వర్షాలు కారణంగా కొండచరియలు విరిగిపడటంతో హమీర్‌పూర్‌లో వ్యవసాయం పంటలు, సారవంతమైన భూములు దెబ్బతిన్నాయి. కాగా స్థానిక వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఆగస్టు 14 నుంచి 17 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.
Updated Date - 2023-08-14T13:37:07+05:30 IST